యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:
టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు కేంద్రంగా టీడీపీ రాజకీయాలు వేడెక్కాయా? పార్టికి బలమైన కాపు సామాజిక వర్గం ఈయనను ఇప్పుడు టార్గెట్ చేస్తోందా? అంటే ఔననే అంటున్నారు పరిశీలకులు. తాజాగా మారుతున్న రాజకీయ పరిణామాలను గమనిస్తే.. కాపు సామాజిక వర్గం మొత్తం కూడా టీడీపీలో తీవ్ర అసంతృప్తితో రగిలిపోతోంది. నిజానికి చంద్రబాబు తన పాలనా కాలంలో కాపు వర్గానికి అనేక రూపాల్లో సాయం చేశారు. అయినప్పటికీ.. ఈ వర్గం ఇప్పడు పార్టీలో అసంతృప్తిని వ్యక్తం చేస్తోంది. దీనికి ప్రధాన కారణాలేంటి? అనే విషయాలపై దృష్టి పెట్టినప్పుడు ఆసక్తికర విషయం వెలుగు చూసింది.దీని ప్రకారం చూసుకున్నప్పుడు.. ప్రధాన కారణం యనమల రామకృష్ణుడు అని భావిస్తున్నారు. ఉభయ గోదావరి జిల్లాలలో కాపులు అధిక సంఖ్యలో ఉన్నారు. దీంతో ఆయా జిల్లాల్లో వీరి ఆధిపత్యమే ఎక్కువగా ఉంది. అయితే, చంద్రబాబు ఆయా జిల్లాలలో పార్టీ తరఫున యనమలకు పెద్ద ఎత్తున ప్రాధాన్యం కల్పించారు. బీసీ వర్గానికి చెందని యనమల తన వర్గానికి ప్రాధాన్యం ఇచ్చారన్న విమర్శలు కాపు నేతల నుంచి తీవ్రంగానే వినిపించాయి. ఎన్నికలకు ముందు సీట్ల విషయంలో, పార్టీ తరపున ఫండింగ్ ఇచ్చే విషయాల్లో చంద్రబాబు యనమలకు కీలక బాధ్యతలు అప్పగించారు.యనమల రామకృష్ణుడు మాత్రం తనకు కావాల్సిన వారికి సీట్లు ఇచ్చేందుకు, కొన్ని చోట్ల సిట్టింగ్ ఎమ్మెల్యేలను కంటిన్యూ చేసేందుకు తెరవెనక చేయాల్సిందంతా చేశారని.. అదే టైంలో మిగిలిన వారితో పోలిస్తే కాపు ఎమ్మెల్యే అభ్యర్థులకు తక్కువుగానే ఫండింగ్ ఇచ్చారని టాక్ బయటకు వచ్చింది. ఇటీవల కాపు నేతల భేటీలోనూ ఇదే అంశం ప్రధానంగా ప్రస్తావనకు వచ్చిందట. ముఖ్యంగా తూర్పుగోదావరి జిల్లాలో కొందరు పార్టీలో కీలక నేతలతో పాటు కాపు సామాజికవర్గం ఓటర్లు కూడా పార్టీకి దూరమవుతున్నారని పార్టీ నేతలే గగ్గోలు పెడుతున్నారు.అంతెందుకు యనమల రామకృష్ణుడు ఆరుసార్లు వరుసగా గెలిచిన తునిలో కాపులను బాగా ఇబ్బంది పెట్టడంతోనే అక్కడ యనమల ఫ్యామిలీ గత మూడు ఎన్నికల్లోనూ వరుసగా ఓడిపోతూ వస్తోంది. అసలు ఇప్పట్లో అక్కడ యనమల ఫ్యామిలీ గెలవదని… తుని సీటును యనమల ఫ్యామిలీ నుంచి తప్పిస్తేనే అక్కడ పార్టీకి భవిష్యత్తు ఉంటుందని పార్టీ నేతలే చెపుతున్నారు. తునిలో యనమల కాపులకు ప్రాధాన్యం ఇవ్వలేదని, వారిని పట్టించుకోలేదని పెద్ద ఎత్తున ప్రచారంలో ఉంది. గడిచిన రెండు ఎన్నికల్లోనూ తన తమ్ముడు కృష్ణుడును పోటీ చేయించుకున్నా.. గెలిపించుకోలేక పోయారు. ఇక 2009 లో ఇక్కడ యనమలే స్వయంగా ఓడిపోయారు.విచిత్రం ఏంటంటే 2014 ఎన్నికల్లో ఇక్కడ పోటీ చేసిన ఓడిన తన తమ్ముడు కృష్ణుడినే యనమల ఏఎంసీ చైర్మన్ చేశారు. ఎమ్మెల్యేగా ఓడిపోయిన వ్యక్తినే తిరిగి ఏఎంసీ చైర్మన్ చేయడం… పార్టీ కోసం కష్టపడిన వారిని పక్కన పెట్టడంతో కాపు వర్గం తీవ్రంగా రగిలిపోయింది. అదే సమయంలో పార్టీకి అన్ని విధాలా అండగా ఉన్న కాపు వర్గాన్ని ప్రోత్సహించడంలోనూ ఆయన వెనుకబడి పోయారు. ఈ నేపథ్యంలోనే కాపులు ఇప్పుడు అసంతృప్తితో ఉన్నారని అంటున్నారు. కాపు వర్గానికి చంద్రబాబు ఆధిపత్యం ఇవ్వలేక పోయారని, ఉభయ గోదావురుల్లోని కాపు వర్గానికి ప్రాధాన్యం ఇవ్వకుండానే టీడీపీని నడిపించారని చెప్పుకొస్తున్నారు.ఈ పరిణామాల నేపథ్యంలో వీరంతా టీడీపీపై అసంతృప్తి పెంచుకున్నారు. కాపులకు సంబంధించిన పలు విషయాలపై చంద్రబాబు యనమల రామకృష్ణుడు తోనే సంప్రదింపులు జరపడాన్ని కూడా ఈ వర్గం జీర్ణించుకోలేక పోయింది. ప్రస్తుతం ఆయా విషయాలపై దృష్టి పెట్టిన చంద్రబాబు యనమలను పక్కన పెట్టాలని డిసైడ్ అయ్యారని.. అవసరమైతే బీసీల్లో యనమల వర్గంలో ప్రాధాన్యం ఇవ్వాలనుకుంటే నెల్లూరు జిల్లాకు చెందిన బీదమస్తాన్ రావు వంటివారికి ప్రయార్టీ ఇవ్వాలని చూస్తున్నారని తెలుస్తోంది.