మూతపడ్డ ఐదు ఎరువుల కర్మాగారాలను కేంద్ర ప్రభుత్వం తిరిగి పునరుద్ధరించనుంది. యూరియా దిగుమతులను తగ్గించేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. కర్మాగారాల పునరుద్ధరణకు రూ. 37,971 కోట్లు వెచ్చించనుంది. ఈ విషయాన్ని కేంద్ర మంత్రి సదానంద గౌడ మంగళవారం ప్రకటించారు. లోక్‌సభ ప్రశ్నోత్తరాల సమయంలో భాగంగా సదానంద గౌడ స్పందిస్తూ.. దేశంలో ఎరువుల కొరత లేదన్నారు. దేశంలో 305 మెట్రిక్ లక్షల టన్నుల యూరియా అవసరం ఉండగా.. 241 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా మాత్రమే ఉత్పత్తి జరుగుతుంది. మిగతాది విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నది. ఈ దిగుమతులను తగ్గించేందుకు ఒడిశా, తెలంగాణ, ఉత్తరప్రదేశ్, జార్ఖండ్, బిహార్ రాష్ర్టాల్లో మూతపడ్డ ఎరువుల కర్మాగారాలను తిరిగి పునరుద్ధరించేందుకు చర్యలు చేపడుతున్నట్లు ఆయన వెల్లడించారు.