జమ్ముకశ్మీర్ లో రాష్ట్రపతి పాలనను మరో ఆరు నెలలు పొడిగించడంపై అధికార, విపక్షాల మధ్య వాదోపవాదాలు జరుగుతున్నాయి. ఆర్టికల్ 370, 35ఏ రద్దుకు చర్యలు తీసుకుంటామని కేంద్ర ప్రభుత్వం చెబుతుండగా... కశ్మీర్ లో పరిస్థితులను మరింత దిగజార్చి రాజకీయ లబ్ధి పొందేందుకు యత్నిస్తున్నారని విపక్షాలు మండిపడుతున్నాయి.ఈ నేపథ్యంలో బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రామ్ మాధవ్ మాట్లాడుతూ... కాంగ్రెస్, నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీలు కశ్మీర్ లో ఉగ్రవాదానికి బీజం వేశాయని చెప్పారు. దీని ఆసరాగా తీసుకుని పాకిస్థాన్ రెచ్చిపోయిందని అన్నారు. జమ్ముకశ్మీర్ ను బీజేపీ నేతృత్వంలోని సంకీర్ణ ప్రభుత్వం కేవలం రెండున్నరేళ్లు మాత్రమే పాలించిందని... కాంగ్రెస్, దాని మిత్ర పక్షాలు దశాబ్దాల పాటు పాలించాయని చెప్పారు. దివంగత ప్రధాని నెహ్రూ నుంచి ఇప్పటి వరకు కాంగ్రెస్ తీసుకున్న నిర్ణయాల వల్లే కశ్మీర్ లో సమస్యలు పుట్టుకొచ్చాయని విమర్శించారు.1987లో కశ్మీర్ స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్, నేషనల్ కాన్ఫరెన్స్ రిగ్గింగ్ కు పాల్పడ్డాయని... దాంతో, అప్పుడు పెద్ద ఎత్తున హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నాయని రామ్ మాధవ్ తెలిపారు. ఈ పరిస్థితిని ఆసరాగా చేసుకుని ఉగ్రవాదాన్ని పాకిస్థాన్ పెంచి పోషిస్తోందని అన్నారు.