ప్రజాప్రతినిధులు పలు రకాలు. కొందరు నిత్యం ప్రజలే జీవితమని వారితోనే కాలం గడుపుతారు. ప్రజా సమస్యలపై చట్టసభల్లో గళం వినిపిస్తూ వాటి పరిష్కారానికి నిత్యం కృషి చేస్తూ వుంటారు. మరికొందరు తమ పదవులను అడ్డం పెట్టుకుని వ్యాపారాభివృద్ధికి ఎన్నికల్లో ఖర్చు పెట్టిన సొమ్మును రికవరీ చేసుకునే పనిలో బిజీ అవుతూ వుంటారు. ఇక సెలబ్రిటీలు కానీ పొరపాటున చట్టసభలకు ఎన్నికైతే ఆ నియోజకవర్గ ప్రజలకు కనిపించేది తక్కువే. బాలీవుడ్ నటుడు, పార్లమెంటు సభ్యుడు సన్నీడియోల్ ఉదంతమే ఇందుకు ఉదాహరణ.అసలే పార్లమెంట్ క్షణం తీరిక లేని ఉద్యోగం అన్నట్లు కొందరు తమ బాధ్యతలను వేరేవారి నెత్తిపై పెడతారు. అలా వేరే వారికి బాధ్యతలు అప్పగించినా ఆ విషయాన్ని ప్రకటించే సాహసం ఏ ఎంపి చేసిన సందర్భం అరుదు. ఇప్పుడు బాలీవుడ్ నటుడు బిజెపి ఎంపి సన్నీడియోల్ తాజాగా విడుదల చేసిన లేఖ దేశంలో చర్చకు దారితీయడమే కాదు కలకలం రేపింది. కాంగ్రెస్ పార్టీకి ఆయుధంగా మారింది.ముంబాయిలో వుండే సన్నీ డియోల్ ఇటీవల ఎన్నికల్లో పంజాబ్ లోని గురుదాస్ పూర్ నుంచి బిజెపి తరపున పోటీ చేసి గెలిచారు. ఆయన సెలబ్రిటీ కావడం ముంబాయి ఢిల్లీ నడుమ తీరిక లేకుండా తిరిగే పనులు ఉండటంతో తన తరపున నియోజకవర్గాన్ని తన సన్నిహితుడు గురుప్రీత్ సింగ్ పర్యవేక్షిస్తారంటూ ఒక లేఖను విడుదల చేశారు. గురుప్రీత్ సింగ్ రచయిత, కావడం ఆయనకు సినీ పరిశ్రమ తో వున్న సంబంధాల దృష్ట్యా
సన్నీడియోల్ ఆయనకు తన బాధ్యతలు ఇచ్చేశారు. అయితే ఈ నిర్ణయం దుమారాన్నే రేపింది. కాంగ్రెస్ దీనిపై పెద్దఎత్తునే విమర్శలకు దిగింది. ఆ దెబ్బకు సన్నీ మిత్రుడు గురుప్రీత్ సింగ్ కౌంటర్ ఇవ్వలిసి వచ్చింది. సన్నీడియోల్ ప్రతినెలా నియోజకవర్గంలో పర్యటిస్తారని ఆయన లేనప్పుడు సభలు, సమావేశాలకు ప్రజా సమస్యల పరిష్కారానికి తాను ఆయన తరపున సేవలు అందిస్తానని ఈ విషయం పై రాద్ధాంతం అనవసరమంటూ గురుప్రీత్ ఎదురుదాడి చేశారు. మొత్తానికి ఈ వ్యవహారం మాత్రం ఒక్క ఓటుతో ఇద్దరు ఎంపిలంటూ గురుదాస్ పూర్ నియోజకవర్గంపై సోషల్ మీడియా లో వైరల్ కావడం విశేషం.