తెలంగాణలో టీడీపీ అంతరించిపోయిందంటూ సీనియర్ నేత మోత్కుపల్లి నర్సింహులు చేసిన సంచలన వ్యాఖ్యలు పార్టీలో కలకలం రేపుతున్నాయి. టీటీడీపీని టీఆర్‌ఎస్‌లో విలీనం చేయడం మంచిదన్న మోత్కుపల్లి వ్యాఖ్యలపై పార్టీలో తీవ్ర చర్చ జరుగుతోంది. చంద్రబాబు డైరెక్షన్‌లోనే మోత్కుపల్లి ఈ వ్యాఖ్యలు చేశారా? అన్న సందేహం పార్టీ వర్గాల్లో వ్యక్తమవుతోంది. ఓటుకు కోట్లు కేసులో అడ్డంగా దొరికిపోయిన తర్వాత చంద్రబాబు టీటీడీపీని పట్టించుకోవడం మానేశారు. హైదరాబాద్ నుంచి మకాం విజయవాడకు మార్చారు.
నామినేటెడ్ ఎమ్మెల్యేను కొనుగోలు చేసేందుకు డబ్బులు ముట్టజెప్తూ టీటీడీపీ నేత రేవంత్‌రెడ్డి రెడ్‌హ్యాండెడ్‌గా దొరికిపోయిన సంగతి తెలిసిందే. అంతేకాకుండా ఈ కేసులో నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్ సన్‌తో ఫోన్‌లో మాట్లాడుతూ చంద్రబాబు కూడా దొరికిపోయారు. ఫోన్‌లో చంద్రబాబు పేర్కొన్న ‘మనవాళ్లు బ్రీఫుడ్ మీ’ వ్యాఖ్యలు వైరల్ అయ్యాయి. బలంగా ఉన్న ఈ కేసు నుంచి తప్పించుకునేందుకే మోత్కుపల్లితో చంద్రబాబు ఈ వ్యాఖ్యలు చేయించి ఉంటారని టీటీడీపీ శ్రేణులు అనుమానిస్తున్నాయి. ఈ కేసుకు ముందు కేసీఆర్ అంటే నిప్పులు చెరిగిన చంద్రబాబు.. కేసు తర్వాత కేసీఆర్‌కు అనుకూలంగా ఉండేందుకు ప్రయత్నిస్తున్నారు. సీఎం కేసీఆర్‌కు సానుకూలంగా వ్యవహరిస్తున్న చంద్రబాబు తీరు నచ్చక ఇటీవలే రేవంత్‌రెడ్డి టీడీపీకి గుడ్‌బై చెప్పారు. అదేమాటలో మరికొందరు టీటీడీపీ నేతలు ఉన్నట్టు తెలుస్తోంది.
మోత్కుపల్లి సంచలన వ్యాఖ్యలివే..!
‘ఎన్టీఆర్ ఘాట్ హైదరాబాద్‌లోనే ఉంది. ఎన్ని పనులున్నా చంద్రబాబు హైదరాబాద్‌కు రావాల్సిందే. తెలంగాణలో టీడీపీ అంతరించిపోయిందన్న వాతావరణం నెలకొంది. భుజాన ఎత్తుకొని పార్టీ కాపాడుకుందామన్న సహకరించే వారు లేరు. తెలంగాణలో పార్టీ అంతరించిపోయి.. మనుగడే లేదనడం కన్నా టీడీపీని టీఆర్ఎస్‌లో విలీనం చేయటం మంచిది. టీఆర్ఎస్ కూడా మన పార్టీనే, కేసీఆర్ మన దగ్గరి నుంచి వెళ్లిన వ్యక్తే. చంద్రబాబు ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇక్కడ పార్టీకి సమయం కేటాయించలేరు. గౌరవంగా ఉండాలంటే తెలంగాణలో తెలుగుదేశం ఓటు బ్యాంకు కోసం, పార్టీ కార్యకర్తల కోసం టీఆర్‌ఎస్‌లో విలీనమే మంచిది’ అని మోత్కుపల్లి పేర్కొన్న సంగతి తెలిసిందే.