పవన్ కళ్యాణ్ లుక్ చూసిన తర్వాత ఇప్పుడు ఎవరికైనా ఇలాంటి అనుమానాలే వస్తున్నాయి మరి. తానా సభలకు వచ్చిన పవన్ లుక్ చూసి అంతా ఫిదా అయిపోతున్నారిప్పుడు. ఇది చూసిన
తర్వాత ఈయన సినిమాలు చేస్తాడేమో అనే ఆసక్తి మొదలైంది. పైగా ఫ్యాన్స్‌కు కావాల్సింది కూడా ఇదే. వాళ్లు కూడా ఇప్పుడు ఇదొక్కటే అడుగుతున్నారు. ఒక్క సినిమా సర్.. ప్లీజ్ ఒకే ఒక్క
సినిమా చేయండి.. ఆ తర్వాత మీ యిష్టం అంటున్నారు. దానికి కారణం కూడా లేకపోలేదు. పవన్ కళ్యాణ్ అద్భుతమైన కెరీర్ ఫ్లాప్ సినిమాతో ముగిసిపోకూడదని వాళ్ల భయం.అజ్ఞాతవాసి లాంటి
డిజాస్టర్ సినిమాతో ముగించే కంటే కూడా ఒక్క బ్లాక్ బస్టర్ సినిమా చేసి ఆగిపోండి అంటూ అడుగుతున్నారు. అయితే దీనిపై పవన్ మాత్రం ఎలాంటి నిర్ణయం తీసుకోవడం లేదు. తన దృష్టి మొత్తం
ఇప్పుడు జనసేనపైనే ఉందంటున్నాడు. రివ్యూ మీటింగ్స్ కూడా పెట్టాడు. అది పూర్తైన తర్వాత ఎవరూ ఊహించని విధంగా కొత్త లుక్‌లోకి వచ్చాడు పవర్ స్టార్. అప్పటి వరకు జనసేన అధినేతగా
కనిపించిన ఆయన సడన్‌గా ఉన్నట్లుండి పవర్ స్టార్ అయిపోయాడు. దాంతో ఇప్పుడు ఈయన లుక్ ఇండస్ట్రీలో కొత్త చర్చలకు తెరతీస్తుంది.మరోవైపు పవన్ కళ్యాణ్ కోసం త్రివిక్రమ్ ఓ కథ సిద్ధం
చేస్తున్నాడని తెలుస్తుంది. ప్రస్తుతం అల్లు అర్జున్ సినిమా తెరకెక్కిస్తున్న ఈయన.. ఆ తర్వాత పవర్ స్టార్ కథపై కూర్చుంటాడనే ప్రచారం జరుగుతుంది. కచ్చితంగా ఈ సినిమాతో పవన్ బాకీ
తీర్చుకుంటాడని అభిమానులు కూడా ఆశిస్తున్నారు. ఇదిలా ఉంటే పవన్ కళ్యాణ్ సినిమాల్లోకి వస్తాడు అంటూ మాటిమాటికి వార్తలు వస్తూనే ఉన్నాయి. ఎన్నిసార్లు చెప్పినా కూడా తన రీ ఎంట్రీపై
మళ్లీ మళ్లీ వార్తలు రావడంతో పవన్ ఒకింత అసహనానికి లోనైనట్లు తెలుస్తుంది.ఎన్నిసార్లు చెప్పాలి.. తను సినిమాలు చేయను.. రాజకీయాల్లోనే ఉంటానని అంటూ రివ్యూ మీటింగులో కాస్త సీరియస్
అయినట్లు తెలుస్తుంది. అంతేకాకుండా తనను నమ్ముకుని వచ్చిన పార్టీ శ్రేణులకు కూడా అండగా ఉంటానని పవన్ చెప్పినట్లు తెలుస్తుంది. కచ్చితంగా తను పార్టీ సంస్థాగత పనులతోనే బిజీగా
ఉంటానని.. సినిమాల వైపు అస్సలు వెళ్లనని చెప్పాడు పవన్. జనసేన పార్టీని గ్రామస్థాయి నుంచి బలోపేతం చేయడమే లక్ష్యంగా ముందుకు సాగాలని పవన్ కళ్యాణ్ తన పార్టీ వర్గాలకు కూడా
చెప్పినట్లు ప్రచారం జరుగుతుంది.
ఇప్పుడు మన తక్షణ కర్తవ్యం కూడా ఇదే అని వాళ్ళకు చెబుతున్నాడు పవన్. ఇక ఈ సారి ఎన్నికల్లో మరీ ఇంత దారుణంగా ఒడిపోవడానికి ప్రధాన కారణం గతంలో తాము తెలుగుదేశం పార్టీకి
మద్దతు ఇవ్వడమే అని పవన్ భావిస్తున్నట్లు తెలుస్తుంది. అదే చాలా వరకు పార్టీ కొంపముంచిందనేది విశ్లేషకులు చెబుతున్న మాట. అందుకే ఇకముందు పార్టీకి సొంతంగా ఓ నియమావళి
ఏర్పరుచుకుని అలాగే ముందుకు సాగాలని పవన్ భావిస్తున్నట్లు తెలుస్తుంది. ఏదేమైనా ఇప్పుడు కాకపోయినా తర్వాతైనా పవన్ మనసు మార్చుకుంటాడని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు