YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

టీటీడీలో ప్రక్షాళన ప్రారంభం.. అవినీతి అక్రమాలపై విచారణ కొనసాగుతుంది..!!

టీటీడీలో ప్రక్షాళన ప్రారంభం.. అవినీతి అక్రమాలపై విచారణ కొనసాగుతుంది..!!

యువ్ న్యూస్ జనరల్ బ్యూరో:

పవిత్ర తిరుమల తిరుపతి దేవస్థానంలో గత ప్రభుత్వం, పాలకమండలి ఎన్నో అక్రమాలకు పాల్పడింది. విచారణ జరిపించి అక్రమార్కులపై చర్యలు తీసుకుంటాం. మొత్తంగా ప్రక్షాళన ప్రారంభమైందని టీటీడీ అధ్యక్షులు వైవీ సుబ్బారెడ్డి వెల్లడించారు. స్థానిక సంతపేటలోని కల్యాణ మండపంలో జరుగుతున్న మరమ్మతులను మంగళవారం ఉదయం ఆయన పరిశీలించారు. కోటిన్నర వ్యయంతో ఆధునీకరణ పనులు చేపట్టినట్లు సిబ్బంది వివరించారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. గత పాలక మండలి హయాంలో మాయమైన స్వామి వారి వజ్రాలు, ఎలాంటి దస్త్రం లేకుండా బంగారం రవాణాలాంటి వాటిల్లో అనేక అనుమానాలున్నాయని చెప్పారు. అధికారులు, ప్రభుత్వ పెద్దలు దేవుని సొమ్మును ఇష్టారాజ్యంగా ఖర్చు పెట్టి దోచేసినట్లు తెలుస్తోందన్నారు. శ్రీవేంకటేశ్వరస్వామి ఎవరినీ వదిలిపెట్టరని హెచ్చరించారు. ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌రెడ్డిగారి ఆదేశాల మేరకు టీటీడీలో సమూల మార్పులు తీసుకొస్తామని ఆయన పేర్కొన్నారు. సామాన్య భక్తులకు దర్శనం మరింత సులభతరం చేసేందుకు తగు చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఎల్‌1, ఎల్‌2, ఎల్‌3 దర్శనాలను రద్దు చేసి వీఐపీ దర్శనాలను వర్గీకరిస్తామన్నారు. తద్వారా సాధారణ దర్శనానికి రద్దీ తగ్గుతుందని తెలిపారు. ప్రస్తుతం 24 గంటల దాకా సమయం పడుతోంది. దీన్ని కనీసం 4 గంటలకు తీసుకొచ్చేందుకు తగు చర్యలు తీసుకుంటామని తెలిపారు. గత పాలక మండలి కూల్చి వేసిన వేయి కాళ్ల మండపాన్ని తిరిగి నిర్మించే విషయమై మేథావులు, పండితుల సూచనలు తీసుకున్నాక నిర్ణయం తీసుకుంటామన్నారు. ఒంగోలులోని టీటీడీ కల్యాణ మండపాన్ని సర్వహంగులతో తీర్చిదిద్దుతామన్నారు. అలాగే జిల్లా కేంద్రంలో వివిధ సాంస్కృతిక ప్రదర్శనలు నిర్వహించుకునేందుకు వీలుగా మహతి ఆడిటోరియం నిర్మాణం చేపట్టనున్నట్లు సుబ్బారెడ్డి వెల్లడించారు.

ఏడాదిలో వెలుగొండ తొలి సొరంగం నుంచి నీళ్లిస్తాం !
గత ప్రభుత్వ నిర్లక్ష్యంతో నీరుగారిన వెలుగొండ ప్రాజెక్టు నిర్మాణాన్ని వెంటనే చేపడతామన్నారు. పార్టీ ఇచ్చిన హామీ మేరకు ఏడాదిలో తొలి సొరంగం నుంచి పది టీఎంసీల నీటిని పశ్చిమ ప్రకాశం ప్రజలకు అందిస్తామని సుబ్బారెడ్డి వెల్లడించారు. పార్లమెంటు సభ్యునిగా జిల్లా ప్రజల గుండెల్లో నిలిచిన వైవీ సుబ్బారెడ్డి ఇప్పుడు స్వామివారి సేవకే పరిమితమవుతారా అని విలేకరులు అడగ్గా.. మానవ సేవే.. మాధవ సేవంటారు కదా ! ప్రజలకు సేవలు చేస్తే దేవదేవునికి చేసినట్టే కదా అని సుబ్బారెడ్డి బదులిచ్చారు. ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చాక ప్రజా క్షేత్రం నుంచి దూరంగా వెళ్లే పరిస్థితి ఉండదన్నారు. జిల్లాలో ఫ్లోరిన్‌ రక్కసి బారిన పడి ఐదారొందల మంది ప్రాణాలు కోల్పోయారు. గుక్కెడు నీళ్లు నోచుకోక అల్లాడుతున్న ప్రజలకు వెలుగొండ ద్వారా నీళ్లిచ్చేందుకు ముఖ్యమంత్రి జగన్‌ సారధ్యంలోని వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పారు. దొనకొండలో పారిశ్రామిక కారిడార్‌పైనా దృష్టి సారించినట్లు తెలిపారు. త్వరలో పరిశ్రమల ఏర్పాటుకు తగు చర్యలు తీసుకుంటామన్నారు. రామాయపట్నం పోర్టు గురించి విలేకరులు ప్రస్తావించగా 'ఆయన శంకుస్థాపన మాత్రమే చేశారు ! మాది శంకుస్థాపనల పార్టీ కాదు. ప్రాజెక్టులు నిర్మించే పార్టీ' అని సుబ్బారెడ్డి చమత్కరించారు. 'ఇక్కడ పోర్టు నిర్మించకుండా నాన్చి ఐదేళ్లపాటు కృష్ణపట్నం పోర్టు దగ్గర డబ్బులు గుంజారు. ఎవరికి తెలీదు వాళ్ల సంగతి' అని ఎద్దేవా చేశారు. రామాయపట్నం వద్ద భారీ తరహా పోర్టు నిర్మాణం అనేది కేంద్రం నిర్మించాలి. దీనిపై కేంద్రంతో సంప్రదిస్తున్నట్లు తెలిపారు. నవరత్నాల అమలుతో ప్రతీ కుటుంబానికీ లబ్ది చేకూర్చేందుకు పక్కా ప్రణాళికతో రాష్ట్ర ప్రభుత్వం ముందుకు పోతుందని సుబ్బారెడ్డి వివరించారు.

ఆలయాల్లో ఘనంగా పూజలు..
స్థానిక లాయరుపేట సాయిబాబా ఆలయంలో, అయ్యప్ప స్వామి ఆలయంలో వైవీ సుబ్బారెడ్డి, స్వర్ణలత దంపతులు పూజలు నిర్వహించారు. పూజారుల ఆశీర్వచనాలు అందుకున్నారు. సుబ్బారెడ్డి నివాసానికి అభిమానులు పెద్ద ఎత్తున తరలి వచ్చారు. శాలువలు, పూల మాలలతో తమ అభిమానాన్ని చాటుకున్నారు. అత్యధిక మంది కాపులకు ఎమ్మెల్యేలుగా సీట్లిచ్చి గెలిపించినందుకు అభినందిస్తూ కోలా ప్రభాకర్‌, కాపునేతల సమక్షంలో సుబ్బారెడ్డి కేక్‌ కట్‌ చేశారు. మొత్తంగా వైవీ సుబ్బారెడ్డికి రెండో రోజూ అభినందనలు వెల్లువెత్తాయి.

Related Posts