వైవిధ్యభరితమైన చిత్రాల ద్వారా తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన నటుడు శ్రీ విష్ణు. నీది నాది ఒకే కథ, వీర భోగ వసంత రాయలు సినిమాలతో గత ఏడాది మనల్ని పలకరించిన ఈ హీరో ఈసారి ‘బ్రోచేవారెవరురా’ అంటు మన ముందుకొచ్చారు. ‘మెంటల్ మదిలో’తో ప్రేక్షకులను ఆకట్టుకున్న వివేక్ ఆత్రేయ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. నివేదా థామస్, నివేత పేతురాజ్ హీరోయిన్లుగా.. ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ, సత్యదేవ్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రం శుక్రవారం ప్రేక్షకుల ముందుకొచ్చింది. టీజర్, ట్రైలర్లతో అంచనాలు పెంచిన ఈ చిత్రం ఎలా ఉందో రివ్యూ ద్వారా తెలుసుకుందాం. ఆర్3 బ్యాచ్‌గా పిలిచే రాహుల్ (శ్రీవిష్ణు), రాకీ (ప్రియదర్శి), ర్యాంబో (రాహుల్ రామకృష్ణ).. మూడుసార్లు ఇంటర్ తప్పి మళ్లీ అదే కాలేజీలో చదువుతుంటారు. ఆకతాయిగా తిరుగుతూ కాలక్షేపం చేసేవారికి వీరికి ప్రిన్సిపాల్ కూతురు మిత్ర (నివేదా థామస్) పరిచయం అవుతుంది. చదువంటే అస్సలు గిట్టని ఈ నలుగురు ఓ బ్యాచ్‌గా ఏర్పడతారు. భరతనాట్యాన్ని ఎంతో ఇష్టపడే మిత్ర.. తల్లి చనిపోయాక తండ్రి దగ్గరకు వస్తుంది. కాలేజీ ప్రిన్సిపాల్ అయిన తండ్రి పదే పదే చదవమని బలవంతం చేయడంతో ఇంట్లో నుంచి వెళ్లిపోవాలని డిసైడ్ అవుతుంది. ఆమెకు సాయం చేసే క్రమంలో ఆర్3 బ్యాచ్ కష్టాల్లో పడుతుంది. వీరు చేసిన పనికి వీరితోపాటు విశాల్ (సత్యదేవ్), షాలిని(నివేత) ఎలా ఇబ్బందుల్లో పడ్డారనేది తెర మీద చూడాల్సిందే. కామెడీకి సస్పెన్స్ జత చేసి వివేక్ ఆత్రేయ ఈ సినిమాను తెరకెక్కించారు. క్యారెక్టర్ల పరిచయం, కామెడీతో ఫస్టాప్ సరదాగా గడిచిపోతుంది. ఆర్3 బ్యాచ్ మధ్య వచ్చే బూతులతో కూడిన జోకులు ప్రేక్షకులను నవ్విస్తాయి. పెద్ద వాళ్లను ఈ బూతులు ఒకింత ఇబ్బంది పెట్టొచ్చు కానీ.. మనం ఫ్రెండ్స్‌తో మాట్లాడుకుంటే ఎంతో సహజంగా ఉంటుందో.. వీరి ముగ్గురి మధ్య సాగే సీన్లు అంతే సహజంగా ఉంటాయి. ఇంటర్వెల్ ముందు ట్విస్ట్ ఇచ్చిన దర్శకుడు సినిమాపై ఆసక్తిని పెంచాడు. తొలి అర్ధ భాగంలో ప్రేక్షకులు ఫుల్‌గా నవ్వుకుంటే.. సెకండాఫ్ ట్విస్టులతో సాగుతుంది. ఫస్టాఫ్ ఆకట్టుకున్నంతగా.. సెకండాఫ్ ఆకట్టుకోలేదు. ఇంటర్వెల్ తర్వాత కథనం కాస్త మందగించింది. సాగదీసిన భావన కలుగుతుంది. కానీ అది కాసేపే, ఓ అర గంట తర్వాత ప్రేక్షకుడు సినిమాలో లీనమవుతాడు. ఈ ట్విస్టుల కారణంగా చివరకు ఎలాంటి ముగింపు ఉంటుందో అనుకుంటాం. కానీ డైరెక్టర్ మాత్రం ఓస్ ఇంతేనా అనుకునేట్టుగా మూవీని ముగించారు. పిల్లల ఇష్టాయిష్టాలను తల్లిదండ్రులు పట్టించుకోకుండా.. తమ అభిరుచులను బలవంతంగా పిల్లలపై రుద్దితే ఏమవుతుందనే ఓ చిన్న లైన్ తీసుకొని.. దాన్ని స్క్రీన్ మీద సాధ్యమైనంత బాగా చూపించే ప్రయత్నంలో దర్శకుడు వివేక్ ఆత్రేయ సఫలమయ్యారు. శ్రీ విష్ణు, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ బాగా నటించారు. నివేదా థామస్ నటనతో, డ్యాన్స్‌తో ఆకట్టుకుంది. ప్రత్యేకంగా పాటలను ఇరికించలేదు కానీ బ్యాక్‌గ్రౌండ్‌లో అలా వచ్చి వెళ్తుంటాయి. సమాజంలో మనకు తారసపడే వ్యక్తుల పాత్రలే ఈ సినిమాలోనూ మనకు కనిపిస్తాయి. ఎడిటింగ్ వర్క్ ఇంకొంచెం బాగుండి, సెకండాఫ్ మరింత గ్రిప్పింగ్‌గా ఉండే సినిమా ఓ రేంజ్‌లో ఉండేది. స్క్రీన్ ప్లే ఈ సినిమాకు హైలెట్.
ఫైనల్‌గా
సరదాగా నవ్వుకోవాలని అనుకునేవారు ఈ సినిమాను తప్పకుండా చూడొచ్చు. ఏం చేసైనా సరే ప్రేక్షుకుడిని థియేటర్‌కు రప్పించడం సినిమా గోల్ ఒక్కటే.. ఆ లక్ష్యాన్ని చేరుకోవడంలో ‘బ్రోచేవారెవరురా’ సక్సెస్ అయినట్టే.