YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

జగన్ పై సామాజికవర్గం గుస్సా 50 లో నలుగురికే అవకాశం

 జగన్ పై సామాజికవర్గం గుస్సా 50 లో నలుగురికే అవకాశం

యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:

ఏపీలో వైసిపి భారీ మెజార్టీతో అధికారంలోకి రావడంతో రెడ్డి సామాజికవర్గం హ‌వా ప్రారంభమవుతుందని చాలామంది చాలా లెక్కలు వేసుకున్నారు. జగన్ క్యాబినెట్‌లో కనీసం ఎనిమిది నుంచి పది మంది వరకు ఈ సామాజికవర్గానికి చెందిన నేతలకు మంత్రి పదవులు వస్తాయని కూడా భావించారు. జగన్ పార్టీ పెట్టినప్పటి నుంచి ఎన్నో కష్టనష్టాలను ఎదుర్కొని పార్టీ నిలబెట్టడంలో ఈ సామాజిక వర్గం పాత్ర ఎంతో కీలకం కావడంతో… సహజంగానే అందరి అంచనాలు రెడ్లకు ప్రయారిటీ ఉంటుందని ఉన్నాయి. జగ‌న్‌ మాత్రం వీరు అంచనాలు తలకిందులు చేస్తూ నలుగురు రెడ్లకు మాత్రమే త‌న కేబినెట్‌లో చోటు క‌ల్పించారు.చిత్తూరు నుంచి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ప్రకాశం నుంచి బాలినేని శ్రీనివాసరెడ్డి, నెల్లూరు నుంచి మేకపాటి గౌతమ్ రెడ్డి, కర్నూలు నుంచి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డికి మాత్రమే జగన్ కేబినెట్‌లో చోటు లభించింది. పార్టీ కోసం ఆర్థికంగా కూడా ఎన్నో ఇబ్బందులు ప‌డినా…. జగన్ తమకు నాలుగే మంత్రి పదవులు ఇవ్వడంతో ఆ సామాజిక వర్గం ఎమ్మెల్యేల్లో కొంతవరకు అసంతృప్తి ఉంది. జగన్ మాత్రం అందరూ అనుకున్నట్టుగా ఎక్కువమంది రెడ్డి వర్గం నేతలకు కేబినెట్లో చోటు కల్పిస్తే.. కేబినెట్‌పై తమ వర్గం ముద్ర ప‌డుతుంద‌న్న సందేహంతోనే ఆ వర్గానికి కేవలం నాలుగు మంత్రి పదవులతో సరిపెట్టేశారు.దీంతో సహజంగానే రెడ్డి వర్గంలో అసంతృప్తి ఎక్కువగా ఉన్నాయి. ఏకంగా 50 మంది ఎమ్మెల్యేలు గెలిస్తే నలుగురికే మంత్రి పదవులా ? అని వారు పెదవి విరుస్తున్నారు. రాయలసీమలో తెలుగుదేశం పార్టీ కంచుకోట అయిన అనంతపురం జిల్లాలో వైసిపి తిరుగులేని విజయం సాధించింది. 2 ఎంపీ సీట్లతో పాటు 12 అసెంబ్లీ సీట్లలో వైసీపీ అభ్యర్ధులు విజయం సాధించారు. గత కొన్ని దశాబ్దాలుగా అనంతపురం జిల్లాలో ఏ పార్టీ అధికారంలో ఉన్న రెడ్డి సామాజిక వర్గానికి మంత్రి పదవి ఇస్తున్నారు. గత తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ హయాంలో కూడా పల్లె రఘునాథ రెడ్డి కొంతకాలం మంత్రిగా ఉండి ఆ తర్వాత విప్‌గా ఉన్నారు.ఈ ఎన్నికల్లో వైసీపీకి ఘన విజయం కట్టబెట్టినా జిల్లాకు కేవలం ఒక మంత్రి పదవితోనే జగన్ సరి పెట్టడంతో పార్టీ శ్రేణుల్లో అసంతృప్తి వ్యక్తమవుతోంది. ఆ ఒక్క ప‌ద‌వి కూడా రెడ్లకు రాలేదు. బీసీ వ‌ర్గానికి చెందిన పెనుగొండ ఎమ్మెల్యే శంక‌ర్‌నారాయ‌ణ‌కు చోటు ద‌క్కింది. ఈ క్రమంలోనే రెడ్డి సామాజిక వర్గం నేతలు తమ అంతర్గత చర్చల్లో తీవ్రమైన అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో గుంతకల్, తాడిపత్రి అనంతపురం, రాప్తాడు, పుట్టపర్తి, ధర్మవరం, కదిరి నియోజకవర్గం నుంచి రెడ్డి వర్గం నేతలు ఎమ్మెల్యేగా గెలిచారు. వీరిలో సీనియర్‌గా ఉన్న అనంత వెంకట్రామి రెడ్డికి మంత్రి పదవి వస్తుందని ఆశలు పెట్టుకోగా ఆ ఆశలు నెరవేరలేదు. ఏదేమైనా జిల్లాకు మరికొన్ని కీలక నామినేటెడ్ పదవులతోపాటు రెండున్నర ఏళ్ల తర్వాత జరిగే ప్రక్షాళనలో అయినా తమకు ప్రాధాన్యత ఉంటుందని రెడ్డి వ‌ర్గం నేతలు భావిస్తున్నారు.

Related Posts