యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:
కొత్త కార్యాలయం సిద్ధమయ్యేవరకు తెదేపా కార్యకలాపాలన్నీ ఇకపై గుంటూరులోని రాష్ట్ర కార్యాలయం నుంచే కొనసాగుతాయని ఆ పార్టీ అధినేత చంద్రబాబు స్పష్టం చేశారు. సోమవారం గుంటూరు కార్యాలయానికి వచ్చిన చంద్రబాబుకు నేతలు ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇక్కడి నుంచే కార్యకలాపాలు కొనసాగిస్తామని చెప్పారు. మళ్లీ మనపై బాధ్యతలు పెరిగాయని.. ఎన్నికల్లో 40 శాతం ఓట్లు వేసిన ప్రజలకోసం పనిచేయాల్సిన అవసరముందని నేతలు, కార్యకర్తలకు ఆయన సూచించారు. అధికారంలో ఉన్నపుడు నీతివంతమైన పాలన అందించామన్నారు. వైకాపా అధికారంలోకి వచ్చిన తర్వాత తెదేపా కార్యకర్తలపై దాడులు పెరిగాయని.. ఆరుగురు కార్యకర్తలు చనిపోయారని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతి కార్యకర్తకు అండగా ఉండి కాపాడుకుంటామని.. అవసరమైతే ఆ గ్రామంలో తాను ఉంటానని భరోసా ఇచ్చారు. తెదేపాకు హింసాత్మక రాజకీయాలపై నమ్మకం లేదన్నారు. వారంలో నాలుగురోజుల పాటు కార్యాలయంలోనే నేతలు, కార్యకర్తలకు చంద్రబాబు అందుబాటులో ఉండనున్నారు. తెదేపాపై నమ్మకంతో రాజధాని నిర్మాణం కోసం ప్రజలు 33వేల ఎకరాల భూమి ఇచ్చారని చెప్పారు. 37ఏళ్ల పాటు పార్టీ జెండా మోసింది కార్యకర్తలేనని.. కొన్ని కష్టాలు వచ్చినా పార్టీతోనే ఉన్నారని కొనియాడారు.