యువ్ న్యూస్ జనరల్ బ్యూరో:
ఇంటర్ ఫలితాల్లో గ్రేడింగ్ విధానంలో ఉత్పన్నమవుతున్న సమస్యల నేపథ్యంలో.. 2017 నుంచి అమలుచేస్తున్న గ్రేడింగ్ విధానానికి ఏపీ ప్రభుత్వం స్వస్తి పలికింది. గతంలో మాదిరిగానే మార్కులను ఇవ్వనున్నట్లు ఇంటర్మీడియట్ బోర్డు ఒక ప్రకటనలో తెలిపింది. విద్యార్థుల మార్కుల వివరాలను 'జ్ఞానభూమి' వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచింది. ఉత్తీర్ణులతోపాటు.. పరీక్షలో ఫెయిలైన విద్యార్థుల మార్కుల వివరాలను కూడా వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచింది.విద్యార్థులు హాల్‌టిక్కెట్ నంబరు, ఆధార్ నంబరుతో తమ మార్కుల జాబితాను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఏపీలో గత రెండు సంవత్సరాల నుంచి అమలు చేస్తున్న గ్రేడింగ్ విధానం కారంణంగా.. ఇప్పటికీ మార్కుల విధానాన్నే అవలంభిస్తోన్న చాలా రాష్ట్రాల్లోని విద్యా సంస్థల్లో ప్రవేశాలకు వెళ్లే విద్యార్థులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తాజాగా ఢిల్లీ యూనివర్సిటీ (డీయూ) కళాశాలల్లో ప్రవేశాలకు విద్యార్థులు దరఖాస్తు చేసుకోగా గ్రేడ్ పాయింట్లను మార్కులుగా మార్చడంలో ఇబ్బందులు తలెత్తాయి. దీంతో విద్యార్థులు ఫిర్యాదులు చేయడంతో.. డీయూ అధికారులు సమస్యను విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ దృష్టికి తీసుకొచ్చారు. ఈ నేపథ్యంలో విద్యార్థుల మార్కులు ఇవ్వాలంటూ.. ఇంటర్ బోర్డును ఆదేశించారు. దీంతో ఇంటర్ ద్వితీయ సంవత్సరం విద్యార్థుల మార్కుల జాబితాను 'జ్ఞానభూమి' వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచింది.