రాష్ట్రంలో ఆ రెండు పార్టీలు బద్ద శత్రువులు ప్రతీ అంశంపై రెండు పార్టీల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే విబేధాలుంటాయి. టీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకునే నిర్ణయంపై, ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న కాంగ్రెస్,
లొసుగులు వెతుకుతూ మాటల దాడి చేస్తుంటుంది. ఇటు అధికార పార్టీ నేతలు కాంగ్రెస్ నేతలకు కౌంటర్ ఇస్తూ పైచేయి సాధిస్తారు. ఇలా ఆ రెండు పార్టీల మధ్య నిత్యం ఏదో అంశంపై ఫైట్
జరుగుతూనే ఉంటుంది. కానీ టీఆర్ఎస్-కాంగ్రెస్ కలిశాయి. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా, ఇది నిజంగా నిజం. ఉప్పూ-నిప్పూ కలవడమేంటి...ఎందుకు....ఏమిటి...ఎక్కడ....?. గుచ్చుకునే గులాబీ,
నొచ్చుకోకుండా హస్తంతో చేయి కలిపింది. టీఆర్ఎస్, హస్తం జతకట్టాయి. ఉప్పూనిప్పులు ఎలా ఏకమయ్యాయి. ఎక్కడ కలిశాయి ఎందుకు కలిశాయి. తెలంగాణలో అత్యంత ఆశక్తి కలిగిస్తున్న ఈ
పొలిటికల్ ఈక్వేషన్ స్టోరిలోకి వెళితే నిజామాబాద్ జిల్లా చందూరు మండలం కొత్తగా ఏర్పాటైంది. రాష్ట్రంలోనే అతి చిన్న మండలంగా మూడు ఎంపీటీసీ స్ధానాలతో అవతరించింది. ఇటీవల జరిగిన
పరిషత్ ఎన్నికల్లో, చందూరు మండల పరిషత్ స్ధానాన్ని కాంగ్రెస్ కైవసం చేసుకుంది. మూడు ఎంపీటీసీ స్ధానాలకు గాను, రెండు కాంగ్రెస్, ఒక స్ధానం టీఆర్ఎస్ చేజిక్కించుకుంది. ఇంత వరకు బాగానే
ఉన్నా, చందూరులో ఎంపీపీ ఎన్నిక ముందుకు సాగలేదు. మూడుసార్లు ఎన్నికల అధికారులు నోటిఫికేషన్ జారీ చేసినా, టీఆర్ఎస్ సభ్యుడు అటెండ్ కాకపోవడంతో, ఎన్నిక వాయిదా పడింది.
బలపరిచే వాళ్లు లేక ఎన్నిక వాయిదా వేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. ఐతే రాజకీయ కారణాలతో ఎన్నికను వాయిదా వేస్తున్నారని కాంగ్రెస్ నేతలు ఆందోళన బాటపట్టారు. తొమ్మిది రోజులుగా
రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. జఠిలంగా మారిన చందూరు ఎంపీపీ ఎన్నికకు, బాన్సువాడ ఎమ్మెల్యే, స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి సరికొత్త ఆలోచన చేశారు. అదే కాంగ్రెస్, టీఆర్ఎస్ పొత్తు.
వినడానికే గమ్ముత్తుగా ఉన్న టీఆర్ఎస్-కాంగ్రెస్ పొత్తుకు శ్రీకారం చుట్టారు పోచారం. చందూరు ఎంపీపీ ఎన్నిక జటిలంగా మారడంతో పరస్పర వైరివర్గాలైన గులాబీ-హస్తానికి జతకట్టాలని
ప్రతిపాదించారు స్పీకర్ పోచారం. ఎన్నికల నిర్వహణకు రెండు పార్టీల మధ్య రాజీ కుదర్చడంతో, వివాదం సద్దుమణిగింది. దీంతో కాంగ్రెస్‌కు మద్దతు ఇవ్వడానికి టీఆర్ఎస్ ఒప్పుకుంది. టీఆర్ఎస్
మద్దతుతో, చందూరు మండల పరిషత్ అధ్యక్షునిగా లావణ్య, వైస్ ఎంపీపీగా దశాగౌడ్ ను ఎన్నుకున్నారు. త్వరలో ప్రమాణ స్వీకారం చేయనున్నారు. టీఆర్ఎస్ మద్దతు నిర్ణయంతో, కాంగ్రెస్ శ్రేణులు
9 రోజుల పాటు చేపట్టిన రిలేదీక్షలను విరమించారు. ఆ విధంగా బద్దవిరోధులైన రెండు పార్టీల కలిసినట్టయ్యింది. చందూరులో మూడు మండలాలకుగాను, చందూరు 1 ఎంపీటీసీ స్ధానం నుంచి
దశాగౌడ్ కాంగ్రెస్ తరపున గెలుపొందారు. చందూరు ఎంపీటీసీ -2గా లావణ్య కాంగ్రెస్ నుంచి ఎంపికయ్యారు. లక్ష్మాపూర్ గ్రామం నుంచి టీఆర్ఎస్ అభ్యర్ధి శ్యామ్ రావు విజయం సాధించారు. ఎంపీపీ
ఎన్నికకు ఒకరు బలపరిస్తే మరొకరు మద్దతు ఇవ్వాల్సి ఉండగా మూడు సార్లు ఎంపీపీ ఎన్నిక నిర్వహించగా మద్దతు ఇచ్చేవాళ్లు లేక వరుసగా వాయిదా పడింది. కాంగ్రెస్ శ్రేణుల ఆందోళన, స్పీకర్
జోక్యంతో ప్రస్తుతం కొత్తగా ఏర్పడ్డ చందూరు ఎంపీపీ ఎన్నికకు అడ్డంకులు తొలగిపోయాయని కాంగ్రెస్ శ్రేణులు చెబుతుంటే, టీఆర్ఎస్ శ్రేణులు మాత్రం అభివృద్దిలో భాగస్వామ్యం చేస్తే బాగుండేదని
చెప్పుకొస్తున్నారు. బాన్సువాడ నియోజకవర్గంలో మెజార్టీ మండలాలను టీఆర్ఎస్ కైవసం చేసుకోగా, కొత్తగా ఏర్పడ్డ చందూరులో మాత్రం ప్రజలు కాంగ్రెస్ పక్షాన నిలిచారు. నిన్నటి వరకు ఎంపీపీ
ఎన్నిక జరుగుతుందో లేదో అనే సందేహం ఉండగా, స్పీకర్ జోక్యంతో వివాదం సద్దుమణగడం పట్ల గ్రామస్థులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రంలో ఉప్పు- నిప్పులా ఉండే కాంగ్రెస్ టీఆర్ఎస్
చందూరులో మాత్రం హస్తం అందించడం రాష్ట్రస్దాయిలో చర్చకు దారితీసింది. మండల పరిషత్, జిల్లా పరిషత్ స్థాయిలో పార్టీల మధ్య మద్దతు, పొత్తులు సాధారణమైనా, ప్రస్తుతం మాటల యుద్ధం
సాగిస్తున్న తరుణంలో, రెండు పార్టీల మధ్య అవగాహన మాత్రం అందరిలోనూ ఆసక్తి పెంచుతోంది.