జూన్ నెల ముగుస్తున్నా... ఇంతవరకు గోదావరి పరివాహక ప్రాంతంలో ఎక్కడా ఒక్క చుక్క వర్షం కురవలేదు. దీంతో గోదావరిలో నీటి రాకడ తగ్గిపోతోంది. 2014లో కూడా ఇదే పరిస్థితి ఎదురైంది. 10 రోజుల క్రితం జిల్లాలో అక్కడక్కడ కొద్దిపాటి చిరుజల్లులు పడ్డాయి. కానీ ప్రస్తుతం వాతావరణం వేసవిని మరిపించే విధంగా ఉంది. దీనితో ఖరీఫ్ నారుమళ్లకు విత్తనాలు చల్లుదామనుకున్న రైతులు వెనక్కి తగ్గుతున్నారు. వాతావరణం పరిస్థితి ఇలా ఉంటే వర్షాలు లేక గోదావరికి నీటి రాకడ పూర్తిగా పడిపోవడంతో ఉభయగోదావరి జిల్లాల రైతులకు పూర్తిస్థాయిలో సాగునీరు అందించలేని పరిస్థితి ఏర్పడింది. ప్రస్తుతం ఉభయగోదావరి జిల్లాల్లోని 10.50 లక్షల ఎకరాలకు సీలేరు, బలిమేల నుంచి వస్తున్న జలాలే దిక్కయ్యాయి. ఈ నెల 18 వరకు మూడు డెల్టాలకు 7,450 క్యూసెక్కుల సాగు నీటిని అందించగా, గోదావరిలో నీటి మట్టం మరింత పడిపోతుండటంతో బుధవారం నుంచి 7,050 క్యూసెక్కులు మాత్రమే అందిస్తున్నారు.
పశ్చిమడెల్టా కాలువలకు విజ్జేశ్వరం హెడ్‌స్లూయిస్ నుంచి బుధవారం 3,600 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. దీనిలో భాగంగా జీ అండ్‌వీ కాలువకు 500, నరసాపురం కాలువకు 1253, ఉండి కాలువకు 928, ఏలూరు కాలువకు 605, అత్తిలి కాలువకు 190 క్యూసెక్కుల చొప్పున సాగునీటిని విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం జిల్లాలో రైతులు ఖరీఫ్ పనుల్లో నిమగ్నమై ఉన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో సాగునీటి సరఫరాను పెంచాల్సి ఉంది. కనీసం 5000 క్యూసెక్కులకు పైగా నీటిని విడుదల చేయాల్సి ఉంది. కానీ రైతులు అవసరం మేరకు కూడా సాగునీటిని అందించకపోగా, క్రమంగా తగ్గిస్తున్నారు. దీంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పలుచోట్ల ఇంజిన్లు, మోటార్లు ఏర్పాటు చేసుకుని నీటిని తోడుకుంటున్నారు.