ఆంధ్రప్రదేశ్‌లో అధికారాన్ని చేపట్టిన వైఎస్ జగన్ ప్రభుత్వం ఆదర్శ రైతును మర్చిపోయింది. వ్యవసాయ రంగానికి ప్రాధాన్యత కల్పిస్తూ ఇటీవలే వ్యవసాయ కమిషన్‌ను కూడా ఏర్పాటుచేసి అందరి మన్ననలను పొందింది జగన్ ప్రభుత్వం. కానీ వ్యవసాయ రంగాన్ని గ్రామాల్లో మరింతగా బలోపేతం చేసే ఆదర్శ రైతులను మర్చిపోవడం గమనార్హం. గత చంద్రబాబు ప్రభుత్వం ఆదర్శ రైతులు దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి అడుగుజాడల్లో నడిచిన వారని, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి అండగా నిలుస్తున్నారని భావించి వారిని తిరిగి నియమించడంలో జాప్యం చేసింది. వీరంతా ఇటీవల జరిగిన ఎన్నికల్లో వైఎస్ జగన్మోహన్‌రెడ్డి అధికారంలోకి రావడానికి తమ వంతు కృషి చేశారు. కానీ జగన్ ప్రభుత్వం కూడా వారిని డైలమాలో పడేసింది.
2007లో కేంద్రప్రభుత్వం స్వామినాధన్ కమిషన్ సిఫార్సుల మేరకు దేశ వ్యాప్తంగా అన్ని గ్రామాలకు ఆదర్శ రైతులను నెలకు రూ.1000 గౌరవవేతనంతో నియమించారు. అదే సమయంలో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి జీవో 1269ను జారీ చేయడంతో ప్రతీ గ్రామానికి ఆదర్శ రైతులను నియమించారు. వీరు వ్యవసాయ శాఖ, మత్స్యశాఖ, పశుసంవర్ధకశాఖ, విద్యుత్, బ్యాంకింగ్, జలవనరుల శాఖ, హార్టికల్చర్ ఇలా 12 శాఖలకు, గ్రామాల్లో రైతులకు వారధిగా ఉంటూ సేవలు అందించేవారు. వీరు వ్యవసాయం చేసుకుంటూ ఆయా జిల్లా కేంద్రాల్లో శిక్షణ తీసుకుని గ్రామాలకు వచ్చి రైతులను చైతన్యపరిచేవారు. రసాయనిక మందులను వాడకూడదని, సేంద్రీయ వ్యవసాయం చేయాలని, ఎటువంటి ఎరువులు వాడాలి, భూసార పరీక్షలు ఎలా చేయించుకోవాలో గ్రామాల్లో రైతులకు వివరించేవారు. ఆ విధంగా పొలంబడి, సేంద్రీయ వ్యవసాయం చేయించేవారు. ఎవరైనా తప్పులు చేస్తే వెంటనే వారిని తొలగించేయడం జరిగేది. అయితే వైఎస్ రాజశేఖర్ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు వారు నియమితులుకావడంతో అనుమానం వచ్చిన గత తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం వీరిని తొలగించింది. దీంతో 2014లో ఆదర్శ రైతులు హై కోర్టును ఆశ్రయించారు. దీంతో న్యాయస్థానం కూడా ఆదర్శ రైతులు ఏం తప్పుచేశారని తొలగించారని అప్పటి ప్రభుత్వానికి అక్షింతలు వేసింది. అప్పటి నుంచి ఏదో వివరణ ఇచ్చుకుంటూ తప్పించుకుంటూ వస్తున్నారు.ప్రజాసంకల్ప యాత్రలో ఆదర్శ రైతులు ఆయా జిల్లాల్లో కలిసి ప్రత్యేకంగా వినతిపత్రాలను అందించారు. అంతేకాకుండా పాదయాత్రకు ముందు అసెంబ్లీలో కూడా వైఎస్ జగన్ ఆదర్శ రైతులను నిర్లక్ష్యం చేస్తున్నారని కూడా ప్రశ్నించారు. అదేవిధంగా జగన్ తన బహిరంగ సభల్లో కూడా చంద్రబాబును విమర్శించారు. ఆదర్శ రైతులను రోడ్డున పడేశారని, అధికారంలోకి వచ్చాక వారిని తమ ప్రభుత్వం ఆదుకుంటుందని బహిరంగ సభల్లో ప్రకటించారు. ఇదిలా ఉండగా జూన్ 23వ తేదీన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఆదర్శ రైతులు సుమారు నాలుగు వేల మంది వెళ్లి కలిసి వినతిపత్రాన్ని ఇచ్చారు. కానీ వారి సమస్య ఇప్పటి వరకు పరిష్కారానికి నోచుకోకపోవడంపై ఆందోళన వ్యక్తం చేశారు. వ్యవసాయ కమిషన్‌ను ఏర్పాటు చేయడాన్ని స్వాగతిస్తున్నామని, ఆదర్శ రైతుగా జాతీయ అవార్డు అందుకున్న పశ్చిమ గోదావరి జిల్లాలో ఆదర్శ రైతుగా పని చేసిన, ఆంధ్రప్రదేశ్ ఆదర్శ రైతు సంఘం ప్రధాన కార్యదర్శి కొప్పర్తి శ్రీనివాసరావు పేర్కొన్నారు.