యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:
రాహుల్ గాంధీ ఒకే నిర్ణయంతో ఉన్నారు. ఆయన తాను తీసుకున్న నిర్ణయంలో ఎటువంటి మార్పు ఉండబోదంటున్నారు. త్వరగా ఏఐసీసీ అధ్యక్షుడిని ఎన్నుకోవాలని ఆయన నేతలకు సూచించారు. తాను మాత్రం ఏఐసీసీ అధ్యక్ష పదవికి ఎప్పుడో రాజీనామా చేశానని, ఇక దానిపై పునరాలోచించే ప్రసక్తి లేదని చెప్పారు. దీంతో రాహుల్ ఇక వెనక్కు తగ్గరని దాదాపు అర్థమయిపోయింది. సోనియా గాంధీ కూడా రాహుల్ కు నచ్చ చెప్పే ప్రయత్నం చేసినా ఫలితం లేకపోవడంతో ఇక ప్రత్యామ్నాయ ఏర్పాట్లను చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. కొత్త నేత ఎన్నికయ్యే వరకూ సీనియర్ నేత మోతీలాల్ ఓరాను నియమించారు.రాహుల్ గాంధీ ఇటీవల జరిగిన లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ దారుణ ఓటమికి నైతిక బాధ్యత వహిస్తూ ఏఐసీసీ అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు. అయితే తొలినాళ్లలో రాహుల్ రాజీనామాను డ్రామాగా భావించారు. తనపై వత్తిడి వస్తే తిరిగి ఆయన అధ్యక్ష పదవి చేపడతారని పార్టీ నేతలు కూడా భావించారు. కాంగ్రెస్ మిత్రపక్షాలు, శత్రుపక్షాలు సయితం రాహుల్ గాంధీ రాజీనామాను లైట్ గానే తీసుకున్నాయి. ఇంత సీరియస్ అని వారు సయితం ఊహించలేదు.రాహుల్ గాంధీ రాజీనామా చేసి నెలరోజులు పైగా గడచిపోయింది. రాహుల్ రాజీనామాను వెనక్కు తీసుకోవాలని పార్టీ నుంచి తీవ్ర వత్తిడి వస్తుంది. కొందరు నేతలు ఇప్పటికే తమ పదవులకు రాజీనామా చేశారు. అశోక్ గెహ్లాట్, అహ్మద్ పటేల్, ఆంటోని, కమల్ నాథ్ వంటి సీనియర్ నేతలు రాహుల్ కు నచ్చచెప్పేందుకు ప్రయత్నించారు. రాహుల్ రాజీనామా ప్రభావం ఖచ్చితంగా రాష్ట్రాలపై ఉంటుందని నచ్చచెప్పినా రాహుల్ గాంధీ ససేమిరా అంటున్నారు. రాహుల్ గాంధీ స్థానంలో కొత్త నేత ఎవరన్నదానిపై పార్టీలో పెద్దయెత్తున చర్చ జరుగుతుంది. గత కొద్ది రోజులుగా ఏఐసీసీ అధ్యక్ష పదవికి మాజీ కేంద్రమంత్రి సుశీల్ కుమార్ షిండే పేరు విన్పిస్తుంది. సామాజికవర్గాల పరంగా షిండే అయితే అనేక రాష్ట్రాల్లో కోల్పోయిన దళిత ఓటు బ్యాంకును తిరిగి పొందవచ్చన్నది కూడా షిండే పేరు పరిశీలనలో ఉండటానికి ఒక కారణంగా చెబుతున్నారు. మొత్తం మీద రాహుల్ ఇక ససేమిరా అంటుండటంతో కాంగ్రెస్ అగ్రనేతలకు కొత్త నేతకోసం వెదుకులాట తప్పేట్లు లేదు