YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

వ‌చ్చే ఏడాదిలోగా తీవ్ర రూపం దాల్చ‌నున్న‌ నీటి కొర‌త! 2018 నీతి ఆయోగ్ రిపోర్ట్ లో వెల్ల‌డి

వ‌చ్చే ఏడాదిలోగా తీవ్ర రూపం దాల్చ‌నున్న‌ నీటి కొర‌త!            2018 నీతి ఆయోగ్ రిపోర్ట్ లో వెల్ల‌డి

వ‌చ్చే ఏడాదిలోగా సుమారు 21 న‌గ‌రాల్లో నీటి కొర‌త తీవ్ర రూపం దాల్చ‌నున్న‌ది. 2018 నీతి ఆయోగ్ రిపోర్ట్ ఇదే విష‌యాన్ని వెల్ల‌డించింది. ఈ ఏడాది రుతుపవనాల ఆగమనం ఆలస్యం కావడంతో దేశంలోని పలు ప్రాంతాలు నీటి ఎద్దడితో అల్లాడుతున్నాయి. మహారాష్ట్ర, తమిళనాడు రాష్ర్టాల్లో దాదాపు సంక్షోభ స్థితి నెలకొంది. దేశంలోని దాదాపు 50 శాతం ప్రాంతాలలో నీటి కొరత ఏర్పడినట్టు అధికార గణాంకాలు వెల్లడిస్తున్నాయి. దేశంలోని దాదాపు 55 శాతం వ్యవసాయయోగ్యమైన భూమి వర్షాలపై ఆధారపడి ఉన్నది. రుతుపవనాలు ఆలస్యం కావడంతో వానాకాలం పంటల సాగు ఆలస్యమైంది. భారత వాతావరణ విభాగం (ఐఎండీ) వెల్లడించిన వివరాల ప్రకారం ఈ నెలలో ఇప్పటికే 24 శాతం లోటు వర్షపాతం నమోదైంది. ఈ నెల 1- 19 తేదీల మధ్య కురిసిన వర్షపాతం దీర్ఘకాల సగటు (ఎల్పీఏ) కన్నా 43 శాతం తక్కువ అని ఐఎండీ తెలిపింది. మధ్య భారతంలో పరిస్థితి మరింత తీవ్ర స్థితికి చేరింది. అక్కడ 54 శాతం లోటు వర్షపాతం నమోదైంది. మహారాష్ట్ర, తమిళనాడు, మధ్యప్రదేశ్‌లోని కొన్ని ప్రాంతాల్లో కరువు పరిస్థితి నెలకొంది. మహారాష్ట్ర అంతటా 60 శాతం లోటు వర్షపాతం నమోదు కాగా, నిత్యం కరువుతో అల్లాడే విదర్భ, మరాఠ్వాడా ప్రాంతాల్లో 89 శాతం వరకు లోటు వర్షపాతం నమోదైంది. కొంకణ్, మధ్య మహారాష్ట్రలోని కొన్ని ప్రాంతాల్లో మాత్రమే ఓ మోస్తరు వర్షాలు పడ్డాయి.కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ) ఇచ్చిన నివేదిక ప్రకారం దేశంలోని మొత్తం 91 ప్రధాన రిజర్వాయర్లలో 11 పూర్తిగా ఎండిపోయాయి. 59 రిజర్వాయర్లలో సగటు నిల్వ కన్నా 80 శాతం తక్కువ నీళ్లున్నాయి. కృష్ణా, గోదావరి, కావేరీ తీర ప్రాంతాలలో నీరు దాదాపు కనుమరుగైంది. పదేండ్ల సగటును బట్టి చూస్తే కావేరీ నదిలో 22 శాతం నీటికి బదులుగా 12.57 శాతం జలాలే ఉన్నాయి. గోదావరి నదిలో 8.72 శాతం, కృష్ణాలో 5.72 శాతం నీరు తగ్గిపోయింది. వర్షాభావం పరిస్థితుల నేపథ్యంలో భూగర్భ జలాల వినియోగం పెరిగింది. 2007 నుంచి 2017 మధ్య భూగర్భజలాలు 61 శాతం తగ్గిపోయాయి. గుజరాత్‌లో దశాబ్దానికి 20 మీటర్ల చొప్పున అడుగంటుతున్నాయి. మహారాష్ట్రలోని యావత్మాల్, చంద్రాపూర్, అమరావతి, అకోలా, బీడ్ జిల్లాల్లోని 9వేల కిలోమీటర్ల పరిధిలో భూగర్భ జలాలు నాలుగు మీటర్ల కన్నా దిగువకు వెళ్లిపోయాయి.కేంద్ర జలవనరుల మంత్రిత్వ శాఖ వివరాల ప్రకారం, 2001- 2011 మధ్య దేశంలో వార్షిక తలసరి నీటి లభ్యత 15 శాతం పడిపోయింది. 2025 నాటికి మరో 13 శాతం, 2050 నాటికి మరో 15 శాతం పడిపోగలదని అంచనా. అంటే 30 ఏండ్ల తర్వాత ప్రతి భారతీయుడికి ఏడాదికి 11 లక్షల లీటర్ల నీరు మాత్రమే లభ్యమవుతుంది. ప్రపంచ ప్రమాణాల ప్రకారం, తలసరి నీటి లభ్యత 10 లక్షల లీటర్ల కన్నా తగ్గితే.. ఆ దేశం నీటి కొరతను ఎదుర్కొంటున్నట్టు. రానున్న కాలంలో భారతదేశ జనాభా చైనాను అధిగమించనుంది. దీంతో దేశంలో జల సంక్షోభం మరింత తీవ్రమవుతుంది. నివాస ప్రాంతాలకు సమీపంలో స్వచ్ఛమైన నీరు అందుబాటులో లేని దేశాల జాబితాలో భారత్‌ను వాటర్ ఎయిడ్ సంస్థ ఇప్పటికే మొదటి స్థానంలో చేర్చింది.
రెండు మూడు వారాలలో దేశంలో వర్షపాతం మెరుగుపడకపోతే వ్యవసాయ రంగంలో సంక్షోభం ఏర్పడవచ్చని నిపుణులు పేర్కొంటున్నారు. రైతులకు ట్రాక్టర్ల దగ్గర నుంచి ఎరువులు, వినియోగ వస్తువులు విక్రయించే కంపెనీలపై ఆ ప్రభావం ఉంటుందని అంటున్నారు. విత్తనాలు వేయడం ఇప్పటికే మూడు వారాలు ఆలస్యమైందని, మరో మూడు వారాల్లో వర్షపాతం పెరుగకపోతే వానాకాలం పంటలు తుడిచిపెట్టుకుపోయినట్టేనని ముంబైకి చెందిన నిపుణుడు హరీశ్ గాలిపెల్లి అన్నారు. ఈ ఏడాది కూడా వర్షాభావ పరిస్థితులు కొనసాగితే ఆర్థిక వృద్ధి తీవ్రంగా దెబ్బతింటుందని నిపుణులు పేర్కొంటున్నారు.

Related Posts