యువ్ న్యూస్ జనరల్ బ్యూరో:
అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్, ప్రధాని నరేంద్ర మోదీ, జపాన్ ప్రధాని అబేలు ఇవాళ కలుసుకున్నారు. ఒసాకాలో జరుగుతున్న జీ20 సమావేశంలో ముగ్గురు ప్రత్యేకంగా చర్చించనున్నారు. ఇండో పసిఫిక్ ప్రాంతానికి సంబంధించిన అనేక అంశాలపై మాట్లాడుకున్నారు. కనక్టెవిటీ, మౌళిక సదుపాయాల కల్పన గురించి అభిప్రాయాలను పంచుకున్నారు. త్రైపాక్షిక సంబంధాల గురించి ప్రధాని మోదీ ట్వీట్ చేశారు. మీటింగ్ అర్థవంతంగా సాగినట్లు ఆయన చెప్పారు. ట్రంప్, అబేలు కూడా తమ అభిప్రాయాలను వెల్లడించినట్లు మోదీ తెలిపారు. డోనాల్డ్ ట్రంప్‌తో ప్రత్యేకంగా అనేక అంశాలపై చర్చించినట్లు మోదీ తన ట్విట్టర్‌లో తెలిపారు. టెక్నాలజీ రంగాన్ని విస్తరించడం, రక్షణ- భద్రత, వాణిజ్య సంబంధాల బలోపేతానికి సంబంధించిన అంశాలను ప్రస్తావించినట్లు మోదీ తెలిపారు. అమెరికాతో ఆర్థిక, సాంస్కృతి సంబంధాలను పటిష్టం చేసేందుకు భారత్ కట్టుబడి ఉందని మోదీ చెప్పారు. వాణిజ్య అంశంపై భారత్‌తో కలిసి కట్టుగా పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నామని ట్రంప్ కూడా తెలిపారు. అధిక సుంకాలను విధిస్తున్నదని భారత్‌పై గురువారం ట్వీట్ చేసిన ట్రంప్ ఇవాళ వాణిజ్య సంబంధాల గురించి తన మీటింగ్‌లో సానుకూలంగా స్పందించారు. మనం గొప్ప స్నేహితులం అవ్వామని, మన దేశాలు మరింత దగ్గరయ్యాయని ట్రంప్ తెలిపారు. ఇరాన్‌తో పాటు అనేక ప్రపంచ దేశాల అంశాలను ట్రంప్, మోదీలు చర్చించారు. 5జీ కమ్యూనికేషన్స్ గురించి కూడా వాళ్లు మాట్లాడుకున్నారు. మరోవైపు ఇరు దేశాల మధ్య వాణిజ్యంపై చర్చ జరిగిందని భారత్ వాణిజ్యపరంగా తీసుకుంటున్న చర్యలను ట్రంప్ స్వాగతించారని విదేశాంగ కార్యదర్శి విజయ్ గోఖలే చెప్పారు. ట్రంప్, మోదీల భేటీ ఫలవంతంగా సాగిందని అన్నారు. 5జీ సాంకేతికతను సమర్ధంగా వినియోగించుకునేందుకు భారత్ చేపడుతున్న చర్యలను వివరించగా ట్రంప్ సంతృప్తి వ్యక్తం చేశారని, ఈ అంశంలో అమెరికా-భారత్ కలిసి పనిచేసేందుకు సంసిద్ధత వ్యక్తం చేశారని తెలిపారు. ప్రధాని మోదీ రెండోసారి అధికార పగ్గాలు అందుకున్న అనంతరం అమెరికా అధ్యక్షుడితో భేటీ కావడం ఇదే తొలిసారి.లోక్‌సభ ఎన్నికల్లో ఘనవిజయం సాధించి మళ్లీ అధికార పీఠం అధిష్టించిన మోదీకి ట్రంప్ అభినందనలు తెలిపారు. ఇంతటి భారీ విజయానికి మీరు అర్హులని ప్రధాని మోదీని ఉద్దేశించి ట్రంప్ వ్యాఖ్యానించారు. కాగా ట్రంప్, మోదీ పలు ద్వైపాక్షిక, అంతర్జాతీయ అంశాలపై చర్చించారని పీఎంఓ ట్వీట్ చేసింది