యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:
బీజేపీ జాతీయ కార్యదర్శి, ఆంధ్రప్రదేశ్ బీజేపీ వ్యవహారాల కో-ఇన్ చార్జ్ సునీల్ దేవ్ ధర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మొత్తం 23 మంది టీడీపీ ఎమ్మెల్యేల్లో 18 మంది ఎమ్మెల్యేలు తమతో టచ్ లో ఉన్నారని వ్యాఖ్యానించారు. టీడీపీ అధినేత చంద్రబాబు త్వరలోనే జైలుకు వెళతారని జోస్యం చెప్పారు. చంద్రబాబుతో పాటు అప్పటి పలువురు మంత్రులు, అనుచరులు తీవ్రమైన అవినీతికి పాల్పడ్డారని విమర్శించారు. దీంతో పార్టీ ఇమేజ్ బాగా దెబ్బతిందని, ఈ విషయాన్ని టీడీపీ ఎమ్మెల్యేలు గ్రహించారు కాబట్టే, మునిగిపోతున్న నావ లోంచి బయటపడడానికి తమను సంప్రదిస్తున్నారని పేర్కొన్నారు. ప్రస్తుతం ఏపీలోని ఒక్కో లోక్ సభ నియోజకవర్గంలో లక్ష మంది కొత్త సభ్యులను బీజేపీలోకి చేర్చుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపారు. ముఖ్యంగా పేద ప్రజలకు దగ్గర అయ్యేందుకు తాము కృషి చేస్తున్నామని అన్నారు. టీడీపీకి ఏపీలో భవిష్యత్ లేదని దేవ్ ధర్ పునరుద్ఘాటించారు. చంద్రబాబు మెడపై అరెస్టు కత్తి వేలాడుతోందనీ, ఏ క్షణమైనా ఆయన కటకటాల వెనక్కు వెళతారని పేర్కొన్నారు.