అనంతపురం నగర కార్పొరేషన్ పాలకవర్గం అసమర్థతతో, అధికారుల అలసత్వంతో జిల్లా కేంద్రంలోనే ప్లాస్టిక్ నిషేదం ప్రసహనంగా తయారైంది. టిడిపి అధికారం చేపట్టి రెండు సంవత్సరాలు కావస్తోంది. అనంతపురం నగర కార్పొరేషన్ పాలక వర్గం అధికారం చేపట్టి సుదీర్ఘకాలం గడుస్తున్నా ప్లాస్టిక్ నిషేధంపై నీలినీడలు కమ్ముకున్నాయి. పాలకవర్గం ఇప్పటికే అక్టోబర్ 2వ తేదీన గాంధీ జయంతి రోజు నుంచి సంపూర్ణ ప్లాస్టిక్ నిషేధం అమలు చేస్తామని ప్రకటించింది. జిల్లాలోనే తాడిపత్రి మున్సిపాల్టీ ప్లాస్టిక్ నిషేధంలో అగ్రస్థానంలో నిలిచింది. రాష్ట్రస్థాయి గుర్తింపు కూడా పొందింది. అయితే జిల్లా కేంద్రం అందులోను కార్పొరేషన్‌లో అమలుకు సాధ్యంకాని పరిస్థితి. పాలకవర్గం, అధికారుల ఉదాసీనత, నిర్లక్ష్యం కారణంగా ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడుతున్నారు.అనంతపురం నగర కార్పొరేషన్ పరిధిలో 50 వార్డులు ఉన్నాయి. సుమారుగా మూడు లక్షలకు పైగా జనాభా కలిగుంది. కార్పొరేషన్ పరిధిలో పారిశుధ్య నిర్వహణ ద్వారా ప్రతిరోజు సుమారుగా 130 టన్నులు మేర చెత్తాచెదారం సేకరిస్తున్నారు. అందులో సగం ప్లాస్టిక్ సంబంధిత వ్యర్థాలే ఉంటున్నాయి. ప్రభుత్వ అధికారుల పర్యవేక్షణ లేకపోవటంతో కార్పొరేషన్ పరిధిలో విచ్చలవిడిగా ప్లాస్టిక్ వినియోగం జరుగుతున్నది. ప్రతిరోజూ దాదాపుగా 30 టన్నుల మేర ప్లాస్టిక్ వినియోగం జరుగుతున్నట్లు తెలుస్తున్నది. ప్రధానంగా 40 మైక్రాన్ల లోపు ప్లాస్టిక్‌నే అత్యధిక సంఖ్యలో వినియోగిస్తున్నారు. గతంలో ప్లాస్టిక్ నిషేధంపై ప్రత్యేక విభాగాలను ఏర్పాటు చేసి తనిఖీలను చేశారు. అయితే పాలకవర్గం, అధికారుల తీరు తనిఖీలు నామమాత్రంగా సాగాయి. ఈ తనిఖీల్లో ప్లాస్టిక్ అమ్మకపుదారులకు రెండువేల నుంచి ఐదువేల వరకు అపరాధ రుసుం పేరుతో వసూలు చేశారు. అయితే ప్రత్యామ్నాయం చూపకుండా అధికారుల దాడులను కొందరు వ్యాపారస్తులు తప్పుపట్టారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం 40 మైక్రాన్లు దాటిన కవర్లు మాత్రమే వినియోగించాల్సి ఉంది. ప్లాస్టిక్ వినియోగంతో క్యాన్సర్ వంటి వ్యాధులు ప్రబలే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని వైద్యులు సూచిస్తున్నారు. అయితే రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా కవర్లు నిషేధించి పేపర్ కవర్లపై ఆసక్తి కలిగించేలా చర్యలు చేపట్టాలని సూచించింది. అధికారులు మాత్రం ఇది సాధ్యం కాదంటూ అటువైపు చూడడమే మానేశారు. పాలకవర్గం మాత్రం కౌన్సిల్ అమోదం అయ్యిందని ఆచరణే ఆలస్యమని చెప్పకొస్తున్నది. అయితే పాలకవర్గం, అధికారులు స్పందించకపోవటం వెనుక వ్యాపారస్తులు ఇచ్చే మాముళ్లకు అలవాటుపడి ఈ రకంగా మిన్నకుండిపోయారనే విమర్శలు వినబడుతున్నాయి.ప్రత్యామ్నాయం చూపాలి...కవర్లు వాడితే జరిమానాలు వేయటం కన్నా అవగాహన కల్పించటం ఉత్తమం. ప్రత్నామ్నాయం చూపించాల్సిన భాధ్యత ప్రభుత్వంపై ఉంది. వ్యాపారస్తులపై కఠినంగా వ్యవహరించటం కన్నా ప్లాస్టిక్ తయారు చేసే పరిశ్రమలను మూసి వేస్తే ప్రయోజనం ఉంటుంది.