YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

ఆపద్బంధుకు సుస్తీ (కృష్ణాజిల్లా)

ఆపద్బంధుకు సుస్తీ (కృష్ణాజిల్లా)

ఆపదలో ఆదుకునే 108 వాహనాలలు జిల్లాలో అందుబాటులో ఉండటం లేదు. కృష్ణా జిల్లాలో 34 వాహనాలు అందుబాటులో ఉండగా, గుంటూరు జిల్లాలో 35 వాహనాలు సేవలందిస్తున్నాయి. అత్యవసర సేవలు అందించే వాహనాల్లో డీజిల్‌కు ఎప్పుడూ కొరత ఉండకూడదు. ప్రస్తుతం రోజుకు రూ.2500 విలువైన ఇంధనం మాత్రమే అందుబాటులో ఉంటోంది. వాహనం దూర ప్రాంతాలకు వెళ్లి ఎక్కువ కిలోమీటర్లు తిరిగితే మరలా సొమ్ము వచ్చేవరకు ఎదురు చూడాల్సిన పరిస్థితి. కొన్నిసార్లు రెండు, మూడు రోజులు వరకు డీజిల్‌ అందుబాటులో లేక వాహనాలు కదలడం లేదు. శని, ఆదివారాలు, సెలవు రోజుల్లో ఈ సమస్య అధికంగా కనిపిస్తోంది. కృష్ణా జిల్లాలో జగ్గయ్యపేట నుంచి విజయవాడ, గుంటూరు జిల్లాలో మాచర్ల, తెనాలి నుంచి గుంటూరు వెళ్లే సర్వీసులకు ఇంధన కొరత ఉంది. రెండు సార్లు క్షతగాత్రులను చేరవేస్తే కనిష్ఠ స్థాయికి చేరుకుంటుంది. మారుమూల ప్రాంతాల నుంచి క్షతగాత్రులను ఆసుపత్రికి చేరవేయాలంటే ఇబ్బంది తలెత్తుతోంది.

తరచూ చోటుచేసుకుంటున్న ఘటనలతో క్షతగాత్రులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వారి బంధువులు ఆందోళనకు గురవుతున్నారు. 108 వాహనాల్లో సమయానికి డీజిల్‌ లేక ఒకచోట, మరమ్మతులకు గురై మరోచోట అత్యవసర సమయానికి రాలేని పరిస్థితి నెలకొంటోంది. ఆపదలో ఉన్న వారిని ప్రాణాపాయ స్థితి నుంచి గట్టెక్కించడానికి 108 వాహనం చేసే సహాయం వెలకట్టలేనిది. విలువైన ప్రాణాలను రక్షించే వాహనాలు అనేక సమస్యలతో అవస్థలు పడుతున్నాయి. మరమ్మతుల కోసం షెడ్డుకు చేరిన వాహనాలు తిరిగి రోడ్డెక్కడం లేదు. ప్రమాదం జరిగినప్పుడు, ఆపద సంభవించినప్పుడు నిమిషాల్లో రావాల్సిన వాహనం సమయానికి చేరుకోకపోవడంతో సేవల్లో తీవ్ర జాప్యం జరుగుతోంది. క్షతగాత్రులకు అమూల్య సేవలు అందిస్తున్న సర్వీసుల పరిస్థితి దయనీయంగా మారింది.

మరమ్మతుల కోసం షెడ్డుకు వెళ్లిన వాహనాలు తిరిగిరావడం లేదు. ప్రమాదం జరిగినప్పుడు సమాచారం అందితే కాల్‌ సెంటర్‌ సిబ్బంది వాహనం వేరొక కేసులో ఉందని చెబుతున్నారు. నెలల పాటు వాహనాలు షెడ్డుకే పరిమితమవుతున్నాయి. వాహనాలకు చిన్నపాటి రిపేర్లు వచ్చినా వాటిని బాగు చేయించటానికి చొరవ చూపకపోవడంతో ఎక్కడి వాహనాలు అక్కడే నిలిచిపోతున్నాయి. కృష్ణా జిల్లాలో నూజివీడు, జగ్గయ్యపేట, విజయవాడ మిల్క్‌ ప్రాజెక్టుకు కొత్త వాహనాలు ఉన్నా వినియోగించుకోలేని పరిస్థితి నెలకొంది. వాటి స్థానంలో పాత వాహనాలను ఏర్పాటు చేసినా మొరాయిస్తున్నాయి. కలిదిండి వాహనం సాంకేతిక సమస్యతో నిలిచిపోయింది. కంచికచర్ల వాహనం రహదారి ప్రమాదానికి గురై రెండు వారాలైంది. ఇప్పటివరకు ప్రత్యామ్నాయం ఏర్పాటు చేయలేదు. గుంటూరు జిల్లాలో మిర్చియార్డు, చెరుకుపల్లి, దాచేపల్లి, సత్తెనపల్లి, వాహనాలు మరమ్మతులకు గురయ్యాయి. దాచేపల్లిలో పాత వాహనాన్ని ఏర్పాటు చేయగా నిరంతరం సాంకేతిక సమస్యతో నిలిచిపోతోంది. తాడికొండ వాహనాన్ని ఉదయం పూట హైకోర్టు వద్ద, రాత్రి సమయంలో తాడేపల్లి ప్రాంతంలో ఉంచుతూ రెండు వాహనాలు తిరుగుతున్నట్లుగా రికార్డుల్లో చూపిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. రెండు జిల్లాల్లో చాలా వాహనాల్లో అదనపు టైర్లు అందుబాటులో లేవు. ఉన్న టైర్లు అరిగిపోయి కాలం వెళ్లదీస్తున్నాయి. క్షతగాత్రులను తరలిస్తునప్పుడు పంక్చర్‌ అయితే ఇతర వాహనాల్లో వారిని తరలించాల్సిన దుస్థితి నెలకొంది.

గ్రామాల్లో సరైన వసతులు లేకపోవడంతో గర్భిణులకు ఇబ్బందులు తప్పడం లేదు. ఎప్పుడు ఫోన్‌ చేసినా 108 వాహనం వేరే కేసులో ఉంది అనే సమాధానం ఇస్తున్నారని పలువురు వాపోతున్నారు. ప్రసవం కష్టమైతే పెద్ద ఆసుపత్రులకు తరలించాలంటే అవస్థలు పడాల్సి వస్తోంది. ఆసుపత్రికి వెళ్లాలంటే ప్రైవేట్‌ వాహనాలను సమకూర్చుకుని తీవ్ర వ్యయ ప్రయాసలకు గురవుతున్నారు. 108 వాహనాల్లో మందుల కొరత తీవ్రంగా వేధిస్తోంది. గ్లౌజ్‌లు, మాస్క్‌లు అరకొరగా అందిస్తున్నారు. వాహనాన్ని శుభ్రపరిచే రసాయనాలకు సైతం కొరత ఏర్పడటంతో రోగులకు ఇన్‌ఫెక్షన్‌ సోకే అవకాశం ఉంది. ప్రథమ చికిత్సను అందించేందుకు ఉండాల్సిన కనీస సౌకర్యాలు లేక సిబ్బంది పడరాని పాట్లు పడుతున్నారు. క్షతగాత్రులకు ఇవ్వాల్సిన మందుల్లో చాలా వరకూ అందుబాటులో లేకపోవడంతో అవస్థలు పడుతున్నారు. 108 వాహన సిబ్బంది వేతనాలు సమయానికి అందడం లేదు. మే నెల వేతనం జూన్‌ 1 నుంచి 5వ తేదీ లోపు అందాల్సి ఉన్నా 23వ తేదీ అందింది. ప్రతి నెల ఇలాగే ఇస్తుండటంతో అవస్థలు పడుతున్నారు. అయిదు నెలల పాత బకాయిలు చెల్లించలేదని, అడిగితే అదిగో, ఇదిగో అంటూ నిర్వహణ సంస్థ యాజమాన్యం నెట్టుకొస్తోందని సిబ్బంది వాపోతున్నారు.

Related Posts