ఒడిశాలోని భువనేశ్వర్‌లో ఆదివాసీ సంక్షేమాభివృద్ధి విభాగం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వసతి గృహాల్లో నలుగురు విద్యార్థినులు గర్భం దాల్చడం కలకలం రేపింది. ఇందుకు సంబంధించి జిల్లా శిశు సంక్షేమ కమిటీ (సీడబ్ల్యూసీ) ప్రతినిధులు భువనేశ్వర్ పోలీసు కమిషనర్ సత్యజిత్ మహంతికి ఫిర్యాదు చేశారు.రాష్ట్రంలో మారుమూల ప్రాంతాల్లో ఆదివాసీ ఆశ్రమ పాఠశాలల్లో విద్యార్థినులు గ soర్భం దాల్చుతున్న ఘటనలు ఇటీవల చోటుచేసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో ఖుర్దా కలెక్టర్ ఆదేశాల మేరకు జాతీయ బాలల ఆరోగ్య పథకం(ఎన్‌సీహెచ్‌సీ) ఆధ్వర్యంలోని సంచార వైద్య పరీక్షల బృందం వేసవి సెలవుల తర్వాత తిరిగి వసతిగృహాల్లో చేరిన పలువురు విద్యార్థినులకు వివిధ పరీక్షలు నిర్వహించింది. ఈ క్రమంలో భువనేశ్వర్‌లోని రెండు వసతిగృహాల్లోని నలుగురు విద్యార్థినులు గర్భం దాల్చినట్లు గుర్తించారు. ఆ నివేదిక అందుకున్న సీడబ్ల్యూసీ ప్రతినిధులు పోలీసు కమిషనర్ సత్యజిత్ మహంతికి ఫిర్యాదు చేశారు. దీనిపై స్పందించిన కమిషనర్ సత్యజిత్ మీడియాతో మాట్లాడారు. విద్యార్థినుల పరీక్షల నివేదికను పరిశీలిస్తామని, అవసరమైతే మళ్లీ వారికి పరీక్షలు జరుపుతామన్నారు.