YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

తుక్కుగా యుద్ధ నౌక ఐఎన్‌ఎస్ విరాట్

 తుక్కుగా యుద్ధ నౌక ఐఎన్‌ఎస్ విరాట్

కేంద్ర ప్రభుత్వం తాజాగా తీసుకున్న నిర్ణయంతో భారత నౌకాదళానికి చెందిన విమాన వాహక యుద్ధ నౌక ఐఎన్‌ఎస్ విరాట్ తుక్కుగా మారనుంది. ఈ నౌకను మారిటైమ్ మ్యూజియంగా, పర్యాటక ఆకర్షణగా తీర్చిదిద్దేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ప్రతిపాదనపై నీళ్లు చల్లినట్లయింది. నౌకాదళానికి దాదాపు 55 సంవత్సరాల ( 27 సంవత్సరాలు బ్రిటీష్ నౌకాదళానికి, 28 సంవత్సరాలు భారత నౌకాదళానికి) పాటు సేవలందించిన యుద్ధ నౌక విరాట్‌ను మార్చి 2017లో నౌకాదళ సేవల నుంచి ఉపసంహరించారు. అప్పటి నుంచి ముంబై పోర్టులో ఉంచారు. ఈ నౌకను మారిటైమ్ మ్యూజియంగా, పర్యాటక ఆకర్షణగా మార్చేందుకు అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రయత్నించారు. దాదాపు 750 కోట్ల రూపాయల వ్యయం అంచనాతో సవివర ప్రాజెక్టు రిపోర్టును కేంద్రానికి పంపారు. విశాఖ పరిసరాల్లో ఈ నౌకను డాక్ చేసి పర్యాటక ప్రాజెక్టుగా తీర్చిదిద్దేందుకు అప్పటి టీడీపీ ప్రభుత్వం నిర్ణయించింది. నౌకను నిలిపి ఉంచేందుకు అనువైన స్థలాలను గుర్తించేందుకు ఐఐటి మద్రాస్‌తో అధ్యయనం చేయించింది. భీమిలి, రుషికొండ, జోడుగుళ్లపాలెం వద్ద నౌకను నిలిపేందుకు అనువైన ప్రాంతాలుగా గుర్తించారు. కొంత భాగాన్ని మ్యూజియంగా, కొంత భాగాన్ని రెస్టారెంట్‌గా, స్టార్ హోటల్‌గా మార్చేందుకు ప్రతిపాదించారు. ఈ దశలో మహారాష్ట్ర, గోవా కూడా పోటీ పడి నౌకను తమకు ఇవ్వాలని కోరాయి. మహారాష్ట్ర ప్రభుత్వం కూడా 852 కోట్ల రూపాయల వ్యయంతో ఒక ప్రతిపాదన పంపింది. ఈ ప్రతిపాదనలను కూడా కేంద్రం ఆమోదించలేదు. నౌకను పరిరక్షించేందుకు అవసమైన నిధులు సొంతంగా సమాకూరేలా సరైన ప్రతిపాదనలు రాని కారణంగా ఈ నౌకను తుక్కుగా మార్చేందుకు నిర్ణయించినట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. దీంతో ఈ నౌకను పర్యాటక ఆకర్షణగా తీర్చిదిద్దాలన్న రాష్ట్ర ప్రభుత్వ ఆకాంక్ష కలగానే మిగలనుంది. ఇప్పటికే దేశ తొలి విమాన వాహక యుద్ధ నౌక ఐఎన్‌ఎస్ విక్రాంత్ కూడా మహారాష్ట్ర ప్రభుత్వం వ్యవహరించిన తీరు కారణంగా తుక్కుగా మారిపోయింది. అదే బాటలో మరో ప్రముఖ యుద్ధ నౌక మారనుండటం దురదృష్టకరం.

Related Posts