యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:
తెలుగు రాష్ట్రాల్లో పట్టు పెంచుకొంటూ రాజకీయంగా ముందుకు వెళ్లాలనేది బీజేపీ ఆలోచన. కానీ వార్షిక బడ్జెట్ లో అటువంటి సూచనలు ఏమీ కనిపించడంలేదని పార్టీలు విమర్శిస్తున్నాయి. అయితే దీనిపై రాజకీయంగా ప్రత్యేక వ్యూహాన్ని కమలం పార్టీ సిద్ధం చేసుకున్నట్లుగా తెలుస్తోంది. ఆంధ్రప్రదేశ్ , తెలంగాణల్లోని ప్రధాన రాజకీయ పార్టీలైన వైసీపీ, టీఆర్ఎస్, టీడీపీ మూడింటికి చెక్ పెట్టేందుకు ఆర్థిక అస్త్రంగా ఈ బడ్జెట్ ను బీజేపీ నాయకులు పేర్కొంటున్నారు. పార్టీలు పెదవి విరుస్తున్నాయి. దీనికి విరుగుడుగా రానున్న మూడు నెలల కాలంలో ఈ రెండు రాష్ట్రాలకు సంబంధించిన పొలిటికల్ రోడ్ మ్యాప్ తో చక్రం తిప్పేందుకు కమలం అధిష్ఠానం రంగప్రవేశం చేస్తుందంటున్నారు. ఇప్పటికే తెలంగాణలో కొంత పట్టు సాధించేందుకు అవసరమైన సరంజామా రెడీ అయ్యింది. ఏపీలో వైసీపీ, టీడీపీలను కేంద్రసంస్థల దాడుల భయం వెన్నాడుతోంది. జగన్ మోహన్ రెడ్డి, చంద్రబాబు నాయుడుల గుట్టుమట్లన్నీ తెలిసిన కీలక వ్యక్తులు ప్రస్తుతం బీజేపీకి సహకారం అందిస్తున్నారు. రాజకీయంగా వారిని బలహీనపరచడం పెద్ద పనేం కాదని రాష్ట్రస్థాయిలో బీజేపీ నాయకులు బలంగా విశ్వసిస్తున్నారు. ఈలోపు రాష్ట్రంలో ప్రజావిశ్వాసాన్ని చూరగొనే చర్యలకు పార్టీ యంత్రాంగాన్ని తయారుగా ఉంచాలనుకుంటున్నారు. బడ్జెట్ పై తీవ్రస్థాయిలో అసంత్రుప్తి వ్యక్తం చేస్తున్న రాష్ట్రనాయకులకు కేంద్రం నుంచి భరోసా లభిస్తోంది. దీనిపై కంగారు పడాల్సిన పనేం లేదని ప్రత్యేక కార్యాచరణతో పార్టీకి జవసత్తువలు కల్పించే విధంగా పథకాల సహా ఆర్థిక సహకారం అందుతుందని చెబుతున్నారు.ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ప్రభుత్వాలకు గడ్డుకాలమే అని చెప్పాలి. కేంద్రంతో సన్నిహితంగా సంబంధాలు నెరుపుతూ పనులు చక్కబెట్టుకోవచ్చని కొంతకాలం క్రితం వరకూ టీఆర్ఎస్, వైసీపీ భావించాయి. ఎన్డీఏ అధికారంలోకి వచ్చి రాష్ట్రంలో తిరిగి తాము అధికారంలోకి వస్తే మళ్లీ ఆ గూటికి చేరేందుకు టీడీపీ సైతం సానుకూల సంకేతాలు పంపింది. అయితే టీడీపీ ఘోరపరాజయం పాలవ్వడంతో పూర్తిగా దూరం కావాల్సి వచ్చింది. టీఆర్ఎస్, వైసీపీలకు ఎన్నికలకు ముందు బీజేపీతో ఉన్న సంబంధాల్లో విపరీతమైన మార్పులు చోటు చేసుకున్నాయి. రాష్ట్రవిభజన చట్టం ప్రకారం రావాల్సిన పథకాలు, నిధులపై బడ్జెట్ లో పెద్దగా పట్టించుకోలేదు. కేవలం ఈ రెండు రాష్ట్రాలకే కాకుండా మిగిలిన రాష్ట్రాలకూ బడ్జెట్ వడ్డింపుల్లో పెద్దగా ప్రయారిటీ కనిపించకుండా కేంద్రం జాగ్రత్త వహించింది. తమ రాజకీయ ప్రాధాన్యాలకు అనుగుణంగా శాఖలవారీ కేటాయింపులను సర్దుబాటు చేసుకునేందుకు ఒక సదుపాయాన్ని అట్టే పెట్టుకుందని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు. విడిగా రాష్ట్రాలకు కొన్ని కేటాయింపులు కనిపిస్తాయి. కానీ నిబంధనల చట్రంలో బిగించడం ద్వారా వాటిని పూర్తిస్థాయిలో విడుదల చేయరు. ఆంధ్రప్రదేశ్ కు సంబంధించి రోడ్ల విస్తరణకు ఏడువందల కోట్ల రూపాయల పైచిలుకు నిధులను గత బడ్జెట్ లో కేటాయించారు. కానీ తొలిదశలో విడుదల చేసిన నిధులకు సంబంధించి పద్దులు చూపలేదని మొత్తం నిధుల విడుదలను నిలిపివేశారు. ఈరకమైన ఇబ్బందులు ఇతరత్రా అనేక పథకాలకూ వర్తింపచేస్తారు. సాంకేతికంగా చూస్తే ఎవరూ తప్పు పట్టలేరు. కానీ నిధులు మాత్రం కనిపించవు. పథకాలపై తమ వంతు పట్టుకోసం ఈ రకమైన వ్యూహాత్మక పంథాను అనుసరించబోతున్నట్లుగా పరిశీలకులు అంచనా వేస్తున్నారు.ఆంధ్రప్రదేశ్ ను గ్రిప్ లోకి తెచ్చుకోవడానికి ఇంతకు మించిన తరుణం దొరకదని భారతీయజనతాపార్టీ అధినాయకత్వం స్థానిక నాయకులకు నూరిపోస్తోంది. చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్న సమయంలో పార్టీ ఎదుగుదలకు వీలు లేకుండా పోయింది. మంత్రివర్గంలో ఇద్దరు ఉన్నప్పటికీ ఒకరు పూర్తిగా తెలుగుదేశం నాయకునిగా వ్యవహరించారనే విమర్శలు ఎదుర్కొన్నారు. ఇంకొకరికి పెద్దగా ప్రాధాన్యం లేకుండా చేశారు. అధికారపార్టీ తప్పిదాలపై తొలి మూడేళ్లు విమర్శలు చేయకుండా అధిష్టానమే కట్టడి చేయాల్సి వచ్చింది. దీంతో కేంద్రం ఏపీకి భారీగానే సాయం చేసినప్పటికీ బీజేపీ ప్రచారం చేసుకోలేకపోయింది. కేంద్ర ప్రభుత్వం లక్షలాది ఇళ్లను మంజూరు చేసినప్పటికీ టీడీపీ తన క్రెడిట్ లోనే వేసేసుకుంది. కాంగ్రెసు నుంచి బీజేపీలోకి పెద్ద నాయకులు వచ్చినప్పటికీ వారిని సక్రమంగా వినియోగించుకోలేకపోవడానికి ఆనాటి టీడీపీ ప్రభుత్వమే కారణంగా చెప్పుకోవాలి. ఇప్పుడు స్వేచ్ఛగా టీడీపీ, వైసీపీలను లక్ష్యంగా చేసుకుంటూ విమర్శలు చేయవచ్చు. లోపాలను బయటపెట్టవచ్చు. కేంద్ర పథకాలకు బడ్జెట్ లో నిధులు కేటాయించలేదని ప్రస్తుతం విమర్శలు వస్తున్నాయి. అయితే పోలవరం, రాజధాని, ఇతర కేంద్రపథకాలకు నిధులను ఆయా శాఖల నుంచి దశలవారీగా విడుదల చేస్తూ కేంద్రమంత్రుల పర్యటనలతో ఆ మొత్తం క్రెడిట్ ను పూర్తిగా బీజేపీ పద్దులోకి చేర్చాలనేది అధినాయకత్వం వ్యూహం. పోలవరానికి ఏడువేల కోట్ల రూపాయల వరకూ కేంద్రం ఇప్పటికే విడుదల చేసింది. అయితే చంద్రబాబు నాయుడు ఏమాత్రం బీజేపీకి గుర్తింపు లేకుండా చేశారని ఆ పార్టీ నాయకులు వాపోతున్నారు. జగన్ మోహన్ రెడ్డి కూడా అదే విధంగా చేయకుండా ముందుజాగ్రత్తలు తీసుకోవాలనుకుంటున్నారు.స్వాభావికంగా, సిద్ధాంతరీత్యా పార్టీ ఎదుగుదలకు అనువైన అవకాశాలున్న రాష్ట్రంగా తెలంగాణకు బీజేపీ అత్యధిక ప్రాధాన్యం ఇస్తోంది. నరేంద్రమోడీ మొదటి సారి ప్రధానిగా ఉన్న కాలంలో కేంద్రం నుంచి పెద్దగా తెలంగాణకు సాయం అందలేదనే చెప్పాలి. అయితే రాజకీయ సహకారం బాగా లభించింది. ఉమ్మడి రాష్ట్ర విభజన విషయాలలో తెలంగాణ మాటకే కేంద్రం మద్దతు ప్రకటించింది. తాను జోక్యం చేసుకుని పరిష్కరించదగిన అంశాలను కూడా తెలంగాణకు ఇబ్బందికరమనే కోణంలో పెండింగులో పెట్టింది. కొన్నిటిని వాయిదా వేసింది. కేసీఆర్ , మోడీలు అనేక విషయాల్లో పరస్పరం సహకరించుకున్నారు. ముందస్తు అసెంబ్లీ ఎన్నికలకు కూడా కేంద్రం మోకాలడ్డలేదు. కేంద్ర ఎన్నికల సంఘానికి క్లియరెన్స్ ఇచ్చేసింది. ఆర్థిక కోణంలో సహకారం అంతంతమాత్రంగానే ఉన్నప్పటికీ ప్రతిపాదించిన ప్రాజెక్టులకు క్లియరెన్సులు చాలా వేగంగా మంజూరు చేసింది. కాళేశ్వరం ప్రాజెక్టు , థర్మల్ విద్యుత్ కేంద్రాల విషయంలో ఈ సహకారం కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది. ప్రస్తుత పాలన కాలంలో కేంద్రప్రాజెక్టులను ఎక్కువగా మంజూరు చేసి క్రెడిట్ పొందాలనే యోచనలో ఉన్నట్లుగా తెలుస్తోంది. తెలంగాణ ప్రాంతాన్ని పార్టీ పరంగా నాలుగు విభాగాలుగా వర్గీకరించుకుని కేంద్రమంత్రులకు ప్రత్యేకబాధ్యతలు అప్పగించాలని భావిస్తున్నారు. ముగ్గురు ఎంపీలు, కేంద్రమంత్రి, కొత్తగా పార్టీలోకి వచ్చిన ఇతర పార్టీల అగ్రనాయకులు కలిసికట్టుగా కదిలేందుకు అవసరమైన కార్యాచరణకు అమిత్ షా ఇప్పటికే ఆదేశాలిచ్చారు. తెలంగాణ నుంచి వచ్చే ప్రతిపాదనలు అన్నిటికీ కేంద్రం సత్వర మంజూరులు ఇస్తుందని అభయమిచ్చారు. దీంతో తెలంగాణలోనూ పొలిటికల్ రూట్ క్లియర్ అయినట్లుగా చెబుతున్నారు.