యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:
దేశంలో కొత్త రాజకీయ నిర్వచనాలు పుట్టుకొస్తున్నాయి. నిన్నామొన్నటివరకూ కాంగ్రెసు పార్టీ గంగా ప్రవాహం వంటిదని క్లెయిం చేసుకుంటుండేది. అంటే తమ పార్టీలోకి ఎవరైనా వచ్చి చేరవచ్చనేది దాని ఉద్దేశం. అంతేకాదు తమ పార్టీలో చేరితే ఎంత పాపాత్ములైనా పునీతులైపోతారనేది నినాదం. ఇప్పుడు పార్టీ మారింది. సిద్దాంతం మాత్రమే అదే. హస్తం పార్టీ స్థానంలో కమలం చేరింది. ఏ పార్టీవారైనా వచ్చి తమ పార్టీ తీర్థం పుచ్చుకోవచ్చని కమలనాథులు ఆహ్వానిస్తున్నారు. సామదానభేదోపాయాలను ప్రయోగిస్తున్నారు. భారతీయ జనతా పార్టీ కనబరుస్తున్న ఈ దూకుడు ప్రత్యర్థులను కంగారు పెట్టిస్తోంది. అటు పశ్చిమబంగ మొదలు తెలుగు రాష్ట్రాల వరకూ అదే స్పీడు. కాంగ్రెసు, కమ్యూనిస్టులను ఖాళీ చేయించి పశ్చిమబంగాలో పారాహుషార్ చేస్తోంది. ఇటు తెలుగు రాష్ట్రాలపైనా కన్నేసింది. తమ నాయకులు వరసగా చేజారుతుంటే..తెలుగుదేశం తెల్లమొహం వేస్తోంది. బీజేపీ తెలంగాణ రాష్ట్రసమితికి చెక్ పెట్టేందుకు చకచకా పావులు కదుపుతోంది. దేశ ప్రణాళికను నీతి అయోగ్ గుప్పెట్టో పెట్టేసింది. ఒకే దేశం..ఒకే ఎన్నిక పేరిట మరో ప్రయత్నం జోరందుకుంటోంది. సిద్దాంతరాద్ధాంతాలు లేవు. ఏ పార్టీ విత్ డిఫెరెన్స్ అన్న నైతిక నియమాలు పాతమాటే. మాపార్టీ గంగానది అంటూ కొత్తగా భాష్యం చెబుతున్నారు. అసలు కమలం కరెక్టు రూట్ లోనే వెళుతోందా?కమ్యూనిస్టులు, కాంగ్రెసు పార్టీ పరస్పరం పోటీపడుతూ ప్రతిపక్షస్థానాన్ని ఖాళీ లేకుండా చేస్తారని
పశ్చిమబంగలో తృణమూల్ కాంగ్రెసు భావిస్తూ వచ్చింది. దీనివల్ల భారతీయ జనతా పార్టీ వంటి రైటిస్టు పార్టీకి బెంగాల్ లో పెద్దగా స్థానం ఉండదని ధీమాగా ఉంటూ వచ్చింది. అయితే కాంగ్రెసు, కమ్యూనిస్టు పార్టీలు రెండూ దాదాపు ఒకేతాటిమీదకు వచ్చి పరస్పర అవగాహనతో మమతా బెనర్జీని ఢీకొనేందుకు ప్రయత్నించాయి. తమలో ఎవరు ప్రధానపక్షం అన్న సంగతి పక్కనపెట్టి చేతులు కలిపాయి. అయినా వారి ప్రయత్నం విఫలమైంది. ముఖ్యంగా త్రుణమూల్ కాంగ్రెసు, కాంగ్రెసు, కమ్యూనిస్టులందరూ ఒకే సిద్ధాంత నిబద్ధతతో ఉండటంతో మమతను నిలువరించడం సాధ్యం కాలేదు. ఈ మూడు పార్టీలు మైనారిటీ సంతృప్తీకరణను రాజకీయ అజెండాలో పెట్టుకున్నాయి. అందువల్ల ఒకపార్టీకి మరొక పార్టీని ప్రత్యామ్నాయంగా ప్రజలు భావించలేదు. ప్రధాన పాత్ర లో టీఎంసీ నిలిచింది. కాంగ్రెసు, కమ్యూనిస్టులను ప్రజలు నిర్లక్ష్యం చేశారు. ప్రత్యామ్నాయ అజెండాతో ముందుకెళ్లిన బీజేపీ బలపడింది. ఇప్పుడు టీఎంసీకి అక్కడ ప్రధాన ప్రత్యర్థి బీజేపీ మాత్రమే. ఎందుకంటే హిందూ భావనలతోపాటు చరిత్రాత్మకంగా పశ్చిమబంగ ప్రజలు గర్వంగా ఫీలయ్యే వివేకానంద, బంకిం చంద్ర చటర్జీ వంటి వారసత్వాన్ని బీజేపీ క్లెయిం చేస్తోంది. ఫలితంగా కాంగ్రెసు ఖాళీ అయిపోతోంది. గతంలో కమ్యూనిస్టుల్లో కనిపించే దూకుడును బీజేపీ సొంతం చేసుకుంది. దాంతో మొత్తం కామ్రేడ్ల క్యాడర్ కమలం బాట పట్టింది.తెలుగు రాష్ట్రాల్లోనూ భారతీయ జనతా పార్టీ జోరు పెంచింది. టీడీపీకి
ప్రత్యామ్నాయంగా ఎదిగేందుకు ఎత్తుగడలు వేస్తోంది. అదే సమయంలో అధికారపక్షాన్ని వదిలిపెట్టాలని భావించడం లేదు. వైసీపీ వైఫల్యాలపై ఆచితూచి ఎదురుచూపులు చూస్తోంది. ఈ రెండు పార్టీలను అవసరమైతే ఒకే చూపు చూసేయాలనుకుంటోంది. టీడీపీ, వైసీపీలు రెంటికీ బలహీనతలు ఉండటమే ఇందుకు కారణం. టీడీపీకి ఆర్థిక మూలాలుగా నిలిచిన నాయకుల్లో చాలామంది బ్యాంకు కుంభకోణాలు, అవినీతి కేసులు, దివాలా పద్దుల్లో ఉన్నారు. గడచిన అయిదేళ్లలో పారదర్శకత లేని పాలన విధానాలతో చంద్రబాబు నాయుడు సైతం లోతుగా తవ్వి తీస్తే ఏదో ఒక కేసులో ఇరుక్కునే అవకాశాలున్నాయి. ఆ బాధ్యతను ఎలాగూ అధికారపక్షం చేస్తుంది. ఆ తర్వాతనే తాను ఎంటర్ కావాలని బీజేపీ భావిస్తోంది. చంద్రబాబుపై కొంత సానుభూతి ఏర్పడుతుంది. కానీ టీడీపీ పోరాట పటిమను కోల్పోతుంది. వైసీపీతో పోరాటానికి అనివార్య పరిస్థితుల్లో టీడీపీ మొత్తం బీజేపీ వెనక చేరుతుంది. ఆ తర్వాత వైఎస్సార్ కాంగ్రెసుతో రాజకీయ పోరాటం చేయాలనుకుంటోంది. ఎలాగూ వైసీపీకి కొన్ని సాంకేతికమైన చిక్కు ముడులు ఉండనే ఉన్నాయి. ఆర్థికపరమైన కష్టాలు వెన్నాడుతుంటాయి. ఇచ్చిన వాగ్దానాలనూ పూర్తి చేయడం సాధ్యం కాదు. పొలిటికల్ స్పేష్ అనేది ఏర్పడుతుంది. తెలుగుదేశం అధినేత సహా అభిమానులు కూడా తాము అధికారంలోకి రాకపోయినా ఫర్వాలేదు వైసీపీని నిరోధిస్తే చాలనుకునే మానసిక స్థితికి వచ్చేస్తారు. ఆయా పరిస్థితులను సులభంగా అవకాశంగా మలచుకోవచ్చనేది బీజేపీ యోచనగా రాజకీయ పరిశీలకులు పేర్కొంటున్నారు.తెలంగాణ రాష్ట్రసమితి విషయంలో భారతీయ జనతా పార్టీ ఎత్తుగడల్లో అనేక మలుపులు
కనిపిస్తున్నాయి. దత్తాత్రేయ కేంద్రమంత్రిగా ఉన్నప్పుడు రాష్ట్రంలో బీజేపీ ఎదుగుదల సాధ్యపడలేదు. ఇప్పుడు కిషన్ రెడ్డి, డీకే అరుణ, అరవింద్ వంటి నాయకులు టీఆర్ఎస్ తో సమర్థంగా పోరాడగలిగిన వారిగా కేంద్రం గుర్తించింది. కిషన్ రెడ్డికి కేంద్రమంత్రి పదవి దక్కింది. అరవింద్ , డీకే అరుణలను కూడా కీలకమైన పదవులతో అధికారపార్టీపైకి ఉసిగొల్పడమే మిగిలి ఉంది. తొలి నుంచీ కేసీఆర్ పై పోరాటం చేస్తున్న రేవంత్ రెడ్డి వంటి వారిని ఆకర్షిస్తే ప్రయోజనం ఉంటుందనే భావన ఉంది. రాష్ట్రంలో కాంగ్రెసును పూర్తిగా నిర్వీర్యం చేయడానికి అవసరమైన సహాయసహకారాలు కేసీఆర్ కు కేంద్రం నుంచి లభించాయి. రాష్ట్ర అసెంబ్లీకి ముందస్తు ఎన్నికలకు కేంద్రం పూర్తిగా సహకరించింది. తాజా లోక్ సభ ఎన్నికలతో తనకున్న పొటెన్షియాలిటీని బీజేపీ నిరూపించుకోగలిగింది. దాంతో అధికార టీఆర్ఎస్ ను పక్కనపెట్టి క్రమేపీ పాగా వేస్తోంది. ఇంటర్ బోర్డు వైఫల్యాలను రాష్ట్రపతి స్థాయికి తీసుకెళ్లింది. కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతిని బాగా పోకస్ చేస్తోంది. అవసరమైన సందర్బాల్లో గవర్నర్ సహాయసహకారాలను రాజ్యాంగబద్ధంగా రాష్ట్రాన్ని ఇబ్బంది పెట్టడానికి వినియోగించుకుంటారు. అనధికారికంగా టీఆర్ఎస్, బీజేపీల మధ్య కొనసాగిన పొత్తు, మైత్రీబంధం దాదాపు ముగిసిపోయినట్లే చెప్పుకోవాలి. అంతేకాకుండా జగన్, కేసీఆర్ కలిసి నడుస్తున్న తీరుపైనా కేంద్రం నిఘా ఉంచింది. దక్షిణాదిన ఈ రెండుపార్టీలు తమ రాష్ట్రాల్లో చాలా బలంగా ఉన్నాయి. కేంద్రంలో
బీజేపీ ఏకచ్ఛత్రాధిపత్యానికి సవాల్ విసరాలని కేసీఆర్ గతంలో కలలు కన్నారు. తనకంటూ ఒకరోజు వస్తే ఆ ప్రయత్నం మరోసారి చేస్తారు. ఆ అవకాశం ఏర్పడకుండా రాష్ట్రస్థాయిలోనే టీఆర్ఎస్ కు చెక్ పెట్టాలని కమలనాథులు పక్కా ప్లాన్ తోనే ముందుకు కదులుతున్నారు.