యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:
సార్వత్రిక ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయిన తెలుగుదేశం పార్టీ రాజకీయ భవిష్యత్తుపై ఆ పార్టీ నేతలకే స్పష్టమైన క్లారిటీ లేదు. ఐదేళ్ల తర్వాత పార్టీ తిరిగి పుంజుకుంటుందా ? అన్న సందేహాలు చాలా మందికి ఉండడంతో రాజకీయంగా ఎవరికి వారు తమ భవిష్యత్తు కోసం ఇతర పార్టీల వైపు చూస్తున్నారు. ఇదిలా ఉంటే చిత్తూరు జిల్లాలో చంద్రబాబునాయుడు సొంత నియోజకవర్గంమైన కుప్పం ఆయనకు ఎంత కంచుకోటో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. 1989 ఎన్నికల నుంచి 2019 ఎన్నికల వరకు వరసగా ఓటమి అనేది లేకుండా కుప్పంలో చంద్రబాబు భారీ మెజారిటీతో విజయాలు సాధిస్తూ వస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ ఘోరంగా ఓడిపోతే కుప్పంలో చంద్రబాబునాయుడు కేవలం 30,000 ఓట్ల మెజారిటీతో గెలిచారు. మరో వైపు ముఖ్య మంత్రి జగన్ తన సొంత నియోజకవర్గమైన పులివెందులలో ఏకంగా 90,000 మెజారిటీతో గెలవడం… కుప్పంలో బాబు మెజారిటీ గతంలో కంటే దారుణంగా పడిపోవడంతో ఆయనలో అంతర్మదనం మొదలైంది. ఈ ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు అసలు కుప్పం నియోజకవర్గంలోనే అడుగుపెట్టలేదు. రాష్ట్రవ్యాప్తంగా ప్రచారం చేసిన ఆయన కుప్పం వైపు చూడలేదు. తీరా ఎన్నికల ఫలితాల్లో చూస్తే కుప్పం ప్రజలు బాబుకు అదిరిపోయే షాక్ ఇచ్చారు.చంద్రబాబునాయుడును కేవలం 30 వేల మెజార్టీతో మాత్రమే గెలిపించారు. విచిత్రం ఏంటంటే సీఎంగా ఉన్న వ్యక్తి తన సొంత నియోజకవర్గంలో నాలుగైదు రౌండ్లలో వెనుకబడ్డారు. చివరకు పుంజుకుని విజయం సాధించారు. ఈ క్రమంలోనే వైసీపీ అధినేత జగన్ సైన్యాన్ని వదిలిపెట్టి ఏకంగా రాజుకే చెక్ పెట్టాలన్న ప్లాన్‌తో కుప్పం నియోజకవర్గాన్ని టార్గెట్ చేసినట్టు తెలుస్తోంది. ఎన్నికలకు ముందు కూడా కుప్పం పై ప్రత్యేకంగా దృష్టి పెట్టిన జగన్ అక్కడ బీసీ సామాజికవర్గానికి చెందిన చంద్రమౌళికి సీటు ఇచ్చారు. ఈ ఎన్నికల్లోనే చంద్రబాబు మెజారిటీ చాలా వరకు పడిపోగా… 2024 కోసం ఇప్పటి నుంచే పగడ్బందీ వ్యూహాన్ని వైసీపీ అమలు చేస్తోంది. అందుకే చంద్రబాబు టెన్షన్ పడుతూ ఆఘమేగాల మీద కుప్పం పర్యటన పెట్టుకున్నట్టు తెలుస్తోంది.ఒకప్పుడు కమ్యూనిష్టులకు కంచుకోటగా ఉన్న ఈ నియోజకవర్గంలో చంద్రబాబునాయుడు వరుస విజయాలు సాధిస్తూ వచ్చారు. మూడు సార్లు ముఖ్యమంత్రిగా, రెండు సార్లు ప్రతిపక్ష నేతగా ఉన్నా ఆయనకు నియోజకవర్గ ప్రజలు ఎప్పుడూ అఖండ మెజారిటీనే కట్టపెట్టారు. ఈ సారి మాత్రం ఆయనకు షాక్ తప్పలేదు. విచిత్రం ఏంటంటే ఎన్నికలకు ముందు చంద్రబాబు పత్యర్థి చంద్రమౌళి తీవ్రమైన ఆనారోగ్యంతో ప్రచారం కూడా చెయ్యలేదు. అయినా జనాలు మాత్రం చంద్రమౌళికి అంచనాలకు మించి ఓట్లు వేశారు. చంద్రబాబు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా కుప్పంలో రాజకీయ పరంగా ఆయనకు ఎప్పుడు ఇబ్బందులు లేవు. కానీ ఈ ఎన్నికల నుంచి వైసీపీ వాళ్లు బాబు టార్గెట్‌గా కుప్పంలో కూడా పెద్ద ఎత్తున్న ప్రయోగాలు చేస్తున్నారు.కుప్పంలో చంద్రబాబు సామాజికవర్గానికి చెందిన ఓట్లు చాలా తక్కువ. ఇక్కడ ఆయన సామాజికవర్గం ఓట్లు లేకుండా కూడా ఆయన ఆధిపత్యం ఏంటన్న కోణంలోనూ వైసీపీ ప్రజల్లోకి వెళుతోంది. వచ్చే ఎన్నికల నాటికి చంద్రబాబును ఇక్కడ ఎలాగైనా ఓడించాలన్న క్రమంలో నియోజకవర్గంలో ఎక్కువగా ఉన్న వన్నికుల, రెడ్డి సామాజికవర్గాలకు వైసీపీ బాగా ప్రయార్టీ ఇస్తోంది. ఇప్పటికే చంద్రబాబును టార్గెట్ చేసే బ్యాచ్ కుప్పంలో రెడీ అయిందన్న ప్రచారం కూడా జరుగుతోంది. ఈ క్రమంలోనే చంద్రబాబు తాజా కుప్పం పర్యటనలో ఆయన ఫ్లెక్సీలు, బ్యానర్‌లు కూల్చిన సంగతి తెలిసిందే. కొన్ని సంవత్సరాలుగా కుప్పంలో టీడీపీ మినహా మిగిలిన పార్టీలకు చెందిన బ్యానర్‌లను కూడా టీడీపీ నేతలకు ఇలాగే కూల్చేసేవారు.
ఇప్పుడు వైసీపీ వాళ్లు టీడీపీ బ్యానర్‌లనే టార్గెట్ చేసుకుని ఎటాక్ చేస్తున్నారు. ఇప్పటికే అధిష్టానం నుంచి ప్రభుత్వ అధికారులు, పోలీసులకు వైసీపీ వాళ్లకు పూర్తిగా సహకరించాలన్న ఆదేశాలు అందినట్టు కూడా తెలుస్తోంది. మరో వైపు జిల్లాకే చెందిన మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సైతం కుప్పంపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు. మరో వైపు చంద్రబాబునాయుడు ఐదేళ్ల పాటు కుప్పంను పెద్దగా పట్టించుకోలేదు. ఆయన పూర్తిగా కేడర్‌నే నమ్ముకుని నియోజకవర్గాన్ని గాలికి వదిలేయటం కూడా ఆయన మెజారిటీ పడిపోవడానికి ప్రధాన కారణం. ఇక చంద్రబాబు వెంటే మూడు దశాబ్దాలుగా నడుస్తున్న కుప్పం ప్రజల్లో మార్పు స్పష్టంగా కనపడుతోంది. ముఖ్యంగా కొత్త ఓటర్లు…. యువతరం ఓటర్లు చంద్రబాబుకు క్రమక్రమంగా దూరమవుతున్న పరిస్థితి కూడా కనిపిస్తోంది. పాతతరం ఓటర్లు… సీనియర్లు మినహా ఈ తరం ఓటర్లు ప్రజలు వైసీపీ, ఇతర పార్టీల వైపు చూస్తున్నారన్నది స్పష్టంగా తెలుస్తుంది. అందుకే కుప్పంలో చంద్రబాబు కంచుకోట కరుగుతూ వస్తోంది. బాబు ఇప్పటికైనా జాగ్రత్త పడకపోతే 2024 ఎన్నికల నాటికి కుప్పంలో ఆయన సీన్ రివర్స్ అవ్వడం ఖాయం.