యువ్ న్యూస్ జనరల్ బ్యూరో:
నిత్యం తిరుమల శ్రీవారి దర్శనానికి వేల సంఖ్యలో భక్తులు తరలిరావడంతో వాహనాల రాకపోకలు అధికంగా ఉంటున్నాయి. దీంతో వాహనాల నుంచి వెలువడే పొగ వల్ల కాలుష్యం పెరిగిపోతుంది. దీన్ని నియంత్రించేందుకు అధికారులు నడుం బిగించారు. ఆధ్యాత్మిక నగరంలో కాలుష్యాన్ని తగ్గించేందుకు ఎలక్ట్రికల్ వాహనాలు ఇచ్చేందుకు సిద్ధమవుతున్నారు. ఈ విషయమై ట్యాక్సీ యూనియన్ నేతలతో తిరుపతి మున్సిపల్ కమిషనర్ గిరీషా శనివారం సమావేశమై చర్చించారు. తొలి దశలో 500 వాహనాలను కొనుగోలు చేసేందుకు టీటీడీ, బ్యాంకుల నుంచి ఆర్థిక సహాయాన్ని అందజేయడానికి చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. పెరిగిపోతున్న కాలుష్యాన్ని నియంత్రించే చర్యల్లో భాగంగా ఇప్పటికే 80 ఎలక్ట్రికల్ బస్సులను కొనుగోలు చేయడానికి ఆర్టీసీ సిద్ధమైంది. వాహన కాలుష్యాన్ని నియంత్రించే చర్యల్లో భాగంగా తిరుమలకు వెళ్లే గుర్తింపు ఉన్న 1600 వాహనాలను దశల వారీగా తప్పించి, వాటి స్థానంలో ఎలక్ట్రికల్ వెహికల్స్ నడుపుతారు. తొలి దశలో 500 ఎలక్ట్రిక్ వాహనాలను నడుపుతారు. ఇందుకు అవసరమైన రుణాలు ఇప్పించేందుకు మున్సిపల్ కార్పొరేషన్ ముందుకు వచ్చింది.అలాగే, ఎలక్ట్రిక్ వాహనాలకు రాయితీలు అందజేయాలని కోరుతూ కేంద్రానికి మున్సిపల్ కమిషనర్ లేఖ రాయనున్నారు. స్మార్ట్ సిటీ ప్రాజెక్టులో భాగంగానే ఈ ప్రతిపాదనను పరిగణనలోకి తీసుకోవాలని కోరుతున్నారు. కార్పొరేషన్ ద్వారానే 100 వాహనాలను అందజేసే అంశాన్ని సైతం పరిశీలిస్తున్నారు. ఒక్కో వాహనం సుమారు రూ.10 లక్షల నుంచి రూ.12 లక్షలు వరకు ఉంటుందని అంచనా. అంటే దీనికి సుమారు రూ.12 కోట్లు ఖర్చవుతుంది. ఈ భారం వాహన యజమానులపై ఒక్కసారిగా పడకుండా నెలవారీ వాయిదాల చెల్లించేలా ప్రణాళికలు రూపొందిస్తున్నారు. ఈ అంశంపై త్వరలో టీటీడీ ఈవోతోనూ మున్సిపల్ కమిషన్ భేటీ కానున్నారు. ఎలక్ట్రిక్ వాహనాలను వినియోగిస్తే ఐదేళ్ల పాటు పన్ను రాయితీ ఉంటుంది. నేషనల్ పర్మిట్ ఉంటే ఎక్కడైనా తిప్పుకునేందుకు ఆస్కారం ఉంటుంది. ఇటీవల కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్‌లోనూ ఎలక్ట్రికల్ వాహనాలు కొనుగోలుదారులకు రాయితీలు ఇస్తున్నట్టు ప్రకటించారు.