ఓటమి తరువాత సంక్షోభంలో చిక్కుకున్న టీడీపీని గాడిలో పెట్టేందుకు ఆ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తన వంతు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందుకోసం పక్కా
ప్రణాళికతో ముందుకు సాగాలని ఆయన నిర్ణయించుకున్నారు. ఎక్కువకాలం నిరాశలో కూరుకుపోవడం ద్వారా పార్టీ నేతలు పక్క పార్టీల వైపు చూసే అవకాశం ఉందని భావిస్తున్న చంద్రబాబు...
సాధ్యమైనంత తొందరగా మళ్లీ వారిని యాక్టివ్ చేయాలనే యోచనలో ఉన్నారని వార్తలు వినిపిస్తున్నాయి. వైసీపీ ప్రభుత్వం తొందరగానే పోరాటం మొదలుపెట్టాలని భావిస్తున్న
చంద్రబాబు...ఒకప్పుడు టీడీపీ కంచుకోటల్లా ఉన్న జిల్లాల్లో మళ్లీ పార్టీ పట్టు పెంచుకోవాలని ప్లాన్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే కీలకమైన కృష్ణా జిల్లాపై ప్రత్యేక దృష్టి పెట్టిన చంద్రబాబుకు... జిల్లాకు
చెందిన ఇద్దరు ఎమ్మెల్యేల తీరు మింగుడుపడటం లేదని పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. కృష్ణా జిల్లాలోని మొత్తం 16 స్థానాల్లో టీడీపీ 2 స్థానాలను గెలుచుకుంది. విజయవాడ తూర్పు నుంచి
గద్దె రామ్మోహన్, గన్నవరం నుంచి వల్లభనేని వంశీ టీడీపీ తరపున విజయం సాధించారు. అయితే ఎన్నికల్లో గెలిచిన అనంతరం ఈ ఎమ్మెల్యేలెవరూ పార్టీ వ్యవహారాల్లో అంత చురుగ్గా పాల్గొనడం
లేదని తెలుస్తోంది. ప్రజావేదిక కూల్చివేత సహా ఏ అంశంపై కూడా ఈ ఇద్దరు బలంగా తమ వాయిస్ వినిపించలేదని విషయం చంద్రబాబు వరకు వెళ్లిందని సమాచారం. దీంతో వారి వ్యవహారశైలి
ఏంటనే విషయం చంద్రబాబుకు అంతుచిక్కడం లేదని తెలుస్తోంది. ఇద్దరు ఎమ్మెల్యేలతో పాటు గతంలో ఎమ్మెల్యేలు, మంత్రులుగా వ్యవహరించిన నాయకులు సైతం పార్టీలో అంత యాక్టివ్‌గా ఉండటం
లేదని జిల్లా రాజకీయవర్గాల్లో చర్చ జరుగుతోంది.