యువ్ న్యూస్ జనరల్ బ్యూరో:
ఆంధ్రప్రదేశ్‌లో ఇంజినీరింగ్, ఫార్మసీ సీట్ల భర్తీకి సంబంధించి ఏపీ ఎంసెట్ పరీక్షలో అర్హత సాధించిన విద్యార్థులకు సోమవారం (జులై 1) నుంచి ధ్రువ పత్రాల పరిశీలన ప్రారంభమైంది. తొలి రోజు 1 నుంచి 10,000 ర్యాంకుల వరకు సర్టిఫికేట్లు పరిశీలన చేపట్టనున్నారు. ముందుగా ప్రకటించిన కౌన్సెలింగ్ షెడ్యూలు ప్రకారం జులై 1 నుంచి 6 వరకు సర్టిఫికెట్ల పరిశీలన, జులై 3 నుంచి 8 వరకు ఆప్షన్ల నమోదు చేపట్టనున్నారు. ఇక జులై 9న ఆప్షన్లలో మార్పులు చేసుకునే అవకాశం కల్పించారు. అనంతరం జులై 11న సీట్ల కేటాయించనున్నారు.
గత డాదిలాగే ఈసారి కూడా మూడు విడతలుగా కౌన్సెలింగ్ ప్రక్రియను చేపట్టనున్నారు. జులై 31 నాటికి పూర్తి కౌన్సెలింగ్ ప్రక్రియను ముగించి.. ఆగస్టు నుంచి ఇంజినీరింగ్, ఫార్మసీ తరగతులు ప్రారంభించనున్నారు. ఎంసెట్‌లో 1.32 లక్షల మందికి ర్యాంకులు కేటాయించగా వీరిలో 95,200 మంది అభ్యర్థులు ఆన్‌లైన్‌లోనే సర్టిఫికేట్ వెరిఫికేషన్ పూర్తిచేశారు. మిగతావారు జులై 1 నుంచి 6 వరకు సహాయక కేంద్రాల్లో సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం హాజరుకావాల్సిఉంటుంది.
24 సహాయ కేంద్రాల ఏర్పాటు
ఎంసెట్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం రాష్ట్రవ్యాప్తంగా 24 సహాయ కేంద్రాలను అధికారులు ఏర్పాటు చేశారు. దివ్యాంగులు, ఎన్‌సీసీ, క్రీడా, మాజీ సైనికోద్యోగుల కోటా వారికి ఆంధ్ర లయోల కళాశాలలో ప్రత్యేకంగా సహాయ కేంద్రం ఏర్పాటు చేశారు.
అభ్యర్థులకు ముఖ్య సూచనలు..
✦ అభ్యర్థులు ఆన్‌లైన్ (డెబిట్, క్రెడిట్ కార్డు, నెట్‌బ్యాంకింగ్) ద్వారానే ప్రాసెసింగ్ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ప్రాసెసింగ్ ఫీజుగా ఓసీ, బీసీ అభ్యర్థులు రూ.1200; ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు రూ.600 చెల్లించాల్సి ఉంటుంది. ప్రాసెసింగ్ ఫీజు చెల్లించడానికి వెబ్‌సైట్‌లో 'Processing Fee Payment Online' లింక్‌పై ద్వారా చెల్లించాలి. జులై 8 వరకు ప్రాసెసింగ్ ఫీజు చెల్లించడానికి అవకాశం ఉంది.
వెబ్‌సైట్: https://apeamcet.nic.in
✦ ఒకవేళ ఏదైనా కారణాల చేత ప్రాసెసింగ్ ఫీజు చెల్లింపు సమయంలో అవాంతరాలు ఎదురైతే.. నాలుగు రోజుల్లో చెల్లించిన నగదు తిరిగి ఖాతకు జమవుతుంది. నాలుగు రోజుల తర్వాత కూడా జమకాకపోతే అభ్యర్థులు హాల్‌టిక్కెట్ నంబరు, ట్రాన్సాక్షన్ ఐడీ, చెల్లింపుల తేదీ వివరాలను apsche.pay@gmail.com లేదా cetsrefund@gmail.com చిరునామాలకు ఈమెయిల్ చేస్తే నగదును తిరిగి బ్యాంకు ఖాతాలో జమ చేస్తారు.
✦ ఆన్‌లైన్ ద్వారా సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం ప్రాసెసింగ్ ఫీజు చెల్లించడానికంటే ముందుగా సంబంధిత లింక్ ద్వారా వెరిఫికేషన్ చేసుకోవచ్చు.
సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం.. http://apsche.org/cetstatus.php