యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:
ఏపీ మాజీ సీఎం చంద్రబాబు నాయుడు ప్రస్తుతం ఉంటోన్న లింగమనేని గెస్ట్ హౌస్‌కు రాష్ట్ర ప్రభుత్వం నోటీసులు జారీ చేసింది. ఇది అక్రమ కట్టడమని చెబుతున్న ప్రభుత్వం.. బాబు నివాసాన్ని కూల్చి వేసేందుకు సిద్ధపడుతోంది. చంద్రబాబు తక్షణమే నివాసాన్ని ఖాళీ చేయాలని వైఎస్ఆర్సీపీ నేతలు సూచిస్తున్నారు. దీంతో టీడీపీ అిధినేత మరో ఇంటికి మారాల్సిన పరిస్థితి. ఈ నేపథ్యంలో.. బాబు నివాసానికి అనువైన ఇంటి కోసం టీడీపీ నేతలు అన్వేషిస్తున్నారు. ఇప్పటికే విజయవాడలోని ఓ ఇంటిని ఖరారు చేశారని తెలుస్తోంది. కాగా చంద్రబాబు తమ ఇంట్లో ఉండాలంటూ టీడీపీ నేతలు కోరుతున్నారు. గుంటూరులోని తన ఇంటిని ఖాళీ చేస్తానని.. బాబు అందులో నివాసం ఉండాలని మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావు కోరారు. మా ఇల్లు ఖాళీగా ఉంది, మీరు వెంటనే అందులోకి మారండని వెలగపూడి మాజీ సర్పంచ్ ఒకరు చంద్రబాబును కోరారు. రాజధాని పరిధిలో చంద్రబాబు ఇల్లు కట్టుకోవడానికి వీలుగా తమ భూమిని ఉచితంగా అందజేస్తామని కొందరు రైతులు ముందుకొచ్చారు. రాష్ట్ర రాజధాని నిర్మాణం కోసం మా భూములను ప్రభుత్వానికి ఇచ్చాం, మా హక్కుల కోసం పోరాడే మీకు ఉచితంగా ఇంటిని ఇస్తామని రైతులు చంద్రబాబుతో తెలిపారు. ప్రస్తుత ప్రభుత్వం వ్యవహరిస్తోన్న తీరుతో.. భూముల ధరలు పడిపోయాయని, మరింత పడిపోయే ప్రమాదం ఉందని రాజధాని ప్రాంత రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.