ఒకరు సైలెంట్‌గా వుండే బుల్లెట్.. మరొకరు దూకుడుగా వుండే రాకెట్. ఇద్దరూ ఇద్దరే...ఏపీలో కమలదళానికి స్పెషల్ ఇమేజ్ క్రియేట్ చేసిన ట్రెండ్ సెట్టర్స్...వారెవరో కాదు, ఏపీలో బీజేపి నేతలు విష్ణుకుమార్ రాజు, కంభంపాటి హరిబాబు.అయితే ప్రజెంట్ వీరి సైలెంట్ దేనికి సంకేతం. పార్టీకి విధేయత లేక విశాఖలో ఓటమి అస్థిరతా పొలిటికల్ వింగ్స్‌లో మాత్రం మౌనమేలనోయి అంటున్నారు వీరి పరిస్థితి చూసిన లీడర్స్. కంభంపాటి హరిబాబు. మొదటి నుంచి బీజేపీకి వీర విధేయుడు. ప్రకాశం జిల్లా వాసి అయినా, విశాఖ ఆంధ్రా యునివర్శీటీతో ఎనలేని బంధం ఆయనది. తాను చదువుకున్న ఏయూ నుంచి ఉద్యోగం పొంది ప్రొఫెసర్‌గా పనిచేసారు. విద్యార్ధి దశ నుంచి బీజేపీ అనుబంధ స్టూడెంట్ వింగ్స్‌లో చురుకైన పాత్ర పోషించారు. విద్యార్థి సంఘాల్లో వెంకయ్యనాయుడు వంటివారితో పనిచేసిన అనుభవంతో 1993లో ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చారు.1993లో ఏపీ బీజేపీ స్టేట్ ఎక్సిక్యూటివ్ మెంబర్‌గా, 1999లో ఎమ్మెల్యే,గా గెలుపొందారు. 2014 వరకు రాష్ట్ర అధ్యక్షుడి వంటి పదవులు చేశారు. 2014లో విశాఖ ఎంపీగా గెలుపొందారు. అయితే తరువాత జరిగిన రాజకీయ పరిణామాలతో 2019లో ఎన్నికల్లో పోటీ చేయలేదు. అయితే హరిబాబు పార్టీకి విధేయుడుగా వున్నా, కూడా మంత్రి పదవి వచ్చినట్టే వచ్చి చేజారిపోయింది. దీంతో హరిబాబు రాజకీయంగా తటస్థంగా వుండటంపై చాలా ఊహాగానాలు వినిపించాయి. అవేమి తనకు పట్టవు అన్నట్లుగా వుంటున్నారాయన. అవే అనేక సందేహాలకూ ఆస్కారమిస్తున్నాయి. మరొక బీజేపి లీడర్ పెనుమత్స విష్ణుకుమార్ రాజు. వెస్ట్ గోదావరికి చెందిన నేత. విశాఖలో స్థిరపడ్డంతో ఇక్కడే రాజకీయ రంగ ప్రవేశం చేశారు. 2014లో ఎమ్మెల్యేగా అఖండ మెజారిటీతో గెలుపొందిన నాయకుడు, విద్యావంతుడు, వ్యాపారవేత్త, టీడీపీ, బీజేపి స్నేహబంధంలో భాగంగా విశాఖ ఉత్తర నియోజకవర్గం నుంచి బీజేపి అభ్యర్ధిగా పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలుపొందారు. అయితే ఉన్నది ఉన్నట్లు మొహం మీద చెప్పడంతో పాటు, తప్పు చేస్తే సొంతపార్టీని సైతం లెక్క చేయని నిక్కచ్చితనం విష్ణుకుమార్ రాజు నైజం. ఆ దూకుడు తత్వమే ఇప్పుడాయనకు కలసిరాలేదన్న చర్చ రాజకీయవర్గాల్లో వినిపిస్తొంది. దీంతో విష్ణు కూడా సైలెంట్ అయిపోయారు. మరి ఫైర్ బ్రాండ్ ఇమేజ్ నుంచి ఒక్కసారి సైలెంట్ అవ్వడంతో రాజకీయాల్లో రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. పార్టీ మారుతున్నారని ప్రచారం జరిగినా అదేం లేకపోవడంతో వాట్ నెక్స్ట్ అని అంతా ఎదురు చూస్తున్నారు. మరి ఏది ఏమైనా ఇద్దరు బ్రాండ్ లీడర్స్ ఒక్కసారిగా సైలెంట్ అయిపోవడంతో, సాగరతీరంలో బీజేపీ ప్రాబల్యం తగ్గిపోతోంది. ఏపీలో ఎదగాలనుకుంటూ, అనేక చేరికలతో బలపడాలనుకుంటున్న బీజేపీ, ఈ ఇద్దరు కీలక నేతలను మాత్రం పట్టించుకోవడం లేదన్న చర్చ సాగుతోంది. దీనికి తోడు వీరు కూడా, కామ్‌గా ఉండటంతో ఊహాగానాలకు ఆస్కారమేర్పడుతోంది. మొత్తానికి ఈ సైలెంట్‌కు వీరే తెరదిస్తారా...కీలకమైన పదవులిచ్చి కాషాయ అధిష్టానమే యాక్టివ్ చేస్తుందా అన్నది రానున్న కాలమే తేల్చాలి.