YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

ఆంధ్రాతో తమకు పోలికే లేదన్న తెలంగాణ సీఎం

ఆంధ్రాతో తమకు పోలికే లేదన్న తెలంగాణ సీఎం

దేశ రెండో రాజధాని చేస్తే స్వాగతిస్తామని కేసీఆర్‌ ఆసక్తికర వ్యాఖ్య

ఆంధ్రప్రదేశ్‌ కంటే తాము ఎంతో ముందున్నామని తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు(కేసీఆర్‌) అన్నారు. ఇండియా టుడే నిర్వహిస్తున్న ‘సౌత్‌ కన్‌క్లేవ్‌ 2018’ లో ఆయన మాట్లాడుతూ.. తెలంగాణకు, ఆంధ్రాకు పోలికే లేదని.. తమది ఆర్థికంగా మిగులు రాష్ట్రమని చెప్పారు. సంస్కృతి, సంప్రదాయాల్లో రెండు రాష్ట్రాల మధ్య తేడాలున్నాయన్నారు. అన్నిరంగాల్లో తమ రాష్ట్రం ముందుందని.. ఐటీ, పారిశ్రామిక రంగాల్లో తామే నంబర్‌వన్‌ అని చెప్పుకొచ్చారు. అభివృద్ధిలో గుజరాత్‌ కంటే తెలంగాణ ఏమాత్రం తక్కువ కాదన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సన్నిహిత సంబంధాలుండాలని అభిప్రాయపడ్డారు. రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యమని, దేశ రాజకీయాలపై తనకు ఆసక్తి లేదని స్పష్టం చేశారు.

తెలంగాణ చిన్న రాష్ట్రం కాదు
తమ రాష్ట్రం చిన్నది కాదని.. భౌగోళికంగా బిహార్‌, బెంగాల్‌ కంటే పెద్ద రాష్ట్రమని వెల్లడించారు. దేశంలోని ఇతర రాష్ట్రాలకంటే 16 రంగాల్లో తెలంగాణ ముందుందని సీఎం కేసీఆర్‌ తెలిపారు. తాము చెప్పినట్టుగా త్వరలోనే దేశంలో అత్యంత ధనిక రాష్ట్రంగా తెలంగాణ అవతరిస్తుందని దీమా వ్యక్తం చేశారు.

అద్భుతాలు చేస్తున్నాం
నీటిపారుదల రంగంలో అద్భుతాలు చేస్తున్నామని కేసీఆర్‌ అన్నారు. వ్యవసాయ రంగంలో అన్ని రాష్ట్రాలకు తెలంగాణ రోల్‌మోడల్‌గా ఉండబోతోందన్నారు. తాము చేపట్టిన ప్రాజెక్టుల వల్ల రైతు ఆత్మహత్యలు తగ్గాయని తెలిపారు. కోటి ఎకరాలకు సాగునీరు ఇవ్వాలన్నది తమ లక్ష్యమన్నారు. రాష్ట్రంలో గోదాముల సామర్థ్యం 4 లక్షల నుంచి 23 లక్షల మెట్రిక్‌ టన్నులకు పెంచామని వివరించారు.

అలా చేస్తే స్వాగతిస్తాం
హైదరాబాద్‌ను దేశానికి రెండో రాజధాని చేస్తే స్వాగతిస్తామని కేసీఆర్‌ అన్నారు. భాగ్యనగరం భారతదేశ సంస్కృతికి అద్దం పట్టే నగరమని వ్యాఖ్యానించారు. మద్రాసు కన్నా ముందు హైదరాబాద్‌లో విమాన, రైల్వే వ్యవస్థ ఉందని గుర్తు చేశారు. హైదరాబాద్‌లో చెరువులు, పార్కులు ధ్వంసం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. హైదరాబాద్‌లో ఎన్నో అంతర్జాతీయ సదస్సులు జరుగుతున్నాయని తెలిపారు.

ఆర్థిక వెనుకబాటే ప్రాతిపదిక
రిజర్వేషన్లు రాష్ట్రంలోని జనాభా ఆధారంగా ఉండాలని కేసీఆర్‌ పేర్కొన్నారు. ఆయా రాష్ట్రాల్లో ఉన్న పరిస్థితుల ఆధారంగా రిజర్వేషన్లు ఉండాలని అభిప్రాయం వ్యక్తం చేశారు. ఆర్థిక వెనుకబాటుతనమే రిజర్వేషన్లకు ప్రాతిపదికగా ఉండాలని, 50 శాతం రిజర్వేషన్లు ఏమాత్రం సరిపోవని అన్నారు. రిజర్వేషన్లు పెంచుకునే అధికారం రాష్ట్రాలకే ఇవ్వాలన్నారు. తమిళనాడు, మహారాష్ట్రలో రిజర్వేషన్లు 50 శాతం కంటే ఎక్కువగానే ఉన్నాయన్నారు.

తెలంగాణ రాష్ట్రమే నా ఫ్యామిలీ
ప్రగతిభవన్‌ తెలంగాణ సీఎం అధికారం నివాసమని, అందులో కేసీఆర్‌ ఒక్కరే ఉండరని చెప్పారు. తన తర్వాత వచ్చే ముఖ్యమంత్రులు అందులో ఉంటారని వెల్లడించారు. కొత్త సచివాలయం కట్టడంలో తప్పేమీ లేదన్నారు. ప్రజలు ఎన్నుకుంటేనే తన పిల్లలు గెలిచారన్నారు. తెలంగాణ రాష్ట్రమే తన కుటుంబంగా ఆయన వర్ణించారు.

ఒంటరిగా పోటీ
2019 ఎన్నికల్లో తాము ఒంటరిగానే పోటీ చేస్తామని టీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ తెలిపారు. తాము ఎవరితోనూ కలవబోమని, ఎవరైనా తమతోనే కలవాలని అన్నారు.

Related Posts