యువ్ న్యూస్ జనరల్ బ్యూరో:
బీహార్ రూటే వేరు..బ్యాంక్ రుణాల కోసం... అప్పు ఇస్తావా లేక చస్తావా అని బ్యాంకు మేనేజర్లను బెదిరిస్తుంటారు. మాట వింటే సరే.. లేక పోతే అన్నంతగా వారి అంతు చూస్తారు. పదేళ్ల కిందట బీహార్‌లోని గ్రామీణ ప్రాంతాల్లో స్థానిక గూండా నేతలదే రాజ్యం. అంతా కలిసి వడ్డీ వ్యాపారాన్ని వ్యవస్థీకృత వ్యాపారంగా మార్చారు. దీని కోసం బ్యాంకులపై తమ పెత్తనం చూపేవారు. అధిక వడ్డీలతో పేదలను దారుణంగా దోచుకునేవారు. శాంతి భద్రతలు పాలకులకు అంతగా పట్టకపోవడంతో ఇష్టారాజ్యంగా చెలరేగిపోయారు. దీంతో స్థానిక గూండా నేతల దృష్టంతా గ్రామీణ బ్యాంకు శాఖలపై పడింది. బ్యాంకు మేనేజర్లను నయానో భయానో చెప్పుచేతల్లో ఉంచుకుని తమ పనులు చక్కబెట్టుకునేవారు. ప్రస్తుతం స్థానిక బడాబాబుల నుంచి రాజకీయ నేతల వరకు రుణాలు ఇప్పించే దళారులుగా మారారు. లబ్ధిదారులకు రుణాల ఎంపికలోనూ వారు వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు. బీహార్‌లో గత కొన్నేళ్లుగా జరుగుతున్న బ్యాంకు మేనేజర్ల హత్యల వెనక స్థానిక బడా బాబుల హస్తమున్నదన్నది అక్కడ బహిరంగ రహస్యమే. తాజాగా గత బుధవారం లఖిసారై జిల్లాలో కెనరా బ్యాంకుకు చెందిన అసిస్టెంట్ మేనేజర్ మిలింద్ కుమార్ మాధుర్ దారుణ హత్యకు గురయ్యారు. గయలో సమావేశానికి హాజరై రైలులో తిరిగి వస్తుండగా కొందరు దుండగులు మిలింద్‌పై కత్తితో దాడి చేసి పొడిచి చంపారు. ఘటన స్థలంలో డబ్బుల పర్సు, ఇతర వస్తువులు ఎక్కడవి అక్కడే ఉండటంతో ఆగంతులు చోరీ కోసం ఆయనను హత్య చేయలేదని, దీని వెనక మరో కారణం ఉందని పోలీసులు అనుమానిస్తున్నారు. గత అక్టోబర్‌లో ప్రాంతీయ గ్రామీణ బ్యాంకు బ్రాంచ్ మేనేజర్ జైవర్ధన్ మృతదేహం పక్కరాష్ట్రమైన జార్ఖండ్ హజారీబాగ్ జిల్లాలోని తెలయ్యా డ్యాంలో తేలియాడగా పోలీసులు గుర్తించారు. గత ఏడాది మే నెలలో బ్యాంక్ ఆఫ్ బరోడా ఆర్వాల్ బ్రాంచ్ మేనేజర్ అలోక్ చంద్రాను దుండగులు కాల్చి చంపారు. రూ.1.5 కోట్ల బ్యాంకు రుణాన్ని మళ్లించేందుకు నిరాకరించడంతో అతడిని హత్య చేసినట్లు నిందితుడు ఒకరు అంగీకరించాడు. గ్రామీణ బ్యాంకుల్లో పని చేసే మేనేజర్లకు కత్తిమీద సామే. ఓ వైపు పేరుకుపోతున్న బకాయిలపై ఉన్నతాధికారుల నుంచి ఒత్తిడి, మరోవైపు దళారులు చెప్పినట్లు రుణం మంజూరు చేసి వారు ఇచ్చినంత పుచ్చుకోవాలి లేదా దాడులకు గురికావడంతోపాటు ప్రాణాలు కూడా పోయే దారుణమైన పరిస్థితి వారిది. 2018 డిసెంబర్ 31 నాటికి బీహార్‌లో రూ.4069 కోట్లకు సంబంధించిన 5,80,408 రుణ బకాయిల కేసులు పెండింగ్‌లో ఉండటం అక్కడి పరిస్థితికి అద్దం పడుతున్నది.తమ ప్రాణాలను గుప్పెట్లో పెట్టుకుని బ్యాంకుల్లో పని చేస్తున్నామని బీహార్లోని పలు బ్యాంకు మేనేజర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. లోన్ దరఖాస్తును తిరస్కరిస్తే తమకు చావు తప్పదని వారు వాపోతున్నారు. ఇది గ్రహించే చాలా మంది బ్యాంకు మేనేజర్లు స్థానిక గూండా నేతలతో రాజీ పడుతుంటారని పాట్నా జిల్లాలోని పంజాబ్ నేషనల్ బ్యాంకు మేనేజర్ అసలు వాస్తవాన్ని బయటపెట్టారు. గ్రామీణ ప్రాంతాల్లోని ప్రతి బ్యాంకు శాఖ మేనేజర్ ప్రతి ఏటా రూ.5 కోట్లకు పైగా రుణాలు మంజూరు చేస్తారు. మధ్యవర్తులు చెప్పినట్లు చేస్తే ఎంతోకొంత ముట్టజెప్పుతారు. కాదని మెండికేస్తే కాల్చి చంపడానికి వెనుకాడరు అని లోగుట్టును ఆయన రట్టు చేశారు.