తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పరిస్థితి దయనీయంగా తయారయింది. నిన్న మొన్నటి వరకూ అధికార తెలంగాణ రాష్ట్ర సమితి తమ పార్టీ లో నుంచి సభ్యులను లాగేసుకుంటే… తాజాగా కమలం పార్టీ
కాంగ్రెస్ నేతలకు వల విసురుతోంది. దీంతో తెలంగాణాలో ని ముఖ్యమైన కాంగ్రెస్ నేతలు కమలం గూటికి చేరే అవకాశాలున్నట్లు చెబుతున్నారు. ముఖ్యంగా బీజేపీ జాతీయ నేత రామ్ మాధవ్
తెలంగాణలో అడుగుపెట్టినప్పుడల్లా టికాంగ్రెస్ నేతల్లో గుండెదడ మొదలవుతుందంటున్నారు.రామ్ మాధవ్ దాదాపు అందరి నేతలతో టచ్ లో ఉన్నట్లు ప్రచారం జరుగుతుంది. ముఖ్యంగా గత
ఎన్నికల్లో ఓటమిపాలయిన సీనియర్ నేతలు రామ్ మాధవ్ తో భేటీ అయినట్లు చెబుతున్నారు. మర్రి శశిధర్ రెడ్డి, దామోదర రాజనర్సింహలు రామ్ మాధవ్ తో భేటీ అయ్యారన్న వార్తలు హల్ చల్
చేశాయి. అయితే వారిలో మర్రి శశిధర్ రెడ్డి మాత్రం ఖండించారు. పార్టీ బలహీనంగా ఉన్నప్పుడు ఇలాంటి ప్రచారం జరగడం మామూలేనని ఆయన కొట్టి పారేశారు.ఇలా రామ్ మాధవ్ రాష్ట్ర పర్యటనకు
వచ్చినప్పుడల్లా ఇలాంటి ప్రచారం జరుగుతుండటం మామూలయి పోయిందని సీనియర్ కాంగ్రెస్ నేత ఒకరు వ్యాఖ్యానించారు. తెలంగాణలో పార్టీని ముందుకు తీసుకెళ్లేందుకు సమర్థమైన
నాయకత్వం అవసరమని ఎక్కువ మంది నేతలు అభిప్రాయపడుతున్నారు. సరైన నాయకత్వం లేనందునే నేతలు పక్క చూపులు చూస్తున్నారన్నది పార్టీ అంతర్గత సమావేశాల్లో కొందరు
బహిరంగంగానే చెబుతున్నారు.జాతీయ స్థాయిలో రాహుల్ గాంధీ కూడా అధ్యక్ష పదవి నుంచి తప్పు కోవడంతో ఇక కాంగ్రెస్ కు “కాలం” కలసి రాదని అనేకమంది భావిస్తున్నారు. దీనికి తోడు
నిన్న మొన్నటి వరకూ టీఆర్ఎస్ తో ఇబ్బందులు తలెత్తితే తాజాగా భారతీయ జనతా పార్టీ రామ్ మాధవ్ ను దించడం తమ కొంపముంచేటట్లుందన్న అభిప్రాయం కాంగ్రెస్ నేతల్లో వ్యక్తం అవుతుంది.