యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:
భారతదేశ ఆర్థిక ముఖచిత్రాన్ని ఆవిష్కరించే కీలకమైన ఆర్థిక సర్వే 2019ను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గురువారం రాజ్యసభలో ప్రవేశపెట్టారు. ఇందులో పలు కీలక విషయాలు వెల్లడయ్యాయి.
✺ మొండి బకాయిల (ఎన్‌పీఏ) తగ్గింపు కారణంగా దేశంలో మూలధన పెట్టుబడులు పెరిగే అవకాశముంది.
✺ 2019-20 ఆర్థిక సంవత్సరంలో ముడిచమురు ధరలు తగ్గొచ్చు. ఇదే జరిగితే ద్రవ్యోల్బణం అదుపులోనే ఉంటుంది. దీంతో ప్రజలకు ఖర్చు తగ్గి.. డబ్బులు ఆదా అవుతాయి.
✺ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో దేశ స్థూల జాతీయోత్పత్తి (జీడీపీ) వృద్ధిరేటు 7 శాతంగా నమోదు కావొచ్చు.
✺ 2019-20 ఆర్థిక సంవత్సరంలో ద్రవ్యలోటు 5.8 శాతంగా ఉండొచ్చు. 2018-19 ఆర్థిక సంవత్సరంలో ఇది 6.4 శాతంగా ఉంది.
✺ ఆర్‌బీఐ గత పాలసీ సమావేశంలో ద్రవ్య విధానాన్ని ‘తటస్థత’ నుంచి ‘అవసరాలకు అనుగుణంగా సర్దుబాటు’ చేసుకునే విధంగా మార్చింది. దీంతో రుణ రేట్లు దిగివచ్చే అవకాశముంది.
✺ ఆహార పదార్థాల ధరలు దిగిరావడంతో ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రైతుల పంట ఉత్పత్తి తగ్గొచ్చు.
✺ ఎన్నికల కారణంగా జనవరి-మార్చి మధ్యకాలంలో ఆర్థిక అభివృద్ధి కొంత నెమ్మదించింది.
✺ 2024-25 నాటిికి భారత్ 5 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా ఎదగాలంటే వృద్ధి రేటు ఇప్పటి నుంచే కచ్చితంగా 8 శాతంగా నమోదు కావాలి.