యువ్ న్యూస్ స్పోర్ట్స్ బ్యూరో:
ఇంగ్లాండ్ వేదికగా జరుగుతున్న వన్డే ప్రపంచకప్‌లో భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ నిషేధం ముంగిట ఉన్నాడు. ఇప్పటికే టోర్నీ లీగ్ దశలో ఎనిమిది మ్యాచ్‌లు ఆడిన టీమిండియా.. ఆరు విజయాలతో సెమీస్ బెర్తుని ఖాయం చేసుకోగా.. నామమాత్రమైన ఆఖరి మ్యాచ్ శ్రీలంకతో శనివారం ఆడనుంది. ఈ మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ ఏమాత్రం క్రమశిక్షణ తప్పినా.. సెమీస్, ఫైనల్‌కి అతను దూరమయ్యే ప్రమాదం కనిపిస్తోంది. అసలు ఏం జరిగిందంటే..? మైదానంలో దూకుడుగా ఉండే విరాట్ కోహ్లి.. ప్రపంచకప్‌లోనూ అదే వ్యవహార శైలిని కొనసాగిస్తున్నాడు. ఈ క్రమంలో ఇటీవల అఫ్గానిస్థాన్‌తో ముగిసిన మ్యాచ్‌లో ఔట్ కోసం అప్పీల్ చేసిన విరాట్ కోహ్లీ.. ఫీల్డ్ అంపైర్ ఆ అప్పీల్‌ని తిరస్కరించడంతో సహనం కోల్పోయి అతని మీదకి దూసుకెళ్లాడు. దీంతో.. క్రమశిక్షణ తప్పిన కోహ్లీ మ్యాచ్ ఫీజులో 25 శాతం కోత విధించిన మ్యాచ్ రిఫరీ.. అతని ఖాతాలో ఒక డీమెరిట్ పాయింట్‌ని కూడా చేర్చాడు. ఈ జరిమానా తర్వాత బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లోనూ సౌమ్య సర్కార్ ఎల్బీడబ్ల్యూ విషయమై కోహ్లీ అంపైర్లతో వాగ్వాదానికి దిగాడు. దీంతో.. ఈ తప్పునకి జరిమానా నుంచి అయితే కోహ్లీ తప్పించుకున్నాడుగానీ.. అతనికి ఖాతాలో మ్యాచ్ రిఫరీ మాత్రం ఒక డీమెరిట్ పాయింట్‌ని చేర్చాడు. దీంతో.. పది రోజుల వ్యవధిలోనే కోహ్లీ ఖాతాలో రెండు డీమెరిట్ పాయింట్లు చేరగా.. గత ఏడాది దక్షిణాఫ్రికాతో జరిగిన టెస్టు సిరీస్‌లో ఇలానే క్రమశిక్షణ తప్పి ఒక డీమెరిట్ పాయింట్‌ని భారత కెప్టెన్ పొందిన విషయం తెలిసిందే. మొత్తంగా.. ఇప్పుడు కోహ్లీ ఖాతాలో మూడు డీమెరిట్ పాయింట్లు ఉన్నాయి. అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) నిబంధనల ప్రకారం.. రెండేళ్ల వ్యవధిలో ఒక క్రికెటర్ ఖాతాలో డీమెరిట్ పాయింట్ల సంఖ్య నాలుగుకి చేరితే.. వెంటనే నిషేధం అమలులోకి రానుంది. రెండు డీమెరిట్ పాయింట్లు ఒక టెస్టు లేదా రెండు వన్డేలు లేదా రెండు టీ20లతో సమానం. దీంతో.. ఒకవేళ శ్రీలంకతో శనివారం జరిగే మ్యాచ్‌లో కోహ్లీ ఏమాత్రం క్రమశిక్షణ తప్పినా.. అతని ఖాతాలో ఒకటి లేదా రెండు డీమెరిట్ పాయింట్లు చేరే అవకాశం ఉంది. దీంతో.. కోహ్లీ దూకుడుపై సెమీస్ ముంగిట టీమిండియా మేనేజ్‌మెంట్ ఆందోళన చెందుతోంది. ఒకవేళ సెమీస్ మ్యాచ్‌కి కోహ్లీ దూరమైతే.. జట్టు కూర్పుపై అది తీవ్రంగా ప్రభావం చూపనుంది.