మండల ప్రత్యేక అధికారులందరూ ప్రతీ బుధవారం జిల్లాలో క్షేత్రస్థాయిలో పర్యటించి ప్రజల సమస్యలను పరిశీలించాలని జిల్లా కలెక్టరు రేవు ముత్యాలరాజు అధికారులను ఆదేశించారు. స్థానిక కలెక్టరేట్‌లో బుధవారం వివిధ శాఖల జిల్లా అధికారులతో అభివృద్ది, సంక్షేమ కార్యక్రమాల అమలుపై ఆయన సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టరు మాట్లాడుతూ వచ్చే వారం నుండి మండల ప్రత్యేక అధికారులు గ్రామాలలో రాత్రి బస చేసి, గ్రామం అంతా పర్యటించి, స్థానిక సమస్యలను తెలుసుకుని, వాటి పరిష్కారానికి ప్రణాళిక రూపొందించుకునే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాలన్నారు. సక్రమ ఫలితాలు రాబట్టే విధంగా క్షేత్రస్థాయి పర్యటనలు ఉండేలా అధికారులు ప్రత్యేక శ్రద్ద తీసుకోవాలని కలెక్టరు స్పష్టం చేశారు. అదేవిధంగా జిల్లా స్థాయి అధికారులు వారంలో మరో రెండు రోజులు ఆయా శాఖలకు సంబందించి పనుల ప్రగతిని, క్షేత్రస్థాయి సిబ్బంది పనితీరును మెరుగుపరిచేందుకు జిల్లా అధికారులు పర్యటించాలన్నారు. జిల్లాలోని ప్రతీ గ్రామాన్ని ఓడియఫ్ గ్రామంగా తీర్చిదిద్దేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. రాత్రి బస రోజులలో సమీక్షలకు సంబందించి ఆయా శాఖల ఉన్నత అధికారుల వీడియో కాన్ఫరెన్స్‌లు ఉంటే సంబంధిత మండలాల నుండే వీడియో కాన్ఫరెన్స్‌కు హాజరు కావచ్చన్నారు. గ్రామ పర్యటనలో పారిశుద్ద్యం, ఉపాధి హామీ, తదితర పనుల పరిశీలనతోపాటు హాస్టల్స్, పాఠశాలలు తణిఖీ, గ్రామ సమైఖ్యలతో సమావేశాలు నిర్వహించాలన్నారు. రాత్రి బస అనంతరం ఉదయమే గ్రామస్తులతో మాట్లాడి దీర్ఝకాలిక సమస్యలు ఏమైనా ఉంటే వాటిని గుర్తించి, అందుకు పరిష్కార చర్యలు తీసుకునే దిశగా కృషి చేయాలన్నారు. సెప్టెంబరు నెల నుండి ప్రారంభమయ్యే రచ్చబండ కార్యక్రమానికి ముఖ్యమంత్రి ఆకస్మికంగా ఆయా గ్రామాలకు రావడం జరుగుతుందన్నారు. ఈ దృష్ట్యా అన్ని గ్రామాలలో స్పందన ద్వారా వచ్చిన అర్జీల పరిష్కార తీరును, ఇతర సంక్షేమ కార్యక్రమాల అమలు తీరును ముఖ్యమంత్రి స్థానికులను అడిగి తెలుసుకుంటారన్నారు.