దేశ భద్రత, ఆర్థిక వృద్ధికి జనం ఓటేశారని బడ్జెట్ ప్రసంగంలో దేశ ఆర్థిక మంత్రి నిర్మలాసీతారామన్ వ్యాఖ్యానించారు. సంస్కరణలు, మార్పే తమ అజెండా అని ఆమె చెప్పుకొచ్చారు. టెక్నాలజీతో అవినీతిని అరికట్టామని, ఐదేళ్లలో భారత ఆర్థిక వ్యవస్థను 1.5ట్రిలియన్ డాలర్ల నుంచి 2.5 ట్రిలియన్ డాలర్లకు పెంచామని నిర్మలాసీతారామన్ వెల్లడించారు. ప్రస్తుత ఏడాదిలో మూడు ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థకు చేరుకుంటామని ఆమె ధీమా వ్యక్తం చేశారు. భవిష్యత్‌లో ఐదు ట్రిలియన్ డాలర్లకు చేరడమే తమ లక్ష్యమని నిర్మల చెప్పారు. నవీన భారత్ రూపకల్పనకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని ఆమె తెలిపారు. చిన్న, మధ్యతరహా సంస్థల్లో ఉద్యోగాల కల్పనే తమ లక్ష్యమని, ముద్ర సామాన్యుడి జీవితాన్ని మార్చేసిందని నిర్మల చెప్పారు. మేకిన్ ఇండియాకు మంచి స్పందన వచ్చిందని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అభిప్రాయపడ్డారు.