యువ్ న్యూస్ జనరల్ బ్యూరో:
యూఏఈ (యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్) ఉపాధ్యక్షుడు, ప్రధాని షేక్ మహ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ సతీమణి, దుబాయి ప్రిన్సెస్ హయా బింత్ అల్ హుస్సేన్ దేశం విడిచి పారిపోయారు. తనతో పాటు ఇద్దరు పిల్లలు, 31 మిలియన్ పౌండ్లు (సుమారు రూ.270 కోట్లు) తీసుకెళ్లారు. ప్రస్తుతం ఆమె లండన్‌లో తలదాచుకున్నట్లు మీడియా వర్గాలు కథనాలు ప్రచురించాయి. కొంతకాలంగా ఆమె తన భర్త నుంచి విడాకులు కోరుతున్నట్లు తెలుస్తోంది. ప్రపంచ సంపన్నుల్లో (బిలియనీర్) ఒకరైన మహ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్‌కు హయా బింత్ ఆరో భార్య కావడం గమనార్హం. ఈమెకు జలీలా (11), జాయేద్ (7) అనే ఇద్దరు చిన్నారులు ఉన్నారు. దుబాయి నుంచి ముందుగా జర్మనీకి వెళ్లిపోయిన హయా బింత్ అక్కడ రాజకీయ శరణార్థిగా ఆశ్రయం కోరినట్లు తెలుస్తోంది. అక్కడ నుంచి లండన్‌కు వెళ్లిపోయినట్లు సమాచారం. దుబాయి నుంచి తప్పించుకుని పారిపోవడానికి హయాకు ఓ జర్మనీ దౌత్యవేత్త సాయం అందించినట్లు అరబ్ మీడియా పేర్కొంది. తన భార్యను దుబాయికి తిప్పి పంపాలంటూ షేక్ మహ్మద్ చేసిన వినతిని జర్మనీ అధికారులు తిరస్కరించినట్లు సమాచారం. ఈ కారణంగా ఇరుదేశాల మధ్య దౌత్యపరమైన సంబంధాలు ప్రమాదంలో పడ్డాయి. జోర్డాన్ రాజు అబ్దుల్లా సవతి తల్లి కుమార్తె అయిన హయా బింత్ ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీలో విద్యాభ్యాసం చేశారు. మే 20 నుంచి బయట ఆమె బయటి ప్రపంచానికి కనిపించడం లేదు. తన సేవా కార్యక్రమాలకు సంబంధించిన పోస్టులతో నిండి ఉండే హయా బింత్ సోషల్ మీడియా ఖాతాలు కూడా గత ఫిబ్రవరిలో చివరిసారిగా అప్‌డేట్ అయ్యాయి. ఇంతకుముందు దుబాయ్‌కి చెందిన ఓ షేక్ కుమార్తెల్లో ఒకరైన లతీఫా అనే యువతి తన తండ్రిని, దుబాయిని వదిలి పారిపోయి భారత తీరంలో పట్టుబడింది. నాటి నుంచి ఆమె బయట ఎక్కడా కనిపించకపోవడం చర్చనీయాంశంగా మారింది. ఆమెను దుబాయిలో బందీగా ఉంచినట్లు అనుమానిస్తున్నారు. హయా బింత్ తిరిగి దుబాయ్ ప్రధాని చేతికి చిక్కితే ఇలాంటి కష్టాల్లో పడే ప్రమాదం ఉంది