కేంద్ర ప్రభుత్వం మధ్యతరగతి, పేద ప్రజలకు బడ్జెట్‌లో తీపి కబురు అందించింది. దేశంలో అందరికీ ఇళ్లు అందిస్తామని మరోసారి స్పష్టం చేసింది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తన బడ్జెట్ ప్రసంగంలో ఈ విషయాన్ని వెల్లడించారు. ప్రధాన్ మంత్రి ఆవాస్ యోజన(పీఎంఏవై) పథకం కింద 81 లక్షల గృహాలను నిర్మించామని నిర్మలా సీతారామన్ తెలిపారు. అలాగే 2022 నాటికి అన్ని నివాసాలకు విద్యుత్, గ్యాస్ సరఫరా చేస్తామని పేర్కొన్నారు. 2024 నాటికి గ్రామాల్లోని అన్ని ఇళ్లకు తాగునీరు అందిస్తామని తెలిపారు. హర్ జల్ ఘర్ స్కీమ్ కింద నీరు అందిస్తామని పేర్కొన్నారు. ‘గ్రామాలు, రైతులే మన గ్రామీణ భారతం. అందుకే గ్రామీణ భారతానికి ఆధునిక సౌకర్యాలు కల్పించనున్నాం’ అని నిర్మలా సీతారామన్ తెలిపారు. అందరికీ ఇల్లు కల్పించే విధంగా ముందుకు సాగుతున్నామని పేర్కొన్నారు. కొత్తగా 1.9 కోట్ల నివాసాల నిర్మాణం జరుగుతోందన్నారు.