నంద్యాల ప్రభుత్వ జిల్లా ఆసుపత్రిలో సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. అత్యాధునిక పరికరాలు ఉన్నా..చికిత్స అందనంత దూరంలో ఉంటోంది. సరైన సమయానికి వైద్యులు రాక గర్భిణులు క్యూలో వేచి చూడాల్సిన పరిస్థితులు నెలకొంటున్నాయి. గుండెకు సంబంధించిన ఈసీజీ పరీక్ష కేంద్రం వద్ద రోగులు గంటల తరబడి నిరీక్షించాల్సి వస్తోంది. ఫిజియోథెరపీ వార్డును మూసివేసి తలుపులు తెరవడం లేదు. నంద్యాల ప్రభుత్వ జిల్లా ఆసుపత్రికి ప్రతి రోజు 1200 మంది రోగులు వైద్యం కోసం వస్తుంటారు. ఆసుపత్రిలో మొత్తం 300 పడకలు ఉన్నాయి. ఇన్ పేషంట్లు పెరగటంతో 350 పడకలపై చికిత్స అందిస్తున్నారు.అత్యవసర కేసులు వస్తే అత్యాధునిక పరికరాలు లేవంటూ ఎక్కువగా కర్నూలుకు తరలిస్తున్నారు. ఈ నేపథ్యంలో రూ.1.8 కోట్లతో నూతనంగా 20 పడకల ఐసీయూ ఏర్పాటు చేశారు. ఐసీయూ ఏర్పాటు చేసినా అత్యవసర కేసులు మాత్రం కర్నూలుకు తరలించటం ఆనవాయితీగా వస్తోంది. రూ.6 కోట్లతో ఎమ్మారై స్కానింగ్ ఉన్నా.. బయటకు వెళ్లాల్సిన దుస్థితి నెలకొంది. మేల్, ఫిమేల్ వార్డుల్లో 60 మందికి ఒకే స్టాఫ్ నర్సు ఉండటంతో రోగులకు సరైన సమయంలో చికిత్స అందడంలేదు. మాతా శిశు మరణాలు తగ్గించడం కోసం మాతా శిశువైద్యశాలను గత ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఇక్కడ ప్రతిరోజు 10 నుంచి 12 ప్రసవాలు జరుగుతుంటాయి. వైద్యుల నిర్లక్ష్యంతో కొంత కాలంగా గర్భిణులు, శిశువులు మృత్యువాత పడుతున్నారు. కాన్పుకోసం ఆసుపత్రికి వచ్చే గర్భిణుల పట్ల ఆసుపత్రి సిబ్బంది దురుసుగా ప్రవరిస్తున్నారు. ఈ విషయమై ఉన్నతాధికారులకు ఫిర్యాదులు కూడా వెళ్లాయి. జూన్ నెలలో వైద్యుల నిర్లక్ష్యంతో ఇద్దరు చిన్నారులు మృత్యువాత పడ్డారు. ఇప్పటి వరకు చర్యలు తీసుకోలేదు. సిబ్బంది తీరులో ఎటువంటి మార్పులేదు. ఆసుపత్రిలో రోగులు వారి సహాయకులకు మొత్తం కలిపి దాదాపు 2 లక్షల లీటర్ల నీరు అవసరం ఉంటుంది. ప్రస్తుతం 70 వేల లీటర్లు మాత్రమే ఆసుపత్రి వర్గాలు అందిస్తున్నాయి. ఆసుపత్రికి ప్రత్యేకంగా పైప్‌లైన్ నిర్మాణం కోసం మున్సిపాలిటీకి రూ.1.53 లక్షలు చెల్లించినా ఫలితం లేకుండా పోయింది. డయాలసిస్ రోగులకు చికిత్స కోసం ప్రతిరోజు 6 వేల లీటర్ల మినరల్ వాటర్ అవసరం. నీటి కొరత ఉండటంతో బయటి నుంచి మినరల్ వాటర్ కొనుగోలు చేస్తూ రూ.3 వేలు ప్రతి రోజూ ఖర్చు చేస్తున్నారు. ప్రభుత్వ ఆసుపత్రిలో ఉన్న పీపీ యూనిట్ వైద్యుల తీరుతో గర్భవతులు, కుటుంబ నియంత్రణ ఆపరేషన్‌లకు వచ్చే బాలింతలు నానా అవస్థలు పడుతున్నారు. ప్రతి గురువారం పరీక్షల కోసం గర్భిణులు గంటల తరబడి వేచి చూస్తున్నారు. కుటుంబ నియంత్రణ ఆపరేషన్ల కోసం మూడు నెలల నుంచి ప్రదక్షిణలు చేస్తున్నా వైద్యులు పట్టించుకోవటం లేదని బాలింతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.