ప్రపంచకప్‌లో మరో ఆసక్తికర పోరుకు రంగం సిద్ధమైంది. టోర్నీలో అపజయం ఎరుగని ఏకైక జట్టు టీమ్ఇండియా.. ఫేవరెట్‌గా బరిలోకి దిగి అంచనాలకు తగ్గట్లు ఆడలేక సెమీస్ అవకాశాల్ని ప్రమాదంలో పడేసుకున్న ఇంగ్లాండ్‌ను ఆదివారం ఢీకొనబోతోంది. ఆతిథ్య జట్టుకు అత్యంత కీలక మ్యాచ్ కావడంతో ఈ మ్యాచ్‌పై క్రికెట్ అభిమానులందరి దృష్టీ నిలిచి ఉంది. ప్రపంచకప్ ఆరంభానికి ముందు ప్రత్యర్థులందరినీ బెదరగొట్టే ఫామ్‌లో ఉన్న ఇంగ్లిష్ జట్టు.. ఇప్పుడు ఇంత సంక్లిష్ట స్థితిలో ఉంటుందని ఎవ్వరూ అనుకోలేదు. టోర్నీ ఆరంభంలో పాకిస్థాన్ చేతిలో కంగుతిన్న ఆ జట్టు.. తాజాగా శ్రీలంక, ఆస్ట్రేలియాల చేతుల్లో వరుస ఓటములు ఎదుర్కొంది. 7 మ్యాచ్‌లాడి 4 విజయాలతో 8 పాయింట్లు సాధించిన ఇంగ్లాండ్.. చివరి రెండు మ్యాచ్‌ల్లో భారత్, న్యూజిలాండ్‌లపై గెలిచి తీరాల్సిన స్థితిలో నిలిచింది. కాబట్టి ఆదివారం చెలరేగి ఆడాలని పట్టుదలతో ఉంది ఇంగ్లాండ్. కానీ వరుస విజయాలతో దూసుకెళ్తున్న కోహ్లీసేన.. అంత తేలిగ్గా లొంగకపోవచ్చు. దాదాపుగా నాకౌట్ బెర్తు ఖరారు చేసుకున్న భారత్.. గెలుపు బాట వీడాలనుకోవట్లేదు.