యువ్ న్యూస్ ఫిల్మ్ బ్యూరో:
ప్రముఖ బాలీవుడ్ నటుడు హృతిక్ రోషన్ పై చీటింగ్ కేసు నమోదు అయింది. హైదరాబాద్ లోని కూకట్ పల్లి హౌసింగ్ బోర్టు పోలీస్ స్టేషన్ లో హృతిక్ పై చీటింగ్ కేసు నమోదైన విషయం ఆలస్యంగా బుధవారం వెలుగులోకి వచ్చింది. కల్ట్ ఫిట్ హెల్త్ కేర్ కు హృతిక్రోషన్ బ్రాండ్ అంబాసిడర్గా కొనసాగుతున్న విషయం తెలిసిందే. కేపీహెచ్బీ కాలనీ మూడో ఫేజ్లో కల్ట్ ఫిట్ హెల్త్ కేర్ సెంటర్ కొనసాగుతోంది. దీనికి ముకేష్ బాంచల్ డైరెక్టర్గా, అంకిత్ సీఈవోగా, సుబ్రమణ్యం మేనేజర్గా పనిచేస్తున్నారు. బరువు తగ్గడానికి ఏడాదికి రూ.17,490 నుంచి రూ.36,400 వరకు ప్రత్యేక ప్యాకేజీలను ప్రకటించారు. హృతిక్ రోషన్ బ్రాండ్ అంబాసిడర్గా ఉండటంతో చాలా మంది సభ్యత్వం తీసుకున్నారు. అయితే పరిమితికి మించి అభ్యర్థులను నమోదు చేసుకోవడంతో వారికి కేటాయించిన సమయాల స్లాట్ బుక్ కావడం లేదు. దీంతో డబ్బులు చెల్లించిన అనేక మంది నిత్యం సిబ్బందిని స్లాట్ కోసం నిలదీస్తే సరియైన సమాధానం రావడం లేదు. దీంతో విసుగు చెందిన శశికాంత్ అనే బాధితుడు కేపీహెచ్బీ పోలీస్ స్టేషన్ లో కంప్లెయింట్ చేశారు. పరిమితికి మించి దరఖాస్తులు స్వీకరించి ఇబ్బందులకు గురిచేస్తున్న ఎండీ, సీఈవో, మేనేజర్లతో పాటు సంస్థకు బ్రాండ్ అంబాసిడర్గా ఉన్న హృతిక్ రోషన్ పై చర్యలు
తీసుకోవాలని బాధితుడు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో కోరారు. దీంతో పోలీసులు నలుగురిపై 420, 406 సెక్షన్ల ప్రకారం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.