YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

ఆందోళనలో ఖరీఫ్ రైతాంగం

ఆందోళనలో  ఖరీఫ్ రైతాంగం

ఖరీఫ్‌లో కూడా వర్షాలు సరిగా కురవక పోవడంతో జిల్లా రైతాంగం ఆందోళనకు గురవుతోంది. ఇదిగో కురుస్తుంది.. అదిగో కురుస్తుందని ఊరిస్తున్న మేఘాలు రైతుల్ని ఉసూరుమనిపిస్తున్నాయి. జిల్లాలో అక్కడక్కడా కొద్దిగా వర్షం కురిసినా, వేరుశెనగ పంట సాగుకు అవసరమైన దుక్కులు దున్నడానికి, విత్తనం వేయడానికి ఏమాత్రం ఉపయోగపడలేదు. మే నెలాఖరులోనే కేరళ తీరం దాటిన నైరుతి రుతుపవనాలు, జూన్ మొదటి వారంలో ఇటు జిల్లాతో పాటు రాయలసీమలోనూ ముందస్తుగా ప్రవేశించాయి. అయితే బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ద్రోణి కారణంగా వర్షాలు ఎగనామం పెట్టాయి. రెండు రోజుల నుంచి ఉత్తర, దక్షిణ కోస్తాలతో పాటు ఇతర రాష్ట్రాల్లో కూడా వర్షాలు పడుతుండటంతో జిల్లావాసులు కూడా ఆశగా ఎదురు చూస్తున్నారు. జూన్ నెలలో తగినంత వర్షం పడి ఉంటే ఇప్పటికే జిల్లాలో వర్షాధార వేరుశెనగ పంట కనీసం 2.50 లక్షల హెక్టార్లకు పైగా సాగై ఉండేది. అలాగే అంతర పంటగానూ, బోర్లు, బావుల కింద వాణిజ్య పంటలు కంది, ఆముదం, పత్తి ఇతర పంటలు సాగు చేసుకునే వారు. కాగా జిల్లాలోని ఆటో వెదర్ స్టేషన్స్ (ఏడబ్ల్యు ఎస్), రెవెన్యూ రెయిన్ గేజ్ స్టేషన్లలో నమోదైన మేరకు జూన్‌లో సాధారణ వర్షపాతం 63.9 మి.మీ.కు అంతే వర్షం కురిసినట్లు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ఈనెలలో 67.4 మి.మీ సాధారణ వర్షపాతం నమోదు కావాల్సి ఉంది. అయితే గడచిన మూడు రోజుల్లో 4.7 మి.మీ సగటు వర్షపాతం నమోదైంది. మంగళవారం ఒక్క రోజే 2.6 మి.మీకు 4.7 మి.మీ నమోదై 80 శాతం అదనంగా వర్షపాతం నమోదైందని గణాంకాలు చెబుతున్నాయి. మొత్తంగా గతనెల, ఈనెల ఇప్పటి వరకు 66.5 మి.మీ సాధారణ వర్షపాతానికి 68.6 మి.మీ కురిసిందని, 3.2 మి.మీ వ్యత్యాసం ఉందని, అయినా ఇది సాధారణ వర్షపాతమేనని అధికారిక రిపోర్టులు వెల్లడించడం విశేషం. కాగా గడిచిన ఐదురోజుల్లో గరిష్ఠంగా 34 నుంచి 36.6 డిగ్రీల సెల్సియస్ పగటి ఉష్ణోగ్రతలు, కనిష్ఠంగా 25 నుంచి 24.8 డిగ్రీల సెల్సియస్ రాత్రి ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో ఐదు రోజుల్లో గాలిలో తేమ ఉదయం కనిష్ఠంగా 73 నుంచి 82 శాతం ఉండగా, మధ్యాహ్న సమయానికి సగానికి పడిపోయి 33 నుంచి 40 శాతం నమోదైంది. గాలి వేగం సైతం గంటకు 10.1 కి.మీ నుంచి 15.7 కి.మీ మేరకు ఉండటంతో నేల ఎండబారుతోంది. ఈ పరిస్థితుల్లో రానున్న ఐదు రోజుల్లో గరిష్ఠంగా 34-36 డిగ్రీలు, కనిష్ఠంగా 25-26 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదవుతాయని వాతావరణ శాఖ పేర్కొంది. తేమ శాతం కూడా 61-67 శాతం ఉదయం, 41-48 శాతం మేరకు మధ్యాహ్న సమయాల్లో నమోదవుతుందని సంబంధిత అధికారులు సూచిస్తున్నారు. ఈ నేపథ్యంలో రానున్న ఐదు రోజుల్లో మాదిరి నుంచి తేలికపాటి వర్షాలు 13-38 మి.మీ మేరకు కురిసే సూచనలున్నట్లు హైదరాబాద్‌లోని భారత వాతావరణ శాఖ తెలిపిందని రేకులకుంట వ్యవసాయ క్షేత్రం గ్రామీణ వ్యవసాయ వాతావరణ విభాగం శాస్తవ్రేత్తలు వెల్లడించారు. ఈనేపథ్యంలో వర్షాలు బాగా కురిస్తే దుక్కులు దున్నుకుని, వేరుశనగ పంట సాగు చేసుకోవాలని రైతులు ఎదురు చూస్తున్నారు. మూడు రోజుల క్రితం జిల్లాలో అక్కడక్కడా మాదిరి వర్షాలు పడినా అవి ఖరీఫ్ సీజన్‌లో పంటల సాగుకు ఉపయోగపడలేదు. నేడో, రేపో వర్షాలు పడక పోతే ఖరీఫ్‌ను వర్షాభావం వెంటాడుతుంది. ఈసారి కూడా కరవుఛాయలు కనిపించే అవకాశాలున్నట్లు జిల్లా వాసులు ఆందోళన చెందుతున్నారు. కాగా ఈ నెలాఖరు వరకు వర్షాధార వేరుశెనగ పంట సాగు చేసుకోవచ్చని వాతావరణ శాఖ శాస్తవ్రేత్తలు తెలిపారు. ఈ విషయాన్ని వ్యవసాయ శాఖ రైతులకు తెలియజేస్తోంది. అయితే ఇప్పటికే విత్తనాలు సిద్దంగా ఉంచుకున్న అన్నదాతలు, దుక్కులు చేసుకోవడానికి వేచి ఉన్న రైతులు వాన రాక కోసం ఎదురు చూస్తున్నారు. మరోవైపు కొద్దోగొప్పో ముందస్తు వర్షాలకు గతనెలలో విత్తనం వేసిన పొలాల్లో మొలకెత్తిన పంట ఎండిపోతోంది. ఇపుడే ఇలాంటి పరిస్థితి ఉంటే పంట ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లో పరిస్థితి ఎలా ఉంటుందోనన్న భయం రైతుల్ని వెంటాడుతోంది.

Related Posts