గుంటూరు జిల్లాల్లో మహిళలు, బాలికలపై వేధింపులు, లైంగిక వేధింపులు, అత్యాచారాలు, హత్యలతో పాటు పోక్సో కేసులు కూడా గతంలో ఎన్నడూ లేనివిధంగా పెరిగాయి.పోలీసులు విడుదల చేసిన గణాంకాల్లో మహిళలపై అకృత్యాలు పెరిగి ఆందోళనకు గురిచేయగా, ఆస్తి రికవరీ గణనీయంగా పెరగడం కొంతమేర పోలీసులకు ఉపశమనం కల్గించింది. మహిళలపై వివిధ కేసుల్లో 2018 తొలి అర్ధ సంవత్సరంలో 274 కేసులు నమోదు కాగా ఈ ఏడాది అదికాస్తా 457కు పెరిగింది. వీటిలో లైంగిక వేధింపుల కేసులు అత్యధికంగా 107 నమోదు కాగా, వివిధ సెక్షన్లతో కూడిన వేధింపులపై 283 కేసులు నమోదయ్యాయి. గత ఏడాదితో పోలిస్తే 50 శాతం మేర ఈ తరహా కేసులు పెరిగాయి. మొత్తంగా చూసుకుంటే హత్యలు, అత్యాచారాలు, దోపిడీలు, మోసాలు, కిడ్నాప్‌లు తదితర కేసులు గత ఏడాదిలో 2010 నమోదు కాగా ఈ ఏడాది 2432 నమోదయ్యాయి. రహదారి ప్రమాదాలు కూడా పెరిగాయనే చెప్పొచ్చు. 2017లో రోడ్డు ప్రమాదాల్లో 158 మంది మృతిచెందగా, 416 మంది గాయపడ్డారు. ఈ ఏడాది 150 మంది మరణించగా, 455 మంది క్షతగాత్రులయ్యారు. ఇలా ఉండగా సొత్తు రికవరీలో మాత్రం పోలీసుల పనితీరు అద్భుతంగా ఉంది. గత ఏడాది 2,57,78,960 రూపాయలు చోరీకి గురికాగా, 92,64,160 (36 శాతం) రూపాయలు రికవరీ చేశారు. ఈ ఏడాది 4,58,43,270 రూపాయల విలువైన సొత్తు చోరీకి గురికాగా 2,40,06,330 (52 శాతం) రూపాయల సొత్తును రికవరీ చేశారు.