YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం

రాజకీయాల్లో అస్తమించిన హుందాతనం – భండారు శ్రీనివాసరావు

రాజకీయాల్లో అస్తమించిన హుందాతనం – భండారు శ్రీనివాసరావు

యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:

అటల్ బిహారీ వాజ్ పాయ్ విదేశాంగ మంత్రి. అప్పటివరకు ఢిల్లీ సౌత్ బ్లాక్ లో ఉంటూ వచ్చిన నెహ్రూ చిత్రపటం కనబడకపోవడాన్ని ఆయన గమనించారు. నెహ్రూ ఫోటోను తక్షణం అక్కడ పెట్టాలని ఆదేశించడం, అది అమలుకావడం జరిగింది. ఈ రోజుల్లో ఈ హుందాతనాన్ని ఊహించగలమా? పార్లమెంటులో ప్రసంగిస్తూ వాజ్ పాయ్ ఆనాటి ప్రధాని నెహ్రూను తీవ్రంగా విమర్శించారు. ఆ సాయంత్రం అటల్ బిహారీ వాజ్ పాయ్ పార్లమెంటు హాలులోకలిసినప్పుడు నెహ్రూ ఆయన భుజం తట్టి ‘బాగా మాట్లాడావు’ అని మెచ్చుకున్నారు.  ఈ రోజుల్లో అలాంటి హుందాతనాన్ని ఊహించగలమా!  వాజ్ పాయి ముందు విదేశాంగ మంత్రి అయ్యారు. తరువాత అదే పదవిని పీవీ నరసింహా రావు స్వీకరించారు. వాజ్ పాయి వ్యక్తిగత సిబ్బందిని అందర్నీ కొనసాగించడానికి పీవీ నిర్ణయించారు. ఈరోజుల్లో అలాంటి హుందాతనాన్ని ఊహించగలమా!  ముందు పీవీ ప్రధాని అయ్యారు. తరువాత అదే పదవిని వాజ్ పాయ్ అలంకరించారు. అప్పటికే పీవీ, దేశప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని అణుపరీక్ష నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు. ఈలోగా వాజ్ పాయ్ ప్రభుత్వం వచ్చింది. పీవీ నరసింహా రావు, ఎవరూ గమనించకుండా వాజ్ పాయ్ చేతిలో ఒక చీటీ పెట్టారు. “అణుపరీక్షకు సర్వం సంసిద్ధంగా వుంది. ముందుకు తీసుకు వెళ్ళాల్సిన బాధ్యత మీపై వుంది” పీవీ సలహాను వాజ్ పాయ్ పాటించారు. పోఖ్రాన్ లో అణుపరీక్షను జయప్రదంగా నిర్వహించారు. పీవీ మరణించినప్పుడు ఇచ్చిన సంతాప సందేశంలో వాజ్ పాయ్ ఈ సంగతి వెల్లడించేవరకు ఈ విషయం గోప్యంగానే వుంది. ఈ హుందాతనాన్ని నేటి రాజకీయాల్లో ఊహించగలమా! పీవీ ప్రధానమంత్రి, జెనీవాలో జరిగిన మానవహక్కుల సదస్సుకు అప్పట్లో ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న వాజ్ పాయ్ నాయకత్వంలో భారత ప్రతినిధివర్గాన్ని పంపాలని నిర్ణయించారు. కాంగ్రెస్ పార్టీకి చెందివారిని కాకుండా విపక్షానికి చెందిన వ్యక్తిని  పీవీ ఎంపిక చేయడం ఆ పార్టీవారికి రుచించలేదు. అలాగే బీజేపీ వారికి కూడా వాజ్ పాయ్ ఆ ఆహ్వానాన్ని అంగీకరించడం పట్ల అభ్యంతరాలు వున్నాయి. కానీ భారత ప్రతినిధివర్గం నాయకుడిగా జెనీవా సదస్సులో వాజ్ పాయ్ ప్రసంగించిన తీరు, భారత దేశ విధానాన్ని వ్యక్తం చేసిన పద్దతి ఆ తర్వాత అందరి ఆమోదాన్ని పొందింది. ఈనాటి రాజకీయాల్లో ఇలాంటి హుందాతనాన్ని ఊహించగలమా!  తదనంతర కాలంలో పీవీ రాసిన పుస్తకాన్ని వాజ్ పాయ్ ఆవిష్కరించారు. అలాగే వాజ్ పాయ్ రచించిన కావ్యాన్ని పీవీ ఆవిష్కరించారు. పాలక, ప్రతిపక్షాలు రెండూ నిప్పూ ఉప్పూ తరహాలో కాట్లాడుకుంటున్న ఈనాటి రాజకీయ వాతావరణంలో ఆనాటి హుందాతనాన్ని ఊహించగలమా!

Related Posts