'నన్నుచూసి కియా కంపెనీ అక్కడకు వచ్చింది. కరువుతో కటకటలాడుతున్న అనంతపురం జిల్లాకు కియాను తెప్పించింది నేనే. అదీ నా సమర్థత..' అంటూ ఒక రేంజ్‌లో డప్పేసుకుంటున్నారు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు. తన రాజకీయ జీవితం నలభై యేళ్లను పూర్తి చేసుకుందంటూ బాబు ఇచ్చిన ఇంటర్వ్యూలో కియా ప్రస్తావన వచ్చింది. అందుకు ముందు కూడా అనంతపురం జిల్లాకు వెళ్లి అక్కడ కియాకు సంబంధించిన ఒక కార్యక్రమంలో పాల్గొని బాబు సెల్ఫ్ డప్పు వేసుకున్నారు. మరి దీని గురించి కథాకమామీషు ఏమిటి అని ఆరాతీస్తే.. అబ్బే ఇదంతా చంద్రబాబు చెప్పుకోవడమే తప్ప అసలు మేటర్ అంతా వేరే ఉందని స్పష్టం అవుతోంది.
ప్రముఖ వాహన ధిగ్గజం హ్యుండాయ్‌తో ఒప్పందం కలిగి ఉన్న సంస్థ కియా. ఇది కూడా ప్రముఖమైన కార్ల కంపెనీనే. కార్ల రూపకల్పనలో ప్రపంచంలోని టాప్ 15 కంపెనీల్లో ఒకటిగా నిలుస్తోంది. అనేక దేశాల్లో తన కార్లను సేల్ చేస్తోంది. ఇప్పుడు దేశంలోనే తొలిప్లాంట్‌గా అనంతపురం జిల్లా పెనుకొండ వద్ద ఏర్పాటవుతోంది. అయితే వాస్తవానికి వీళ్ల తొలి ప్రాధాన్యత అనంతపురం కాదు, ఏపీ కూడా కాదు. తమిళనాడులో దీన్ని ఏర్పాటు చేయాలనుకున్నారు. కానీ.. అక్కడ రాజకీయ అనిశ్చితి తదితర పరిణామాల నేపథ్యంలో ఇది అనంతపురం బాటపట్టింది.
దీనివెనుక మరో కథ కూడా ఉంది. ఈ కియా కంపెనీ ఏపీ వైపు కన్నేయడం విషయంలో చంద్రబాబు పాత్ర శూన్యం. ఎందుకంటే.. కియా సంస్థ మొదట ఒప్పందం కుదుర్చుకుంది రాష్ట్ర ప్రభుత్వంతో కూడా కాదు. ఆ మధ్య ప్రధానమంత్రి దక్షిణ కొరియాలో పర్యటించినప్పుడు కియాకు సంబంధించిన ఏర్పాట్లు జరిగాయి. భారత్‌లో మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్‌ను పెట్టాలనుకున్న కియా కంపెనీ వాళ్లు అన్నిరకాల అన్వేషణలూ పూర్తిచేసి అనంతపురం వచ్చారు. ఏపీ ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకున్నారు.
చంద్రబాబు నాయుడు దక్షిణ కొరియాకు వెళ్లారు. అయితే అప్పటికే కియాతో ఒప్పందం కుదుర్చుకుని రెండు సంవత్సరాలు గడిచాయి. 2015లో కియాతో ఇండియన్ గవర్నమెంట్ ఒప్పందం కుదుర్చుకోగా.. చంద్రబాబు 2017లో కొరియాకు వెళ్లాడు. ఇప్పుడేమో.. 'నన్ను చూసి కరువు జిల్లాకు కియా వచ్చింది..' అని బాబు చెప్పుకొంటూ ఉన్నారు. ఎవ్వరైనా నవ్వుతారనే భయంలేని మనిషి ఆయన. అయినా.. 'సత్యా నాదెళ్ల నా వల్లనే ఐటీ చదువులు చదివాడు..' 'వైఎస్ రాజశేఖర రెడ్డికి నేనే టికెట్ ఇప్పించా..' 'ఎన్టీఆర్‌ను నేనే రాజకీయాల్లోకి రమ్మన్నా, పార్టీ పెట్టమన్నా' అనేమాటలు నిర్మొహమాటంగా మాట్లాడిన వ్యక్తికి.. కియా క్రెడిట్‌ను సొంతం చేసుకోవడం పెద్ద లెక్కేంకాదేమో.
ఇక్కడ చెప్పుకోవాల్సిన మరోమాట ఏమిటంటే.. ఇప్పుడు కియాప్లాంటు ఏర్పాటు అవుతున్న చోటకు కూతవేటు దూరంలో గొల్లపల్లి రిజర్వాయర్ ఉంటుంది. హంద్రీనీవా ప్రాజెక్టులో భాగంగా ఆ రిజర్వాయర్‌ను నిర్మించారు. హంద్రీనీవా ప్రాజెక్టు అంటే అది వైఎస్ పుణ్యమే. గొల్లపల్లి రిజర్వాయర్‌కు సంబంధించి 90శాతం వర్క్ పూర్తిచేసింది కూడా వైఎస్ హయాంలో, ఆపై కిరణ్ హయాంలోనే.
పదిశాతం పెండింగు వర్కును చంద్రబాబు ఈ మధ్యనే పూర్తిచేశాడు. దీనికి నాలుగేళ్లు పట్టింది. అక్కడ రిజర్వాయర్ ఉంది కాబట్టే.. కియా అక్కడకు వచ్చింది. ఒకవేళ హంద్రీనీవా ప్రాజెక్టు పనులనే గనుక వైఎస్ నాడు పట్టించుకోకుండా ఉంటే, చంద్రబాబులా దాన్ని గాలికి వదిలి ఉంటే.. కియా కాదు, అక్కడకు కాకి కూడా వచ్చేది కాదు. ఇలాంటి వాస్తవాలను దాచి.. నిర్మొహమాటంగా చంద్రబాబు క్రెడిట్‌లు కొట్టేసేయత్నాలు చేస్తుండటం మాత్రం కామెడీ!
- కోన రఘుపతి, వ్యాసకర్త