యువ్ న్యూస్ జనరల్ బ్యూరో:
సూర్య గ్రహణం అమావాస్య నాడు మాత్రమే వస్తుంది. అయితే అన్నీ అమావాస్యలకు సూర్యగ్రహణం ఏర్పడదు. సూర్యుడు, చంద్రుడు, భూమి ఒకే సరళ రేఖపై ఉండి చంద్రుడు రాహువు లేదా కేతువుస్ధానంలో ఉన్నప్పుడు మాత్రమే సూర్యగ్రహణం ఏర్పడుతుంది. పూర్తి సూర్యగ్రహణ సమయం 8 నిమిషాలకు మించి ఉండదు. సూర్యుడికి, భూమికి మధ్య చంద్రుడు రావడం వల్లనే సూర్యగ్రహణం ఏర్పడుతుంది. దీంతో భూమిమీద కొంత భాగానికి సూర్యుడు కనిపించకుండా పోతాడు. సంపూర్ణ సూర్యగ్రహణం సంభవించే సమయంలో స్థానిక ఉష్ణోగ్రత కూడా భారీగా తగ్గిపోయే అవకాశం ఉంటుంది. రాహువు అనే రాక్షసుడు సూర్యుడిని మింగేయడంవల్ల గ్రహణం ఏర్పడుతుందని భారతీయ వేదాంతులు బలంగా నమ్ముతారు. ఈ ఏడాదిలో రెండో సూర్యగ్రహణం జులై 2న ఏర్పడుతుంది. భారతీయ కాలమాన ప్రకారం... జులై 2 బుధవారం రాత్రి 10.21 గంటలకు ప్రారంభమవుతుంది. అర్ధరాత్రి 2.15 నిమిషాలకు సమాప్తమవుతుంది. దాదాపు నాలుగు గంటలపాటు సూర్యగ్రహణం ఉంటుంది. ఇది సంపూర్ణ గ్రహణమే. అయితే, మన దేశంలో కనిపించదని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. కానీ, చైనాతోపాటు అర్జెంటీనా, ఉత్తరమెరికాలోని దక్షిణ ప్రాంతంలో దర్శనమిస్తుందని నాసా తెలిపింది. ఐరోపాలో దీనిని చూడలేమని తెలిపారు. అయితే డిసెంబరు 26 ఏర్పడే సూర్యగ్రహణం మాత్రం దేశంలో కనిపిస్తుంది. ఆధ్యాత్మికంగా గ్రహణం సమయానికి చాలా విశేషముంది. గ్రహణం పట్టగానే నదీ స్నానం చేసి, నదీ తీరాన జపం చేసుకుంటే ఆ ఫలితం ఇంకా ఎక్కువ. గ్రహణ స్పర్శ కాలమున నదీస్నానం, మధ్యకాలమున తర్పణం, జపం, హోమం, దేవతార్చన విడిచిసమయంలో దానం, స్నానం చేయటం మంచిది. గ్రహణ కాలమున భాగవన్నామస్మరణ చేయటం ఉత్తమం. గురువు ఉపదేశించిన మంత్రజపం, వశీకరణం, శత్రుపీడనం నుంచి విముక్తికి, మానసిక ప్రశాంతతకు గాయత్రి మంత్ర జపం గ్రహణ కాలమందు, ఏడురోజుల వరకు తప్పనిసరిగా ఆచరించాలి. గ్రహణం రోజు ఉపవాస దీక్ష చేస్తే మంచిది. గ్రహణ సమయంలో గో భూ హిరణ్యాది (గోవులను, భూములను, బంగారాన్ని) దానం చేయమని చెబుతారు. జ్యోతిష్యశాస్త్రం ప్రకారం జన్మ నక్షత్ర, రాశ్యాదులలో గ్రహణం చెడు ఫలితాలను ఇస్తుంది. ఎవరి జన్మరాశి, జన్మ నక్షత్రంలో గ్రహణం ఏర్పడుతుందో వారికి విశేషంగా పూజలు, జపాలు, దానాలు చేయాలి. గ్రహణం పడిన నక్షత్రంలో ఆరు నెలలు ముహూర్తాలు నిషేదిస్తారు. జన్మరాశి నుంచి 3,6,10,11 రాశులలో గ్రహణమైన శుభప్రధం 2,5,7,9 రాశులలో మధ్యమం, మిగిలిన రాశులలో అరిష్టం. ప్రస్తుత సూర్యగ్రహణం ఆర్ద్ర నక్షత్రం, మిథునరాశిలో ఏర్పడుతుంది. కాబట్టి ఈ నక్షత్ర కలిగిన వ్యక్తులు దానాలు, జపాలు చేయాలి.