ఇది బీసీసీఐ పక్షపాతమే ! సెలెక్టర్లు ఓ మేటి ప్లేయర్ కలను చిదిమేశారు. వరల్డ్‌కప్‌లో ఆడాలన్న ఆశను చంపేశారు. వరల్డ్‌కప్ కోసం అధికారికంగా స్టాండ్‌బై లిస్టు జాబితాలో అంబటి రాయుడు పేరును చేర్చినా.. ఇప్పుడు ఆ ప్లేయర్‌ను బీసీసీఐ పట్టించుకోలేదు. ఏదో ఒక రూపంలో చోటు దక్కే అవకాశం వచ్చినా.. ఆ దారులను బీసీసీఐ అన్యాయంగా మూసేసింది. బ్యాటింగ్ ఆర్డర్‌లో నాలుగవ స్థానం కోసం వరల్డ్‌కప్‌కు ముందు తీవ్ర చర్చ జరిగింది. ఆ స్థానాన్ని ఎవరు భర్తీ చేస్తారన్న దానిపై ఆసక్తి నెలకొన్నది. చీఫ్ సెలెక్టర్ ఎంఎస్‌కే ప్రసాద్.. వరల్డ్‌కప్ కోసం 15 మంది సభ్యుల బృందాన్ని ప్రకటించిన సమయంలో.. అంబటి రాయుడు పేరును వెల్లడించలేదు.కీలకమైన మెగా టోర్నీ కోసం త్రీ డైమెన్షనల్ ప్లేయర్ అయిన విజయ్ శంకర్‌కు అవకాశం ఇవ్వనున్నట్లు చెప్పాడు. దీంతో అంబటి ఆశలు అక్కడే అడుగంటిపోయాయి. ఆల్‌రౌండర్ అయిన విజయ్ శంకర్‌ను ఎంపిక చేస్తున్నట్లు చీఫ్ సెలెక్టర్ వెల్లడించారు. నాలుగవ స్థానంలో రాయుడు బాగా పనికొస్తాడని ఓ దశలో విరాట్ కోహ్లీ అన్నాడు. కానీ సెలక్షన్ సమయంలో మాత్రం హైదరాబాదీ క్రికెటర్‌ను పక్కనపెట్టారు. ఆ స్థానం కోసం మరో ప్లేయర్ రిషబ్ పంత్ కూడా పోటీపడ్డాడు. అయితే పంత్, రాయుడులను స్టాండ్‌బైలో పెట్టినట్లు మళ్లీ సెలెక్టర్లు చెప్పారు. ఇక వరల్డ్‌కప్ మొదలైన తర్వాత శిఖర్ ధావన్ ఓ మ్యాచ్‌లో గాయపడ్డాడు. దాంతో అతని స్థానం కోసం రిషబ్ పంత్‌ను రప్పించారు. ఇక ఆల్‌రౌండర్ విజయ శంకర్ గాయం కావడంతో.. అతని స్థానంలో మయాంక్ అగర్వాల్‌ను రప్పించారు. స్టాండ్‌బై లిస్టులో ఉన్న అంబటి రాయుడును వదిలేసి.. టీమ్ మేనేజ్‌మెంట్ మయాంక్ అగర్వాల్‌కు ఆహ్వానం పంపింది. 55 వన్డేల్లో 47.05 యావరేజ్‌తో 1694 పరుగులు చేసిన రాయుడును టీమ్ యాజమాన్యం పట్టించుకోలేదు. నిజానికి తనను వరల్డ్‌కప్‌కు ఎంపిక చేయకపోవడంతో.. బోర్డు తీరుపై రాయుడు ఓ సెటైర్ ట్వీట్ కూడా చేశాడు. శంకర్ త్రీ డైమెన్షనల్ ప్లేయర్ అన్నందుకు.. ఆ వ్యాఖ్యలను ఉద్దేశిస్తూ అంబటి ఓ ట్వీట్ చేశాడు. వరల్డ్‌కప్ వీక్షించేందుకు త్రీడీ గ్లాసులకు ఆర్డర్ ఇచ్చినట్లు ఆ ట్వీట్‌లో సెటైర్ వేశాడు. ఎంపిక విషయంలో రాయుడు సహనం కోల్పోయిన తీరు కొంత వరకు బోర్డు సభ్యుల్ని విస్మయానికి గురిచేసింది. దేశవాళీ క్రికెట్‌లోనూ రాయుడు కొన్ని సందర్భాల్లో గొడవలకు దిగినట్లు కూడా ఆరోపణలు ఉన్నాయి. తాజాగా ఐస్‌ల్యాండ్ దేశం.. రాయుడుకు ఆహ్వానం పంపింది. త్రీడీ గ్లాసులు పక్కనపెట్టి మా దేశం తరపున ఆడుతావా అంటూ ఐస్‌ల్యాండ్ చేసిన ట్వీట్ మరో వివాదానికి తెరలేపింది. ఇక మళ్లీ దేశానికి ఆడే ఛాన్స్ రాదని తెలిసి రాయుడు క్రికెట్‌కు వీడ్కోలు పలకడం శోచనీయం.రాయుడు పంపిన రిటర్మైంట్ ఈమెయిల్‌ను హైదరాబాద్ క్రికెట్ సంఘం.. ఇవాళ బీసీసీఐకి పంపినట్లు తెలుస్తోంది. అయితే ఐపీఎల్ భవిష్యత్తుపై బీసీసీఐ రాయుడు అభిప్రాయం కోసం ఎదురుచూస్తున్నది.