ఆర్థిక శాఖపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి గురువారం సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశానికి ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, ప్రభుత్వ సలహాదారు అజేయ్ కల్లం, రెవెన్యూ స్పెషల్ సెక్రటరీ సత్యనారాయణ, ఐఏఎస్ అధికారి ఎస్ఎస్ రావత్, ఉన్నతాధికారులు, ఆయా శాఖల కార్యదర్శులు హాజరు అయ్యారు. 2019-20 బడ్జెట్లో ఉండాల్సిన ప్రతిపాదనలపై సీఎం జగన్ ప్రధానంగా చర్చించారని సమాచారం. కాగా ఈ నెల 11వ తేదీ నుంచి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. 12వ తేదీన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వం తొలిసారిగా అసెంబ్లీలో బడ్జెట్ను ప్రవేశ పెట్టనుంది. మొత్తం 15 పనిదినాల పాటు అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలను నిర్వహించాలని సూత్రప్రాయంగా నిర్ణయించినట్లు అధికారులు తెలిపారు. భేటీలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ నవరత్నాల పథకాల అమలుకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలనీ, అందుకు అనుగుణంగానే నిధుల కేటాయింపు ఉండాలని చెప్పారు. పెన్షన్ల పెంపు, రేషన్ దుకాణాల ద్వారా సన్నబియ్యం సరఫరాకు ఎలాంటి ఇబ్బంది రాకుండా చూడాలని ఆదేశించారు. ఏపీ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా తాను ప్రకటించిన రైతులకు పెట్టుబడి సాయం, డ్వాక్రా రుణాల మాఫీ, ఉద్యోగుల వేతనాల పెంపు, గృహనిర్మాణం తదితర పథకాలకు ఎట్టి పరిస్థితుల్లోనూ నిధుల కొరత రాకూడదనీ, ఈ పథకాలకు అధికంగా నిధులు కేటాయించాలని సూచించారు.