YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు సినిమా

ఫర్వాలేదనిపించిన కల్కి

ఫర్వాలేదనిపించిన కల్కి

యువ్ న్యూస్ ఫిల్మ్ బ్యూరో: 

ఒక దర్శకుడి ప్రతిభ ఏపాటిదో చెప్పడానికి ఒక్క సినిమా చాలు. రొటీన్‌కు భిన్నంగా క్రియేటివ్ కథలతో సినిమాలు తెరకెక్కించే దర్శకులు తెలుగు సినీ పరిశ్రమలో చాలా తక్కువ. అలాంటి దర్శకుడే ప్రశాంత్ వర్మ. ఆయనలోని టాలెంట్‌ను గుర్తించిన హీరో నాని ‘అ!’తో ప్రశాంత్ వర్మకు అవకాశం ఇచ్చారు. తానేంటో ఆ సినిమాతో ప్రశాంత్ నిరూపించుకున్నారు. దీంతో ఆయన తరవాత ప్రాజెక్ట్‌పై కాస్త అంచనాలు ఏర్పడ్డాయి. దీనికి తోడు రాజశేఖర్ లాంటి సీనియర్ హీరోను పెట్టి ‘కల్కి’ అనే పవర్‌ఫుల్ టైటిల్‌తో సినిమా తెరకెక్కించడంతో ప్రేక్షకుల్లో ఆసక్తి పెరిగింది. యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ సినిమా శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చిన తరవాత నిజాం సామ్రాజ్యంలోని కొల్లాపూర్‌ సంస్థానంలో జరిగిన సంఘటనలను ఇతివృత్తంగా చేసుకుని రాసుకున్న ఫిక్షనల్ స్టోరేనీ ‘కల్కి’. కొల్లాపూర్ సంస్థానానికి సేనాధిపతిగా ఉన్న నర్సప్ప (అశుతోష్ రాణా).. రజాకార్లతో చేతులు కలిపి రాజును వెన్నుపోటు పొడుస్తాడు. రాజ కుటుంబం మొత్తాన్ని అంతంచేసి సంస్థానాన్ని తన ఆధీనంలోకి తెచ్చుకుంటాడు. ఆ తర్వాత నర్సప్ప చేయని దుర్మార్గాలు ఉండవు. జనాన్ని పీక్కుతింటాడు. స్వాతంత్య్రం తర్వాత జరిగిన తొలి ఎన్నికల్లో ఎమ్మెల్యేగా ఎన్నికవుతాడు. అయితే, నర్సప్ప తమ్ముడు శేఖర్ బాబు (సిద్ధు జొన్నలగడ్డ)కు ఊళ్లో మంచి పేరుంటుంది. ప్రజలతో చాలా ప్రేమగా మెలుగుతుంటాడు. అలాంటి వ్యక్తిని అత్యంత దారుణంగా చంపేస్తారు. ఈ కేసును ఇన్వెస్టిగేట్ చేయడానికి ఐపీఎస్ అధికారి కల్కి (రాజశేఖర్) వస్తారు. ఇక్కడే కథలో పెద్ద ట్విస్టు ఉంటుంది. అదేంటో తెలియాలంటే సినిమా చూడాలి! కథ ఎంత బాగున్నా దాన్ని తెరపై నడిపించే కథనం సక్రమంగా లేకపోతే ఆ సినిమా దండగే. ట్విస్టులతో కూడుకున్న కథకు పదునైన స్క్రీన్‌ప్లే తోడతైనే ఆ సినిమా ప్రేక్షకుడి నాడికి తగులుతుంది. అలాంటి స్క్రీన్‌ప్లేలోనే లోపం ఉంటే ప్రేక్షకుడు థియేటర్‌లో విసిగిపోవడం ఖాయం. ఈ ‘కల్కి’ సినిమా చూసినప్పుడు ఇదే జరుగుతుంది. దర్శకుడు ప్రశాంత్ వర్మ రాసుకున్న కథ చాలా బలంగా ఉంది. క్లైమాక్స్ చూసిన ప్రేక్షకుడు వారెవ్వా ఏం ట్విస్ట్ అనకమానడు. కానీ, క్లైమాక్స్‌కు ముందు జరిగిన డ్రామా, యాక్షన్ ప్రేక్షకుడిని విసిగించేస్తాయి. ఫస్టాఫ్‌లో ఒక్క ఆసక్తికర సన్నివేశం కూడా కనిపించదు. చాలా నెమ్మదిగా సాగే కథనానికి తోడు రాజశేఖర్, అదాశర్మ లవ్‌స్టోరీ చికాకు తెప్పిస్తుంది. ఫస్టాఫ్‌తో పోలిస్తే సెకండాఫ్ పర్వాలేదనిపిస్తుంది. అయినప్పటికీ కథనం నెమ్మదిగానే సాగింది. ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్ మాత్రం ఆసక్తిని రేకెత్తించింది. ఏదీ యాదృచ్ఛికంగా జరగదు అంతా కర్మ ఫలితమే అని ఈ సినిమా చెప్పే నీతి. ట్విస్టులతో కూడుకున్న కథను ఒక డ్రామాలా తెరకెక్కించారు తప్ప ప్రేక్షకుడు సీటుకు అతుక్కుపోయే థ్రిల్లర్‌లా చూపించలేకపోయారు. స్క్రీన్‌ప్లే పవర్‌ఫుల్‌గా రాసుకునుంటే సినిమా స్థాయి ఇంకోలా ఉండేది. కొన్ని సన్నివేశాల్లో దర్శకుడు హారర్ సినిమాను గుర్తుకుచేశారు. రాజమహల్‌లోకి జర్నలిస్టు దత్త (రాహుల్ రామకృష్ణ) వెళ్లినప్పుడు వచ్చే సన్నివేశాలు, దత్త భయపడే తీరు భయంతో పాటు నవ్వు కూడా తెప్పిస్తాయి. వాస్తవానికి ఇలాంటి సినిమాలకు హీరో క్యారెక్టర్ చాలా పవర్‌ఫుల్‌గా ఉండాలి. కానీ, ఈ సినిమాలో అదే లోపించింది. ఇలాంటి పవర్‌ఫుల్ క్యారెక్టర్‌ను రాజశేఖర్ పండించలేకపోయారు. ఆయనలో వయసు స్పష్టంగా కనిపించిపోతోంది. దీనికి తోడు రాజశేఖర్ మేకప్ బాగా ఓవర్ అనిపిస్తుంది. మేకప్ వేసినట్టు స్పష్టంగా తెలిసిపోతుంది. ఆయన ముఖంలో కూడా కళ తగ్గింది. బాగా చిక్కిపోయారు. యాక్షన్ సన్నివేశాలనైతే బాగానే మ్యానేజ్ చేశారు. పోలీస్ స్టేషన్ వద్ద ఫైట్, ఫారెస్ట్‌లో యాక్షన్ ఎపిసోడ్ బాగున్నాయి. నిజానికి కల్కి పాత్రలో రాజశేఖర్ కన్నా ఓ యంగ్ హీరో అయితే ఇంకా బాగున్నేమో! హీరో పాత్ర తరవాత సినిమాలో ప్రధానంగా చెప్పుకోవాల్సింది జర్నలిస్టు దత్తు పాత్ర. రాహుల్ రామకృష్ణ ఈ పాత్రలో చాలా నేచురల్‌గా నటించారు. ఆయన భయపడుతున్న ప్రతిసారి ప్రేక్షకుడు నవ్వుతాడు. సినిమాలోని ప్రతి ఫ్రేమ్‌లో రాజశేఖర్, రాహుల్ రామకృష్ణ కనిపిస్తారు. ఇక రాజశేఖర్ ప్రేయసిగా నటించిన అదాశర్మకు సినిమాలో పెద్ద స్కోప్ లేదు. నందితాశ్వేత పాత్ర సినిమాకు కీలకమే అయినా ఆమెకు స్క్రీన్ స్పేస్ తక్కువే. విలన్ పాత్రలో అశుతోష్ రాణా ఎప్పటిలానే బాగా నటించారు. శత్రు, సిద్ధు జొన్నలగడ్డ, పూజిత పొన్నాడ, నాజర్ తదితరులు తమ పాత్రల పరిధిమేర నటించారు. సాంకేతికంగా సినిమా బాగానే ఉంది. సినిమాటోగ్రాఫర్ దాశరథి శివేంద్ర పనితనం బాగుంది. 1980 కాలానికి తగ్గుట్టుగా కెమెరా వర్క్ ఉంది. ఆర్ట్ డైరెక్టర్ కూడా మంచి ఔట్‌పుట్ ఇవ్వగలిగారు. యాక్షన్ సన్నివేశాలు బాగున్నాయి. శ్రవణ్ భరద్వాజ్ మంచి నేపథ్య సంగీతం సమకూర్చారు. వాస్తవానికి యాక్షన్ సన్నివేశాల్లో హీరోయిజం కన్నా బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్కే బాగుంది. సినిమాలో రెండు పాటలున్నాయి. బాగున్నాయి కానీ, ఈ కథకు వాటి అవసరంలేదు. మాస్ ఆడియన్స్ కోసం ‘హారన్ ఓకే ప్లీజ్’ పాటను చొప్పించారని అర్థమవుతోంది.

చివరిగా..
కథ బాగున్నా దానికి మంచి కథనాన్ని జోడించలేకపోయారు. కేసు ఇన్వెస్టిగేషన్‌లో ఈ ‘కల్కి’ గెలిచినా ప్రేక్షకుల అంచనాలను అందుకోవడంలో విఫలమయ్యాడు

Related Posts